త్వరలో ఉద్యోగుల పరిమిత బదిలీలు
సీఎం సూచనప్రాయ అంగీకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు పరిమిత సంఖ్యలో అవకాశమివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తల్లో ఒకరిని బదిలీ చేయడంతోపాటు అయిదేళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను త్వరలో బదిలీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు సీఎం కేసీఆర్ ఇటీవల సూచించినట్లు తెలిసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సాధారణ బదిలీలకు అవకాశం లేకపోవటంతో ఆరోగ్య సమస్యలు, కుటుంబ అవసరాలతో కొందరు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఉద్యోగ సంఘాలు పలుమార్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశాయి. ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో సీఎస్‌ను కలసిన సందర్భంలోనూ సాధారణ బదిలీల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాయి.
ఈ నేపథ్యంలో సీఎం సమక్షంలో బదిలీలపై చర్చ జరిగినట్లు తెలిసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా దాదాపు 20 వేల మంది ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ పేరుతో తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. కాబట్టి ఇప్పటికిప్పుడు భారీగా బదిలీలు చేపడితే కొత్త జిల్లాల్లో పరిపాలనపై ప్రభావం పడుతుందని, ఉద్యోగుల సర్దుబాటు సమస్యాత్మకంగా మారుతుందని సీఎం అభిప్రాయం వెలిబుచ్చినట్ల తెలిసింది.
మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల పైరవీలు, ఒత్తిళ్లతో బదిలీల దందా సాగిందనే ఆరోపణలకు తావిచ్చినట్లవుతుందని అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు సీఎం నచ్చజెప్పినట్లు సమాచారం. అయితే అయిదేళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయడంతోపాటు భార్యాభర్తలు ఒకే చోట పనిచేయాలనే ఆలోచనతో ఆ రెండు కేటగిరీలకు అవకాశమివ్వాలని సూచనప్రాయంగా అధికారులను ఆదేశించినట్లు సమాచారం.