లైఫ్ ఈజ్ సో సింపుల్ నాన్నా...
వెంకటేశ్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడినా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఓ స్టార్లా కాకుండా ఓ కామన్ మ్యాన్‌లా ఆయన థింకింగ్ ఉంటుంది. జయాపజయాలు, ఇమేజ్‌ల కోణంలో కాకుండా ఓ ఆధ్యాత్మిక ధోరణిలో ఆలోచిస్తారు. పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన నటించిన ‘గోపాల గోపాల’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వెంకటేశ్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన 7 ఆసక్తికరమైన విషయాలు.
# ‘గోపాల గోపాల..’ ఇది గాడ్కి సంబంధించిన సినిమా. వినోదం తప్ప ఎక్కడా సందేశాలుండవు. నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించారు.
# ‘ఓ మై గాడ్’ని తెలుగులో చేద్దామనుకున్నపుడు, దేవుడి పాత్రకు పవన్‌కల్యాణ్ కరెక్ట్ అని మేమంతా అనుకున్నాం. అతను కూడా వెంటనే ఓకే చెప్పారు. అయినా మేమిద్దరం ఎప్పటి నుంచో కలిసి సినిమా చేయాలనుకుంటున్నాం. ఇన్నేళ్లకు ఇలా కుదిరింది.
# పవన్‌కల్యాణ్‌లో మంచి కామిక్సెన్స్ ఉంది. చాలా ఫెయిర్ పర్సన్. దేవుడి పాత్ర చేయాలంటే చాలా డివైన్‌గా ఉండాలి. అంత ప్యూరిటీ,
పాజిటివ్ ఎనర్జీ పవన్‌లో ఉన్నాయి.
# నాకు దైవభక్తి ఉంది. కాకపోతే ఒక దేవుణ్ణే కొలవడం అంటూ ఏమీ లేదు. ఈ ప్రపంచాన్ని ఏదో ఒక శక్తి నడిపిస్తుందని నమ్ముతాను. అసలు దేవుడు మనలోనే ఉన్నాడని నమ్ముతా. నేను రీమేక్‌లే చేయాలని నిబంధన పెట్టుకోలేదు. కథ నచ్చడమే నాకు ప్రధానం.
# మా అబ్బాయి అర్జున్ రామ్‌నాథ్ స్కూల్‌కి వెళుతున్నాడు. ఈమధ్య నా దగ్గరకు వచ్చి ‘లైఫ్ ఈజ్ సో సింపుల్ నాన్నా’ అని చెప్పాడు. ఆశ్చర్యపోయాన్నేను. పిల్లలకు ఆధ్యాత్మికత గురించి కూడా కొంచెం, కొంచెం చెబుతూ ఉండాలి.
# మనకు ఉన్నంతమంది యంగ్ హీరోలు ఇంకెక్కడా లేరు. అందరూ బాగా చేస్తున్నారు. పోటీ ఎక్కువ ఉంది కాబట్టి, వాళ్ల మీద ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది.