చనిపోతూ ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్!
న్యూయార్క్: ట్రాఫిక్ స్టాప్ వద్ద పోలీసుల ఆజ్ఞలను పట్టించుకోకుండా అనుచితంగా వ్యవహరించడంతోపాటు వాహనంతో ఢీకొట్టేందుకు యత్నించిన ఓ వ్యక్తిపై పోలీసు కాల్పులు జరపడం ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ అయింది. అమెరికాకు చెందిన రోడ్నీ జేమ్స్ హెస్ గురువారం తనపై పోలీసులు కాల్పులు జరిపినపుడు ఫేస్బుక్ లైవ్లో ఉన్నట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. వెస్ట్ టెన్నెస్సీలోని అలమో పట్టణం సమీపంలోని హైవేపై వాహనాన్ని అడ్డంగా పార్క్ చేయడంతో హెస్ వాహనం దగ్గరకు పోలీసులు వెళ్లారని, అయితే వారి ఆజ్ఞలను అతడు పట్టించుకోలేదని టెన్నెసీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారి జోష్ డివినె తెలిపారు. అంతేకాకుండా పోలీసులను వాహనంతో ఢీకొట్టేందుకు ప్రయత్నించడంతో ఓ పోలీస్ అధికారి అతడిపై కాల్పులు జరిపాడని వివరించారు.
మా ఆంటీ ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. నేను వెంటనే ఫేస్బుక్లో లాగిన్ అయి ఆ వీడియో చూశాను అని హెస్ కాబోయే భార్య తెలిపారు. హెస్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని, ఇలాంటి వారితో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన ఉండాలని ఆమె అన్నారు. పోలీసులు టైర్లపై షూట్ చేయాల్సింది లేదా ఇంకోలా డీల్ చేయాల్సింది. అతడిపై కాల్పులు జరిపి ఉండాల్సింది కాదు అని పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.