local politics
-
ఖమ్మంలో సై అంటే సై! స్పీడ్ పెంచిన తుమ్మల, మట్టా, మదన్‌లాల్
సాక్షిప్రతినిధి, ఖమ్మం : వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్లో ఆశావహ నేతలు దూకుడు పెంచారు. ప్రధానంగా ఆ పార్టీలో పాలేరు, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వారి అనుచరగణమూ ఇదే స్థాయిలో సై అంటే సై అంటోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అశావహ నేతలు నువ్వా.. నేనా అన్నట్టుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మళ్లీ తమకే పార్టీ టికెటన్న ధీమాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా.. పార్టీ సర్వేల్లో జాతకాలు మారుతాయన్న నమ్మకంతో ఆశావహులు ఉన్నారు. ఇటీవల ఆశావహ నేతలు హాట్‌హాట్‌గా ప్రకటనలు చేస్తూ తమ అనుచరులను క్రియాశీలకం చేసే పనిలో నిమగ్నమయ్యారు. (చదవండి: Munugode Bypoll: పోటీయా? మద్దతా?) పాలేరులో పోటా పోటీ.. పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ కేడర్ రెండుగా చీలింది. గత కొంతకాలంగా రెండు వర్గా ల మధ్య ఉప్పు–నిప్పు అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు, నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు కందాల హాజరవుతున్నారు. ఈ జోష్‌తో తన అనుచర నేతలు, కేడర్‌తో మళ్లీ పోటీలో ఉండేది తానేనంటూ సంకేతాలిస్తున్నారు. నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉచిత కోచింగ్ సెంటర్లు పెట్టడంతో పాటు గతంతో పోలిస్తే గ్రామ పర్యటనలకు ఇటీవల ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక తన అనుచర నేతలు, కేడర్ నుంచి ఏ కార్యక్రమానికి పిలుపు వచ్చినా తుమ్మల వదులుకోవడం లేదు. వీటిల్లో పాల్గొంటూనే రాజకీయంగా చర్చనీయాంశం అయ్యేలా ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇటీవల నేలకొండపల్లి మండలంలో ఆయన పర్యటిస్తూ ‘ఎప్పుడైనా పిడుగులు పడొచ్చు’ అంటూ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. త్వరలో ఎన్నికలు వస్తాయని, టికెట్ తనకేనన్న నమ్మకంతో తుమ్మల ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అనుచర వర్గం చర్చించుకుంటోంది. వైరా ‘గులాబీ’లో వార్.. జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న వైరా నియోజకవర్గ ‘గులాబీ’లో వార్ కొనసాగుతోంది. ఇండిపెండెంట్‌గా గెలిచి ఆ తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరిన ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ తమకే టికెట్ అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి కూడా టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా ఏ కార్యక్రమం ఉన్నా ముఖ్యంగా ఎమ్మెల్యే రాములునాయక్, మదన్‌లాల్ వర్గాలు వేర్వేరుగా చేస్తుండడం గమనార్హం. అంతేగాకుండా ఇరువురూ తమ కేడర్, నేతలతో భారీగా ర్యాలీలు నిర్వహిస్తూ బలప్రదర్శన చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తమకంటూ ఒక టీం ఏర్పాటు చేసుకుని ఎక్కడా తగ్గకుండా కార్యక్రమాలు చేపడుతుండడంతో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఈ ముగ్గురితోపాటు మరో ఒకరిద్దరు కూడా ఈ నియోజకవర్గం నుంచి పార్టీ టికెట్ ఆశిస్తుండడంతో చివరికి పోటీలో ఎవరు ఉంటారన్నది సర్వేల్లో తేలుతుందన్నది పార్టీ వర్గాల సమాచారం. సత్తుపల్లిలోనూ ఇదే సీన్.. ఉమ్మడి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే నేతలకు పుట్టినిల్లు సత్తుపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి చెందిన ప్రధాన నేతల ఆశీస్సులు ఎవరికి ఉంటే వారిదే గెలుపన్నది ఎప్పటినుంచో సాగుతున్న ప్రచారం. ఇటీవల ఏ ఎన్నికలు వచ్చినా.. మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆశీర్వాదం ఎవరికి ఉంది.. దీంతో బరిలో ఉండే అభ్యర్థుల బలాబలాలు ఎలా ఉంటాయన్నది అంచనా వేయడం పరిపాటిగా మారింది. అయితే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో నాలుగోసారి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. 2009, 2014, 2018 లో టీడీపీ నుంచి సండ్ర గెలుపొందారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. సీనియర్ ఎమ్మెల్యే కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు కూడా సండ్రకే ఉంటాయని ఆయన అనుచర వర్గం చర్చించుకుంటోంది. మరోవైపు గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన డాక్టర్ మట్టా దయానంద్ ఈసారి వేగం పెంచారు. తన వర్గం కేడర్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. నాలుగో సారి విజయం తనదేనంటూ సండ్ర, తనకు టికెట్ వస్తుందన్న ధీమాలో దయానంద్ ఉండడంతో ఈ నియోజవర్గంలో గులాబీ రాజకీయం రసవత్తరంగా మారింది. (చదవండి: డిగ్రీ విద్యార్హతగల వీఆర్ఏలకు పేస్కేల్! రెవెన్యూలోనే కొనసాగింపు? ) -
మునుగోడులో కాల్పుల కలకలం! అసలు కారణం ఇదేనా?
