'రేవంత్‌కు తెలంగాణలో జీవించే హక్కు లేదు'
హైదరాబాద్ సిటీ: ఏపీ ముఖ్యంత్రి చంద్రబాబుకు వంత పాడుతున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి తెలంగాణలో జీవించే హక్కు లేదని మహబూబ్‌నగర్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్ శనివారం అసెంబ్లీలోని టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి పాలమూరు జిల్లా ప్రజల పరువు తీశాడని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా చంద్రబాబు లేఖ రాయడం ఏ మాత్రం తప్పుకాదని రేవంత్‌రెడ్డి వాదిస్తున్నాడని దుయ్యబట్టారు.
పొరుగు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతానంటూ రేవంత్‌రెడ్డి స్వయంగా ఒప్పుకుంటున్నారని నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు హామీ ఇచ్చినందునే రేవంత్‌రెడ్డి తెలంగాణలో కోవర్టుగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుల విషయంలో రేవంత్‌రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆరోపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్‌రెడ్డి పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు సహనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.