సాక్షి, చెన్నై: స్థానిక ఎన్నికల సమరం వేడెక్కింది. నామినేషన్ల పర్వం వేగం పెరిగింది. డీఎంకే తొలి జాబితా ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్‌కు కంటి తుడుపు సీట్లే దక్కాయి. ఇక, అభ్యర్థుల్ని మార్చాల్సిందేనని పట్టుబడుతూ అన్నాడీఎంకేలో నిరసనలు హోరెత్తుతున్నాయి. టవర్ ఎక్కి మరీ తమ అభిమానాన్ని నాయకులు చాటుకున్నారు. కాగా, అన్ని పార్టీలు ఉరకలు పరుగులు తీస్తుంటే, డీఎండీకే అధినేత విజయకాంత్ శిబిరంలో హడావుడి కానరావడం లేదు.
స్థానిక ఎన్నికల బరిలో నిలిచేందుకు అన్నాడీఎంకే అభ్యర్థుల జాబితా ప్రకటన ఆ పార్టీలో పలు చోట్ల ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ కోసం శ్రమిస్తున్న వాళ్లకు కాకుండా, కొత్త ముఖాలకు సీట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని చోట్ల, పాత వాళ్లకే మళ్లీ సీటు ఇవ్వడాన్ని ఖండిస్తూ మరి కొన్ని చోట్ల నిరసనలు బుధవారం కూడా హోరెత్తాయి. ప్రధానంగా చెన్నైలో అయితే, పలు వార్డుల్లో నిరసనలు ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. 158వ వార్డు సీటును సిట్టింగ్ కౌన్సిలర్ రాజశేఖర్ సతీమణి కవితకు ఇవ్వడాన్ని ఖండిస్తూ, బర్మా కన్నన్ వర్గీయులు ఆందోళనకు దిగారు. వారి మద్దతు దారులు ముగ్గురు నందంబాక్కం ట్రేడ్ సెంటర్ వద్ద సెల్ టవర్ ఎక్కడం ఉత్కంఠ రేపింది.
వీరిని బుజ్జగించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చివరకు అన్నాడీఎంకే పెద్దల జోక్యంతో వారు టవర్ దిగారు. 163, 125, 127, 129 వార్డుల్లోని అభ్యర్థులను మార్చాలని పట్టుబడుతూ మహిళలు పోరు బాట పట్టారు. కొన్ని చోట్ల అభ్యర్థుల మార్పునకు పట్టుబడుతూ నిరాహర దీక్ష చేపట్టారు. ఇలాంటి నిరసనల తంతు రాష్ర్ట వ్యాప్తంగా సాగుతుండడంతో వారిని బుజ్జగించడం సీట్లు దక్కించుకున్న వాళ్లకు భారంగా మారింది.
ఒక సీటు రూ.కోటి: కొన్ని చోట్ల ఏకగ్రీవాలు హోరెత్తుతున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ, జిల్లా, యూనియన్ పంచాయతీల ఎన్నికలు పార్టీల వారీగా సాగుతుండడంతో ఇక్కడ ఏకగ్రీవాలకు ఛాన్స్ అరుదే. అయితే, గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలకు అవకాశాలు ఎక్కువే. దీంతో కొన్ని గ్రామాల్లో వేలం ద్వారా పంచాయతీ అధ్యక్షుడి ఎంపిక సాగించే పనిలో గ్రామ పెద్దలు నిమగ్నమయ్యారు. ఇందుకు అద్దం పట్టే విధంగా బుధవారం నీడామంగళం పంచాయతీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవి ఎంపిక సాగింది. అధ్యక్ష పదవికి స్థానికంగా ఉన్న ఓ సామాజిక వర్గ పెద్ద రూ.1.10కోట్లకు వేలం ద్వారా ఎంపికయ్యారు. ఇక, ఉపాధ్యక్ష పదవికి ఆ దరిదాపుల్లో వేలం సాగినట్టు సమాచారం. అయితే, ఈ విషయం ఎన్నికల వర్గాల దృష్టికి చేరలేదు. మీడియాల్లో వచ్చిన వార్తతో విచారించే పనిలో పడ్డారు. కాగా, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, స్థానిక ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని పుదుకోట్టై జాలర్లు ప్రకటించడం గమనార్హం.
