సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో సంబంధిత మంత్రి ఆదేశాల మేరకు కార్యకలాపాలు నడవాలి. మంత్రుల నిర్ణయం మేరకు ఆయా శాఖల్లో ఉత్తర్వులు వెలువడుతుంటాయి. అయితే ఇది శ్రీకాకుళం జిల్లాకు ఏమాత్రం వర్తించదు. ఏ జీవో అయినా ఆ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడికి నచ్చకపోతే ఆగాల్సిందే. విద్యాశాఖకు సంబంధించి మంత్రి గంటా ఇచ్చిన ఆదేశాలకు తాజాగా ఈ గతి పట్టింది. జిల్లా విద్యాధికారిగా గంటా నియమించిన ఓ అధికారిని చేరటానికి వీల్లేదంటూ అచ్చెన్న వెనక్కు పంపేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇద్దరు మంత్రుల వివాదంగా మారింది.
ఈ జిల్లాలో ప్రభుత్వం అంటే నేనే...!
ఖాళీగా ఉన్న జిల్లా విద్యాధికారుల పోస్టులలో రెగ్యులర్ డీఈఓలను నియమిస్తూ మానవవనరుల శాఖ శుక్రవారం జీఓ 268 విడుదల చేసిన సంగతి తెలిసిందే. 11 జిల్లాలకు రెగ్యులర్ డీఈఓలను నియమించారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.సాయిరాంను శ్రీకాకుళం జిల్లా విద్యాధికారిగా నియమించారు. కలెక్టర్ సూచనల మేరకు డీఈఓగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమైన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ను జిల్లా డీఈఓగా జాయిన్ కావద్దని చెబుతున్నారని, మంత్రి అచ్చెన్నాయుడును కలవాలని సమాచారం అందింది. తాను జిల్లాలో డిప్యూటీ డీఈఓగా రెండు డివిజన్లలో పనిచేశానని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చానని, మీరు చెప్పినట్లే నడుచుకుంటానని అచ్చెన్నకు విన్నవించినా ఫలితం దక్కలేదు. వెనక్కు వెళ్లిపోవాలని హుకుం జారీచేయడంతో ఆ అధికారి ఇంకేమీ మాట్లాడలేకపోయారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని అక్కడ ఉన్న కొందరు మంత్రి దృష్టికి తేగా... ‘ఈ జిల్లాలో ప్రభుత్వం అంటే నేనే. ఏ శాఖ అయినా నామాట ప్రకారం నడవాల్సిందే. నా మాటే జీఓ‘ అని మంత్రి స్పష్టం చేశారు.
తన మనిషే ఇన్‌ఛార్జి: విజయనగరం జిల్లా డైట్ కాలేజీ లెక్చరర్ ప్రభాకరరావును మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి డీఈఓగా ఎంపిక చేసుకున్నారు. విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు లేకుండానే ఆయన ఇన్‌ఛార్జిగా కొనసాగటం గమనార్హం.ఇంతకు ముందు ఏడాదిన్నర ఆయన ఇదే స్థానంలో ఉన్నారు. కొత్త డీఈఓల నియామకం తరువాత ఆయన్ను విజయనగరం డైట్‌కు పంపినా మళ్లీ రప్పించి ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తున్నారు.
రెగ్యులర్ డీఈఓలు ఉండాల్సిందే: మంత్రి గంటా
తన శాఖ ఉత్తర్వులు అమలు కాకుండా మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకోవడం, అధికారిని వెనక్కు పంపడంపై మంత్రి గంటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ‘సాక్షి’ మంత్రి గంటాను సంప్రదించగా.. అన్ని జిల్లాల్లో రెగ్యులర్ డీఈఓలు ఉండాల్సిందేనని, ఇన్‌ఛార్జి డీఈఓలను కొనసాగించే ప్రసక్తే లేదని చెప్పారు. ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఇన్‌ఛార్జి డీఈఓగా కొనసాగుతున్న అధికారిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. మంత్రి సుజయకృష్ణ రంగారావుకు గతంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇసుక ర్యాంపు పొందిన కాంట్రాక్టర్ పనులు చేయకుండా మంత్రి అచ్చెన్న అడ్డుకున్నారు. సుజయకృష్ణ సూచనల మేరకు మైనింగ్ శాఖ కార్యదర్శికి విన్నవించినా.. ‘అచ్చెన్నాయుడిని కలసి ఏదో సర్దుబాటు చేసుకోండి. ఆ జిల్లాలో మేమైనా అచ్చెన్న మాట ప్రకారం నడవాల్సిందే’ అని చేతులెత్తేయటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment