ఠాణాల్లో సీసీ కెమెరాలు
సాక్షి, ముంబై: లాకప్ మరణాల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్ల లో సాధ్యమైనంత త్వరగా సీసీ కెమెరాలు అమర్చాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు నాలుగు వారాలు మాత్రమే గడువు ఇచ్చిం ది. అంతేగాక అవి పనిచేస్తున్నదీ లేనిదీ పరిశీలించే బాధ్యత సంబంధిత పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ లేదా ఆ పోలీసు స్టేషన్ ఉన్నతాధికారిదేనని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు వి.ఎం.కనడే, పి.డి.కోడేతో కూడిన బెంచ్ ఈ తీర్పు వెలువరించింది.
అన్ని స్టేషన్లలో సీసీ కెమెరాలు అమర్చాలని ‘లా కమిషన్’ 2010లోనే సిఫార్సు చేసింది. కానీ ప్రభుత్వం దీన్ని అమలు చేయకుండా అటకెక్కించిందని బెంచ్ పేర్కొంది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వివరాల ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో అత్యధికంగా 23.48 శాతం మరణాలు సంభవిస్తున్న విషయం వె లుగులోకి వచ్చింది. రాష్ట్రంలో 1999 నుంచి 2013 మధ్య కాలంలో 333 లాకప్ డెత్‌లు జరిగాయి. ఇందులో కేవలం 43 ఘటనలపై మాత్రమే కేసులు నమోదు చేయడం జరిగింది. 19 ఘటనల్లో చార్టిషీట్లు దాఖలు చేశారు కానీ ఇంతవరకు ఏ ఒక్క పోలీసు అధికారికీ శిక్ష పడలేదు.
స్టేషన్లలో సీసీ కెమెరాలు అమర్చాలని మహరాష్ట్ర ఉప-రాజధాని నాగపూర్ హైకోర్టు బెంచ్ కూడా ఈ జూన్‌లో ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇంతవరకు వీటి ఏర్పాటు గురించి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా నాలుగు వారాల్లోపు నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించడం విశేషం. ఈ మేరకు కెమెరాల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభమయినట్టు తెలుస్తోంది.
కోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు
సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో ఫుటేజ్‌లను కనీసం ఏడాదిపాటు వరకు భద్రపర్చాలి.
అరెస్టయిన వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం, భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆ పోలీసు స్టేషన్ ఉన్నతాధికారిదే.
లాకప్‌లో ఉన్న వ్యక్తి గాయపడితే వెంటనే ఆస్పత్రికి తరలించాలి.
గాయాలైన నిందితుడి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెజిస్ట్రేట్ తదుపరి ఆదేశాలివ్వాలి.
అరెస్టయిన వ్యక్తి మృతి చెందితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అనుమానితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలి.
లాకప్ మరణాలపై మెజిస్ట్రేట్ ద్వారా విచారణ జరిపించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.