మునుగోడు, నార్కట్‌పల్లి: వాటర్ బాటిల్స్ సరఫరా చేసే డీలర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ద్విచక్ర వాహనంపై వచ్చి దాడి చేసి వెంటనే పరారయ్యాడు. మూడు చోట్ల బుల్లెట్ గాయాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికంగా జరిగిన గొడవలే దీనికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం సింగారంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. (చదవండి: కాంగ్రెస్ గూటికి చెరుకు సుధాకర్.. మునుగోడు ఉపఎన్నికలో సామాజిక అస్త్రంగా!) గోదాంకు వెళ్లి వస్తుండగా.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల గ్రామానికి చెందిన నిమ్మల స్వామి కొన్నేళ్లపాటు ట్రాక్టర్ నడిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ వాటర్ బాటిల్ కంపెనీ డీలర్షిప్ తీసుకుని.. మునుగోడు, చండూరు మండలాలకు సరఫరా చేస్తున్నారు. మునుగోడులోని లక్ష్మిదేవిగూడెంలో ఉన్న తన గోదాముకు బ్రాహ్మణవెల్లెంల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. గురువారం రాత్రి ఆయన బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా.. సింగారం గ్రామ శివార్లలో మరో బైక్‌పై వచ్చి న దుండగులు పిస్టల్‌తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. స్వామి వెన్నెముక భాగంలో రెండు, కుడి అరచేతికి ఒక బుల్లెట్ తగిలి కిందపడిపోయారు. సమీపంలోని ఇళ్లవారు ఇది చూసి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారమిచ్చారు. కుటుంబ సభ్యులు స్వామిని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా.. చిట్యాలకు చెందిన రేడియం స్టికర్స్ వేసే వ్యక్తి లేదా మునుగోడుకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారులు తనపై కాల్పులు జరిపి ఉంటారని స్వామి అనుమానం వ్యక్తం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన వారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. (చదవండి: వైఎస్సార్ తెలంగాణ పార్టీలోకి కాంగ్రెస్ యువ నేత.. కండువా కప్పి ఆహ్వానించిన షర్మిల) -
నేనే రాజు.. నేనే మంత్రి!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో సంబంధిత మంత్రి ఆదేశాల మేరకు కార్యకలాపాలు నడవాలి. మంత్రుల నిర్ణయం మేరకు ఆయా శాఖల్లో ఉత్తర్వులు వెలువడుతుంటాయి. అయితే ఇది శ్రీకాకుళం జిల్లాకు ఏమాత్రం వర్తించదు. ఏ జీవో అయినా ఆ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడికి నచ్చకపోతే ఆగాల్సిందే. విద్యాశాఖకు సంబంధించి మంత్రి గంటా ఇచ్చిన ఆదేశాలకు తాజాగా ఈ గతి పట్టింది. జిల్లా విద్యాధికారిగా గంటా నియమించిన ఓ అధికారిని చేరటానికి వీల్లేదంటూ అచ్చెన్న వెనక్కు పంపేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇద్దరు మంత్రుల వివాదంగా మారింది. ఈ జిల్లాలో ప్రభుత్వం అంటే నేనే...! ఖాళీగా ఉన్న జిల్లా విద్యాధికారుల పోస్టులలో రెగ్యులర్ డీఈఓలను నియమిస్తూ మానవవనరుల శాఖ శుక్రవారం జీఓ 268 విడుదల చేసిన సంగతి తెలిసిందే. 11 జిల్లాలకు రెగ్యులర్ డీఈఓలను నియమించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.సాయిరాంను శ్రీకాకుళం జిల్లా విద్యాధికారిగా నియమించారు. కలెక్టర్ సూచనల మేరకు డీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమైన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ను జిల్లా డీఈఓగా జాయిన్ కావద్దని చెబుతున్నారని, మంత్రి అచ్చెన్నాయుడును కలవాలని సమాచారం అందింది. తాను జిల్లాలో డిప్యూటీ డీఈఓగా రెండు డివిజన్లలో పనిచేశానని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చానని, మీరు చెప్పినట్లే నడుచుకుంటానని అచ్చెన్నకు విన్నవించినా ఫలితం దక్కలేదు. వెనక్కు వెళ్లిపోవాలని హుకుం జారీచేయడంతో ఆ అధికారి ఇంకేమీ మాట్లాడలేకపోయారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని అక్కడ ఉన్న కొందరు మంత్రి దృష్టికి తేగా... ‘ఈ జిల్లాలో ప్రభుత్వం అంటే నేనే. ఏ శాఖ అయినా నామాట ప్రకారం నడవాల్సిందే. నా మాటే జీఓ‘ అని మంత్రి స్పష్టం చేశారు. తన మనిషే ఇన్‌ఛార్జి: విజయనగరం జిల్లా డైట్ కాలేజీ లెక్చరర్ ప్రభాకరరావును మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి డీఈఓగా ఎంపిక చేసుకున్నారు. విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు లేకుండానే ఆయన ఇన్ఛార్జిగా కొనసాగటం గమనార్హం.ఇంతకు ముందు ఏడాదిన్నర ఆయన ఇదే స్థానంలో ఉన్నారు. కొత్త డీఈఓల నియామకం తరువాత ఆయన్ను విజయనగరం డైట్‌కు పంపినా మళ్లీ రప్పించి ఇన్ఛార్జిగా కొనసాగిస్తున్నారు. రెగ్యులర్ డీఈఓలు ఉండాల్సిందే: మంత్రి గంటా తన శాఖ ఉత్తర్వులు అమలు కాకుండా మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకోవడం, అధికారిని వెనక్కు పంపడంపై మంత్రి గంటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ‘సాక్షి’ మంత్రి గంటాను సంప్రదించగా.. అన్ని జిల్లాల్లో రెగ్యులర్ డీఈఓలు ఉండాల్సిందేనని, ఇన్‌ఛార్జి డీఈఓలను కొనసాగించే ప్రసక్తే లేదని చెప్పారు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఇన్‌ఛార్జి డీఈఓగా కొనసాగుతున్న అధికారిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మంత్రి సుజయకృష్ణ రంగారావుకు గతంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇసుక ర్యాంపు పొందిన కాంట్రాక్టర్ పనులు చేయకుండా మంత్రి అచ్చెన్న అడ్డుకున్నారు. సుజయకృష్ణ సూచనల మేరకు మైనింగ్ శాఖ కార్యదర్శికి విన్నవించినా.. ‘అచ్చెన్నాయుడిని కలసి ఏదో సర్దుబాటు చేసుకోండి. ఆ జిల్లాలో మేమైనా అచ్చెన్న మాట ప్రకారం నడవాల్సిందే’ అని చేతులెత్తేయటం గమనార్హం. -
వేడెక్కిన స్థానికం
