నేను బతికున్న దెయ్యాన్ని...!
బతికున్న దెయ్యమేమిటా అని అనుకుంటున్నారా ? రుమేనియాకు చెందిన కాన్స్టాంటిన్ రేలూ స్వానుభవమిది. ఎవరికీ ఎదురుకాని వింత పరిస్థితిని ఆయన ఎదుర్కుంటున్నారు. జీవించి ఉన్నా.. ప్రభుత్వ లెక్కల్లో మరణించినట్టే. ఈ మేరకు స్థానిక న్యాయస్థానం కూడా దానిని ధృవీకరించేసింది. టర్కీలో వంటవాడిగా 20 ఏళ్లకు పైగా పనిచేసి రెండునెలల క్రితం రుమేనియాకు తిరిగొచ్చాక తాను జీవించిలేనన్న కఠోర వాస్తవం ఆయనకు తెలిసొచ్చింది. అప్పటి నుంచి తనను తాను బతికున్నట్టుగా చట్టపరంగా నిరూపించుకునేందుకు తంటాలు పడుతున్నాడు. దీనిపై కోర్టు గుమ్మమెక్కినా గత గురువారం ప్రతికూల తీర్పు రావడంతో హతాశుడయ్యాడు.
1992లో టర్కీలో పనిచేసేందుకు వెళ్లి, 1995లో స్వదేశానికి తిరిగొచ్చాడు కాన్స్టాంటిన్ రేలూ. తన భార్య తీరు బాగా లేకపోవడంతో 1999లో శాశ్వతంగా టర్కీకి వెళ్లిపోయాడు. అయితే సరైన పత్రాలు లేకపోవడంతో ఈ జనవరిలో టర్కీ అధికారులు ఆయనను రుమేనియాకు తిప్పి పంపించేశారు. బుకారెస్ట్ విమానాశ్రయంలో దిగిన వెంటనే అధికారులు రేలూ రికార్డుల్లో చనిపోయినట్టు ఉన్న విషయాన్ని తెలియజేశారు. అంతటితోనే ఆగకుండా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన ముఖం, కళ్ల మధ్య దూరం తదితర కొలతలు, వేలిముద్రలు తీసుకుని, పాత పాస్‌పోర్టులోని ఫొటో వివరాలతో సరిపోల్చి చూశారు. అతడు పుట్టిన పట్టణం, టౌన్‌హాల్, ఇతర విషయాల గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. రేనూ చెప్పిన వివరాలతో విమానాశ్రయ అధికారులు సంతృప్తి చెందినా అక్కడితో ఆయన సమస్యలు తీరలేదు.
ఆయన స్వస్థలం వాస్లూయి కౌంటీలోని బార్లాడ్ నగర ప్రభుత్వ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. వచ్చిన చిక్కల్లా రేనూ భార్య 2016లో ఆయన మరణించినట్టుగా ధృవీకరించి ఆ మేరకు ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్‌ను కూడా పొందింది. దానిని తిరగరాస్తూ తాను బతికున్నట్టుగా మరో సర్టిఫికెట్‌ను ఇవ్వాలంటూ పెట్టుకున్న పిటీషన్‌ను కూడా కోర్డు కొట్టేసింది. భార్య కూడా ఇటలీలో స్థిరపడడంతో ఆమె జాడ కనుక్కోవడం అసాధ్యమై పోయింది. మళ్లీ కొత్తగా కేసు పునర్విచారణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు డబ్బులు లేక తిరిగి టర్కీ వెళ్లకుండా విధించిన బహిష్కరణతో అక్కడకు వెళ్లలేక త్రిశంకుస్వర్గంలో వేలాడుతున్నాడు. ‘నేను బతికున్న దయ్యాన్ని. ప్రాణంతోనే ఉన్నా అధికారికంగా మరణించినట్లు ప్రకటించిన వాడిని’ అంటూ రేలూ వాపోతున్నాడు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్