మద్యం టెండర్లపై మంత్రదండం!
► ఔత్సాహిక వ్యాపారులకు బెదిరింపులు
► దరఖాస్తులు వేయవద్దని పరోక్ష హెచ్చరికలు
► అధికార పార్టీ నాయకుడి అనుచరుల ఆగడాలు
► దుకాణాలు దక్కించుకోవడానికి తీవ్ర యత్నాలు!
► దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు
► జిల్లావ్యాప్తంగా ‘ఎంట్రీ పాసులు’ 883!
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: జిల్లాలోని 239 మద్యం దుకాణాలకు గత ఏడాది 6,267 దరఖాస్తులు వచ్చాయి.. గురువారం సాయంత్రానికి కల్లా గడువు ముగియనున్నా ఈ సంవత్సరం మాత్రం ఇప్పటివరకూ ఆ స్థాయి హడావుడి కనిపించట్లేదు! నేటి సాయంత్రంలోగా దరఖాస్తులు ఆన్లైన్లో దాఖలైతేనే పరిశీలనకు తీసుకుంటారు. బుధవారం సాయంత్రానికి 2,385 దరఖాస్తులు వచ్చాయి. కానీ దరఖాస్తుల ప్రక్రియలో ప్రారంభ దశ ‘ఎంట్రీ పాసు’ దక్కినవి మాత్రం 883 మాత్రమే! మిగతావి పరిశీలన దశలో ఉన్నాయి.
అసలు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడానికి నిన్నటి వరకూ అమావాస్య సెంటిమెంట్ గురించి చెప్పినా తెరవెనుక బలమైన కారణం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడి అనుచరుల బెదిరింపులే కారణమని ఔత్సాహికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం సిండికేట్ వ్యవహారాల్లో ఆరితేరిన తన అనుచరులకే దుకాణాలను కట్టబెట్టేందుకు సదరు నాయకుడు వ్యూహం ప్రకారం చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మద్యం సీసాపై రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా వసూలు చేస్తున్నా ఇప్పటివరకూ మద్యం దుకాణాలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీనివెనుక అధికార పార్టీ నేతల అనుచరులు సిండికేట్ అవతారం ఎత్తి చక్రం తిప్పడమే కారణమని తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ఇలా వసూలు చేసింది కోట్ల రూపాయలే ఉంటుందని అనధికార అంచనా. మరోవైపు బెల్ట్‌షాపులు, బ్రాండ్ మిక్సింగ్, కల్తీ మద్యం.. ఇలా రెండు చేతులా సంపాదించేందుకు ఇదో మంచి వ్యాపారంగా మారిపోయింది. దీంతో చాలా మంది ఔత్సాహికులు ఈ వ్యాపారంలోకి దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. దీనికితోడు ఒక వ్యక్తికి ఒకే దుకాణం కేటాయిస్తామంటూ ఎక్సైజ్ అధికారులు చెప్పడం కూడా దానికి ఊతమిచి్చంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వస్తాయని ఎక్సైజ్ అధికారులు భావించినా జిల్లాలో అందు కు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేయాల్సి ఉంది. ఈ ప్రకారం మరో రెండు రోజులే సమయం ఉంది. మంగళవారం నాటికి ఆన్లైన్లో 178 మాత్రమే దరఖాస్తులు దాఖలయ్యాయి. బుధవారం ఉగాది కావడంతో కాస్త ఊపందుకున్నాయి. కానీ 2,385 దరఖాస్తులే వచ్చాయి. వాటిలో ప్రాథమిక పరిశీలన పూర్తయ్యి ఎంట్రీపాస్ దక్కింది మాత్రం 883 దరఖాస్తులకే! మిగతావన్నీ పరిశీలనలో ఉన్నాయి.
గెజిట్‌లో సవరణలు...
శ్రీకాకుళం, పలాస ఎక్సైజ్ విభాగాల పరిధిలో 239 మద్యం దుకాణాలు ఉన్నాయి. వాటిని వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2019 జూన్ 31వ తేదీ వరకూ నిర్వహించుకునేందుకు లైసెన్స్ జారీ చేయడానికి ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ 2019 మార్చి 31వ తేదీ వరకే కాలపరిమితిని కుదిస్తూ మంగళవారం గజిట్ నంబరు 61ని విడుదల చేసింది. లైసెన్స్ ఫీజు కూడా రెండు సంవత్సరాలకు చెల్లించాల్సి ఉంటుంది.
ఒక్క రోజుపైనే దృష్టి...
గత ఏడాది కన్నా ఈసారి దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నాలుగు రోజుల్లో స్పందన పూర్తిగా కరువైంది. అధికారులు అంచనా వేసినట్లే అధికార పార్టీలో ఓ ముఖ్య నాయకుడి అనుచరులు కూడా ఔత్సాహిక దరఖాస్తుదారులు ఎక్కువ మంది ఉంటారని అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా శ్రీకాకుళం, టెక్కలి, పలాస, రణస్థలం, పాతపట్నం ప్రాంతాల్లో వేరెవ్వరూ దరఖాస్తులు దాఖలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. తన అనుయాయుల ద్వారా ఔత్సాహికులు ఎవరో తెలుసుకొని మరీ బెదిరింపులకు దిగుతున్నారు. దీనిపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్తున్నట్లు తెలిసింది. వాటని్నంటినీ తట్టుకొని గురువారం ఆన్లైన్లో ఎంతమంది దరఖాస్తులు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
బందోబస్తు ఏర్పాట్లు...
అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల బెదిరింపులపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మరోవైపు ఎక్సైజ్ అధికారులు కూడా వేలం ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించడానికి తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ ఆధ్వర్యం లో ఈనెల 31వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీకాకుళంలోని వైఎస్సా ర్ కల్యాణ మండపలో లాటరీ ద్వారా వేలం పాట నిర్వహించనున్నారు. ఎక్సైజ్ శాఖ ఇన్చార్జ్ డిప్యూటీ కమిషనర్ పి.శివప్రసాద్, సూపరింటెండెంట్ జి.నాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.