సాక్షి, చెన్నై: స్థానిక ఎన్నికల సమరం వేడెక్కింది. నామినేషన్ల పర్వం వేగం పెరిగింది. డీఎంకే తొలి జాబితా ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్‌కు కంటి తుడుపు సీట్లే దక్కాయి. ఇక, అభ్యర్థుల్ని మార్చాల్సిందేనని పట్టుబడుతూ అన్నాడీఎంకేలో నిరసనలు హోరెత్తుతున్నాయి. టవర్ ఎక్కి మరీ తమ అభిమానాన్ని నాయకులు చాటుకున్నారు. కాగా, అన్ని పార్టీలు ఉరకలు పరుగులు తీస్తుంటే, డీఎండీకే అధినేత విజయకాంత్ శిబిరంలో హడావుడి కానరావడం లేదు. స్థానిక ఎన్నికల బరిలో నిలిచేందుకు అన్నాడీఎంకే అభ్యర్థుల జాబితా ప్రకటన ఆ పార్టీలో పలు చోట్ల ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ కోసం శ్రమిస్తున్న వాళ్లకు కాకుండా, కొత్త ముఖాలకు సీట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని చోట్ల, పాత వాళ్లకే మళ్లీ సీటు ఇవ్వడాన్ని ఖండిస్తూ మరి కొన్ని చోట్ల నిరసనలు బుధవారం కూడా హోరెత్తాయి. ప్రధానంగా చెన్నైలో అయితే, పలు వార్డుల్లో నిరసనలు ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. 158వ వార్డు సీటును సిట్టింగ్ కౌన్సిలర్ రాజశేఖర్ సతీమణి కవితకు ఇవ్వడాన్ని ఖండిస్తూ, బర్మా కన్నన్ వర్గీయులు ఆందోళనకు దిగారు. వారి మద్దతు దారులు ముగ్గురు నందంబాక్కం ట్రేడ్ సెంటర్ వద్ద సెల్ టవర్ ఎక్కడం ఉత్కంఠ రేపింది. వీరిని బుజ్జగించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చివరకు అన్నాడీఎంకే పెద్దల జోక్యంతో వారు టవర్ దిగారు. 163, 125, 127, 129 వార్డుల్లోని అభ్యర్థులను మార్చాలని పట్టుబడుతూ మహిళలు పోరు బాట పట్టారు. కొన్ని చోట్ల అభ్యర్థుల మార్పునకు పట్టుబడుతూ నిరాహర దీక్ష చేపట్టారు. ఇలాంటి నిరసనల తంతు రాష్ర్ట వ్యాప్తంగా సాగుతుండడంతో వారిని బుజ్జగించడం సీట్లు దక్కించుకున్న వాళ్లకు భారంగా మారింది. ఒక సీటు రూ.కోటి: కొన్ని చోట్ల ఏకగ్రీవాలు హోరెత్తుతున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ, జిల్లా, యూనియన్ పంచాయతీల ఎన్నికలు పార్టీల వారీగా సాగుతుండడంతో ఇక్కడ ఏకగ్రీవాలకు ఛాన్స్ అరుదే. అయితే, గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలకు అవకాశాలు ఎక్కువే. దీంతో కొన్ని గ్రామాల్లో వేలం ద్వారా పంచాయతీ అధ్యక్షుడి ఎంపిక సాగించే పనిలో గ్రామ పెద్దలు నిమగ్నమయ్యారు. ఇందుకు అద్దం పట్టే విధంగా బుధవారం నీడామంగళం పంచాయతీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవి ఎంపిక సాగింది. అధ్యక్ష పదవికి స్థానికంగా ఉన్న ఓ సామాజిక వర్గ పెద్ద రూ.1.10కోట్లకు వేలం ద్వారా ఎంపికయ్యారు. ఇక, ఉపాధ్యక్ష పదవికి ఆ దరిదాపుల్లో వేలం సాగినట్టు సమాచారం. అయితే, ఈ విషయం ఎన్నికల వర్గాల దృష్టికి చేరలేదు. మీడియాల్లో వచ్చిన వార్తతో విచారించే పనిలో పడ్డారు. కాగా, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, స్థానిక ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని పుదుకోట్టై జాలర్లు ప్రకటించడం గమనార్హం. డీఎంకే తొలి జాబితా: ఎన్నికల రేసులో తమ అభ్యర్థుల తొలి జాబితాను డీఎంకే ప్రకటించింది. అయితే, అన్నాడీఎంకే కంటే భిన్నంగా జిల్లాల వారీగా సేకరించిన వివరాలు, సమాచారాలతో అభ్యర్థుల ఎంపిక సాగింది. తొలి జాబితాను డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ప్రకటించారు. ఆ మేరకు సేలం కార్పొరేషన్‌లోని 60 స్థానాల్లో కాంగ్రెస్‌కు ఐదు, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్‌కు ఒకటి కేటాయించారు. మిగిలిన 54 