డీఎంకే తొలి జాబితా: ఎన్నికల రేసులో తమ అభ్యర్థుల తొలి జాబితాను డీఎంకే ప్రకటించింది. అయితే, అన్నాడీఎంకే కంటే భిన్నంగా జిల్లాల వారీగా సేకరించిన వివరాలు, సమాచారాలతో అభ్యర్థుల ఎంపిక సాగింది. తొలి జాబితాను డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ప్రకటించారు. ఆ మేరకు సేలం కార్పొరేషన్‌లోని 60 స్థానాల్లో కాంగ్రెస్‌కు ఐదు, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్‌కు ఒకటి కేటాయించారు. మిగిలిన 54 వార్డుల్లో డీఎంకే అభ్యర్థులు రేసులో దిగారు.
తిరుచ్చి పరిధిలో 65 వార్డులు ఉండగా, ఇందులో కాంగ్రెస్‌కు మూడు మాత్రం కేటాయించి, 62 వార్డుల్లో డీఎంకే పోటీ చేయనుంది. తూత్తుకుడిలో 51 వార్డుల్లో డీఎంకే, ఐదు వార్డుల్లో కాంగ్రెస్, రెండు చోట్ల ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. జిల్లాల్లో డీఎంకే, కాంగ్రెస్ , ఇతర మిత్ర పక్షాల నాయకులు కూర్చుని చర్చించి, సిద్ధం చేసి తమకు పంపుతున్న మేరకు జాబితాలను డీఎంకే విడుదల చేస్తుండటం గమనార్హం.
కెప్టెన్ డౌటేనా..?: స్థానిక ఎన్నికల్లో డీఎండీకే అభ్యర్థులు రేసులో ఉంటారా..? అన్న అనుమానం మొదలైంది. నామినేషన్ల పర్వం మొదలై మూడు రోజులు గడిచినా ఆ శిబిరంలో ఎలాంటి హడావుడి కన్పించడం లేదు. పోటీకి నేతలు ఉత్సాహం చూపించని దృష్ట్యా, అభ్యర్థుల ఎంపికలో డీఎండీకే అధినేత విజయకాంత్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధపడ్డా, రేసులో నిలిచే వారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉండడంతో ఎన్నికల్ని బహిష్కరిద్దామా..? అనే యోచనలో కెప్టెన్ ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
కసరత్తుల్లో సీతారామన్: ఓ వైపు రాజకీయ పక్షాలు ఉరకలు పరుగులు తీస్తుంటే, మరో వైపు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి ఏర్పాట్ల మీద అధికారి సీతారామన్ దృష్టి పెట్టారు. ఎన్నికల పర్యవేక్షకులు, పరిశీలకులతో బుధవారం కోయంబేడు కార్యాలయంలో సమాలోచించారు. నగదు బట్వాడా కట్టడి, నిఘా కట్టుదిట్టం లక్ష్యంగా చర్యలు తీసుకుంటూ నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, కోడ్ ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా కేసుల మోతకు ఆదేశాలిచ్చారు. రేషన్ కార్డుల జారీకి తాత్కాళిక బ్రేక్ వేయడంతో పాటుగా చాపకింద నీరులా ప్రభుత్వ పథకాల పంపిణీ సాగకుండా నిఘా పెంచే పనిలో పడ్డారు. ఇక, రాష్ట్రంలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి తొలి రోజు పది కేసులు నమోదయ్యాయి. ఇందులో అన్నాడీఎంకే వర్గాలే ఎక్కువ. ఇక, నామినేషన్ల వేగం పుంజుకోవడంతో, ఆయా స్థానిక సంస్థల్లో సందడి మొదలైంది. కొందరు అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు.
సంప్రదింపులు
నేడు రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు: కావేరి జలాల విషయంగా కర్ణాటక, తమిళనాడు అధికారులు ఒకే వేదిక మీదుగా సంప్రదింపులకు సిద్ధం అయ్యారు. గురువారం ఢిల్లీలో కేంద్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో జరిగే ఈ సమీక్షకు రాష్ట్ర మంత్రి ఎడపాడి పళని స్వామి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు నేతృత్వంలో అధికారుల కమిటీ పయనం అయింది. ఇక, కర్ణాటక సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో కమిటీ ఢిల్లీలో చర్చలకు సిద్ధమైంది. అయితే, నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నట్టుగా తమ వాదనలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించడం తమిళనాట ఆక్రోశాన్ని రగుల్చుతోంది.
వేడెక్కిన స్థానికం
Published Thu, Sep 29 2016 2:15 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
Advertisement
Advertisement