నగరంలో మరో రైతు ఆత్మహత్య
* ఉరేసుకుని చనిపోయిన మెదక్ జిల్లా రైతు మల్లేశం
* వాచ్‌మన్ పనికోసం వచ్చి అనంత లోకాలకు..
* కూతురు పెళ్లికి ఊళ్లో ఎకరా భూమి అమ్మకం
* మిగిలిన రెండెకరాలు అప్పు కింద తనఖా
* అప్పులోళ్ల వేధింపులతో గుండె చెదరి పట్నం దారి..
* మృతుడు మాజీ మావోయిస్టు లింబయ్య ఘటన మరవకముందే
* హైదరాబాద్‌లో మరో విషాదం
సాక్షి, హైదరాబాద్/గజ్వేల్: రాజధాని నగరంలో మరో విషాదం. మొన్న లింబయ్య ఉదంతం మరవకముందే మరో రైతు అప్పుల ఉరితాడుకు వేలాడాడు. ఓవైపు ఎండిన పంటలు, మరోవైపు అప్పుల కుప్పలతో దిక్కుతోచక హైదరాబాద్‌లో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. బతుకుదెరువు వెతుక్కుంటూ నాలుగు రోజుల క్రితం నగరానికి చేరుకున్న ఆ రైతు శనివారం రాత్రి బేగంపేట సమీపంలో ఓ చెట్టుకు ఉరేసుకున్నాడు. సరిగ్గా పది రోజుల క్రితం లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద కరెంట్ స్తంభానికి ఉరేసుకుని నిజామాబాద్ జిల్లాకు చెందిన లింబయ్య ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
ఉపాధి కరువై.. బతుకు బరువై..
మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం రాంసాగర్ గ్రామానికి చెందిన జొగ్గొల్ల మల్లేశం (58)కు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లయ్యాయి. కుమారుడు.. భార్యపిల్లలతో హైదరాబాద్‌కు వలస వెళ్లి ఫ్రిజ్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. మల్లేశంకు ఊళ్లో మూడెకరాల భూమి ఉండగా... అందులో ఎకరా భూమి చిన్న కూతురు పెళ్లి కోసం అయిదేళ్ల క్రితమే అమ్మేశాడు. మిగిలిన రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీననం సాగిస్తున్నాడు. వరుసగా అయిదేళ్లు నష్టాలే మిగిలాయి.
కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు భారంగా మారాయి. రూ.50 వేల అప్పు కింద మల్లేశంకు చెందిన రెండెకరాల భూమిని ఈ ఖరీఫ్‌లోనే ఓ వ్యక్తి గిరి(తనఖా) పెట్టుకున్నాడు. దీంతో సాగు పని కూడా లేకపోవడంతో మల్లేశంకు ఉపాధి కరువైంది. అప్పులోళ్లు ఇంటికి వచ్చి వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బతుకుదెరువు కోసం ఈనెల 16న హైదరాబాద్ వచ్చాడు. తొలుత అల్వాల్‌లో ఉండే బావమర్ది శ్రీనివాస్ వద్దకు చేరుకుని రూ.లక్ష అప్పు కావాలని అడిగాడు. సర్దుబాటు కాకపోవడంతో చేసేది లేక అక్కడ్నుంచి నిరాశగా కొంపల్లికి వెళ్లిపోయాడు. ఓ అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మెన్‌గా పని కుదిరాడు. శనివారం రాత్రి కొంపల్లి నుంచి ప్యారడైజ్ చౌరస్తా వద్ద ఉండే బాలంరాయి పంప్‌హౌజ్‌కు చేరుకున్నాడు. ఎవరూ లేని సమయంలో చెట్టుకు తన తువాలుతో ఉరేసుకున్నాడు.
రాత్రి 9.30 గంటల సమయంలో దీన్ని గమనించిన సా ్థనికులు బేగంపేట్ పోలీసులకు సమాచారం అందించారు. 10 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. రైతు వద్ద రూ.5,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం పోలీసులు మళ్లీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఓ సెల్‌ఫోన్ దొరకగా.. అందులోని నంబర్ల ఆధారంగా కుమారుడికి ఫోన్ చేశారు. మధ్యాహ్నం పోస్టుమార్టం అనంతరం కుమారుడికి మృతదేహాన్ని అప్పగించారు.
నా బతుకేం కావాలె: రైతు భార్య
‘భర్త లేని నా బతుకు ఏం గావాలే..’ అంటూ మల్లేశం భార్య సుశీల గుండెలవిసేలా విలపించింది. ‘‘అయిదేండ్ల సంది ఎవుసంలో అన్ని అప్పులే మిగిలినయ్.. బిడ్డ పెండ్లప్పుడు ఒక ఎకరా అమ్మినం.. మిగిలిన రెండెకరాలు అప్పు కిందికి తనఖా పెట్టినం. పెట్టుబడి కోసం చేసిన అప్పులు మిత్తి మిత్తి పెరిగి 6 లక్షలయ్యాయి. అప్పిచ్చినోళ్లు రోజూ ఇంటికొచ్చి ఇజ్జత్ తీస్తుండ్రు.. ఆ బాధలు భరించలేక పట్నంల వాచ్మెన్ పనిజేసేందుకు పోయిండు..’’ అని ఆమె కన్నీటి పర్యంతమైంది.
అప్పుల బాధకు తాళ లేకే: కుమారుడు
అప్పుల బాధకు తాళలేకే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడని రైతు కుమారుడు మల్లేశ్ చెప్పారు. పంటల్లేక వరుసగా నష్టం రావడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడని, ఇలా అర్థంతరంగా అందరినీ వదిలి వెళ్లిపోతాడని ఊహించలేదన్నాడు.
హలం పట్టినా.. తుపాకీ ఎత్తినా..
హలం పట్టినా.. సమ సమాజ స్థాపనకు తుపాకీ ఎత్తినా మల్లేశం బతుకు మారలేదు. 1998కు పూర్వం మల్లేశం వివ్లవ భావాలకు ఆకర్షితుడై పీపుల్స్‌వార్ ఇందుప్రియాల్ దళం లో దళ సభ్యునిగా ఎనిమిదేళ్లపాటు పనిచేశాడు. అప్పటి ఎస్పీ ద్వారాక తిరమలరావు సమక్షంలో లొంగిపో యాడు.