వార్డుల్లో డీఎంకే అభ్యర్థులు రేసులో దిగారు. తిరుచ్చి పరిధిలో 65 వార్డులు ఉండగా, ఇందులో కాంగ్రెస్‌కు మూడు మాత్రం కేటాయించి, 62 వార్డుల్లో డీఎంకే పోటీ చేయనుంది. తూత్తుకుడిలో 51 వార్డుల్లో డీఎంకే, ఐదు వార్డుల్లో కాంగ్రెస్, రెండు చోట్ల ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. జిల్లాల్లో డీఎంకే, కాంగ్రెస్ , ఇతర మిత్ర పక్షాల నాయకులు కూర్చుని చర్చించి, సిద్ధం చేసి తమకు పంపుతున్న మేరకు జాబితాలను డీఎంకే విడుదల చేస్తుండటం గమనార్హం. కెప్టెన్ డౌటేనా..?: స్థానిక ఎన్నికల్లో డీఎండీకే అభ్యర్థులు రేసులో ఉంటారా..? అన్న అనుమానం మొదలైంది. నామినేషన్ల పర్వం మొదలై మూడు రోజులు గడిచినా ఆ శిబిరంలో ఎలాంటి హడావుడి కన్పించడం లేదు. పోటీకి నేతలు ఉత్సాహం చూపించని దృష్ట్యా, అభ్యర్థుల ఎంపికలో డీఎండీకే అధినేత విజయకాంత్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డా, రేసులో నిలిచే వారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉండడంతో ఎన్నికల్ని బహిష్కరిద్దామా..? అనే యోచనలో కెప్టెన్ ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కసరత్తుల్లో సీతారామన్: ఓ వైపు రాజకీయ పక్షాలు ఉరకలు పరుగులు తీస్తుంటే, మరో వైపు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి ఏర్పాట్ల మీద అధికారి సీతారామన్ దృష్టి పెట్టారు. ఎన్నికల పర్యవేక్షకులు, పరిశీలకులతో బుధవారం కోయంబేడు కార్యాలయంలో సమాలోచించారు. నగదు బట్వాడా కట్టడి, నిఘా కట్టుదిట్టం లక్ష్యంగా చర్యలు తీసుకుంటూ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, కోడ్ ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా కేసుల మోతకు ఆదేశాలిచ్చారు. రేషన్ కార్డుల జారీకి తాత్కాళిక బ్రేక్ వేయడంతో పాటుగా చాపకింద నీరులా ప్రభుత్వ పథకాల పంపిణీ సాగకుండా నిఘా పెంచే పనిలో పడ్డారు. ఇక, రాష్ట్రంలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి తొలి రోజు పది కేసులు నమోదయ్యాయి. ఇందులో అన్నాడీఎంకే వర్గాలే ఎక్కువ. ఇక, నామినేషన్ల వేగం పుంజుకోవడంతో, ఆయా స్థానిక సంస్థల్లో సందడి మొదలైంది. కొందరు అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. సంప్రదింపులు నేడు రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు: కావేరి జలాల విషయంగా కర్ణాటక, తమిళనాడు అధికారులు ఒకే వేదిక మీదుగా సంప్రదింపులకు సిద్ధం అయ్యారు. గురువారం ఢిల్లీలో కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో జరిగే ఈ సమీక్షకు రాష్ట్ర మంత్రి ఎడపాడి పళని స్వామి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు నేతృత్వంలో అధికారుల కమిటీ పయనం అయింది. ఇక, కర్ణాటక సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో కమిటీ ఢిల్లీలో చర్చలకు సిద్ధమైంది. అయితే, నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నట్టుగా తమ వాదనలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించడం తమిళనాట ఆక్రోశాన్ని రగుల్చుతోంది.