తొలివిడత రుణమాఫీ సక్సెస్
ఖమ్మం వ్యవసాయం : జిల్లాలో రుణమాఫీ ప్రకియ విజయవంతంమైందని కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి అన్నారు. అందుకు కృషి చేసిన జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు, బ్యాంకర్లను అభినందించారు. ఖమ్మం టీటీడీసీ భవన్లో మంగళవారం జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వివిధ పథకాల లక్ష్యాలు, సాధించిన ప్రగతి తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. రుణమాఫీ మొదటి విడతగా 2,88,453 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.345 కోట్లు జమ అయ్యాయని తెలిపారు. 90 శాతం వరకు రైతుల రుణ మాఫీకి సంబందించి ప్రక్రియ పూర్తయిందన్నారు. పహానీలు సమర్పించకపోవడం వల్ల మిగిలిన వారికి ఆలస్యమైందన్నారు. ఈ సీజన్ వరకు మాన్యువల్ పహణీలు ఇస్తామని, వాటిని ఆమోదించాలని సూచించారు. రెండు, మూడు నెలల్లో జమాబందీ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. దీంతో ఈ-పహాణీలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఏయే ప్రాంతాల్లో రుణమాఫీలు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయో వాటి వివరాలను వెంటనే జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్‌కు అందించాలని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులను ఆదేశించారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ 2014-15 వార్షిక రుణ ప్రణాళిక, వివిధ సెక్టార్లకు కేటాయింపులు, వాటి లక్ష్యసాధన గురించి వివరించారు. వార్షిక టార్గెట్ రూ.3,771.10 కోట్లకు రూ.1,224.92 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఖరీఫ్ రుణాలకు రూ. 1407.80 కోట్లు లక్ష్యం కాగా రూ.743కోట్లు సాధించామని, టర్మినల్ లోన్సు రూ.1311.72 కోట్లకు రూ.150.62కోట్లు, పరిశ్రమలకు రూ.241.78 కోట్లకు రూ. 102.02 కోట్లు సాధించినట్లు వివరించారు.
2014 సెప్టెంబర్ 18న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై అధికారులు స్పందించిన తీరును పరిశీలించారు. మండలాల వారీగా ఎస్‌హెచ్‌జీ సంఘాలు రుణాలు తీసుకుని చెల్లంచని వారిపై రెవెన్యూ రికవరీ యాక్టును అమలు చేయాలని డీఆర్డీఏ పీడీని ఆదేశించారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి దివ్య మాట్లాడుతూ ఐటిడీఏకు సంబంధించి సెక్టారు వారీగా 592 యూనిట్లు బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్నాయని. వాటిని వెంటనే మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు. గ్రామీణ వికాస బ్యాంక్ పెరఫార్మెన్స్‌లో వెనకబడి ఉందని అన్నారు. ఫార్మా మెకనైజేషన్ స్కీమ్ కింద రూ.20 కోట్లు మంజూరయ్యాయని, విధి విధానాల ప్రకారం గిరిజన ప్రాంతంలో అమలు చేయాలని అన్నారు.
వార్షిక రుణ ప్రణాళిక విడుదల
రూ.4,527.74 కోట్లతో రూపొందించిన ఆధారిత వార్షిక రుణ ప్రణాళిక (2015-16)ను కలెక్టర్ ఇలంబరితి విడుదల చేశారు. క్రాప్ ప్రొడక్షన్ మెయిన్టెనెన్స్, మార్కెటింగ్ సెక్టారు కింద రూ.2,410.71 కోట్లు కేటాయించగా, కాటర్ సోర్సుకు రూ.7,199.22 లక్షలు, ఫార్మా మెకానిజంకు రూ.10,252.15 లక్షలు, పశుసంవర్ధక శాఖ, డైరీ డవలప్మెంట్ అభివృద్ధికి రూ11,659.05 లక్షలు, భూ అభివృద్ధికి, ప్లాంటేషన్, హార్టికల్చర్, వేస్ట్ ల్యాండ్ అభివృద్ధి తదితర సెక్టార్లకు నిధులు ప్రతిపాదించినట్లు వివరించారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్, రూరల్ డవలప్మెంట్ స్కీమ్ ఆన్ డైరీ అనే పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. సమావేశంలో ఆంధ్రాబ్యాంక్ డీజీఎం ధనుంజయ్, నాబార్డు డీడీఎం కె.ఎస్.ఎస్. ప్రసాద్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ శ్రీనివాసనాయక్, జేడీఏ పి.బి.భాస్కర్ రావు, మెప్మా ప్రాజెక్ట్ డెరైక్టర్ వేణుమనోహర్ తదితరులు పాల్గొన్నారు.