locked house
-
దొంగలొస్తున్నారు జాగ్రత్త..!
గోదావరిఖని: తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. మూడురోజుల్లో మూడిళ్లలో చొరబడ్డారు. మూడు రోజుల క్రితం స్థానిక శారదానగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన ఆర్టీసీ ఉద్యోగి నాగేందర్ ఇంటి తాళాలు పగులగొట్టారు. బంగారు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. మరో ఇంట్లో ఇలాగే చొరబడినా.. విలువైన వస్తువులేమీ ఎత్తుకెళ్లదు. వీటిపై ఫిర్యాదు రాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎన్టీపీసీ జ్యోతినగర్ కృష్ణాకాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించి రూ.58వేల విలువైన బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ సంఘటనపై ఎన్టీపీసీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది నెలల కిందట మార్కండేయకాలనీలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడి పెద్ద మొత్తంలో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఇటీవల కాలంలో చోరీల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో మూడు చోరీలు జరగడంతో తాళాలు వేసి ఊరికి వెళ్లేవారు భయాందోళనకు గురవుతున్నారు. మూడు చోరీలు ఒకేలా జరగడంతో ఏదైనా ముఠా ఈ ప్రాంతంలో సంచరిస్తోందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో పోలీసులు దృష్టి సారించి చోరీలపై నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. నిఘా పెంచాం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రాత్రి పూట గస్తీ పెంచాం. నిత్యం తిరిగే పెట్రోలింగ్ కార్లతోపాటు బ్లూకోల్ట్స్ పెట్రోలింగ్, రెండు అదనపు పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. సీఐ, ఎస్సై క్రాస్ చెకింగ్ ఉంటోంది. ఎన్టీపీసీ క్రిష్ణానగర్, శారదానగర్ ఆర్టీసీ కాలనీల్లో జరిగిన దొంగతనాల తీరు వేర్వేరుగా ఉంది. అయినప్పటికీ సీసీ కెమెరాల పుటేజీ, నిందితులు వేలిముద్రలు సేకరించాం. దొంగలను త్వరలో పట్టుకుంటాం. – గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ (చదవండి: నాలుగేళ్ల జైలు శిక్ష!.... రెండు రోజుల్లో విడుదల అంతలోనే..) -
ఆడ, మగ కలిసి ఉండడం నేరం కాదు
తిరువొత్తియూరు: తాళం వేసిన గదిలో స్త్రీ, పురుషుడు ఉండడం తప్పు కాదని, దాని ఆధారంగా ఒకరికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం వీలు కాదని మద్రాసు హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. 1998లో దాఖలైన కేసు విచారణను హైకోర్టు ముగించింది. 1997లో సాయుధ దళం విభాగంలో శరవణబాబు కానిస్టేబుల్‌గా చేరాడు. 1998లో అతని ఇంటి లోపల అదే ప్రాంతంలో నివా సం ఉంటున్న మరో మహిళా కానిస్టేబుల్ ఉండడాన్ని స్థానికులు చూసి గదికి తాళం వేశారు. దీంతో కానిస్టేబుల్ శరవణబాబుకు, మహిళా పోలీసు కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం ఉందా అని భావించి పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడానికి నిర్ణయించారు. అతన్ని డిస్మిస్ చేస్తూ సాయుధ దళం విభాగం ఐజీ మణి ఆదేశాలు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ శరవణబాబు మద్రాసు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. తనకు మహిళా కానిస్టేబుల్‌కు వివాహేతర సంబంధం లేదని పేర్కొన్నారు. ఆమె బయటకు వెళ్లినప్పుడు తాళం పెట్టి వెళుతూ ఉంటారని, దాన్ని తీసుకోవడానికి వెళ్లానని పేర్కొన్నారు. దీనిపై తుది విచారణ అనంతరం శుక్రవారం హైకోర్టు తీర్పు ప్రకటించింది. న్యాయమూర్తి సురేష్‌కుమార్ ఫిర్యాదుదారుడు శరవణబాబు, ఆ మహిళ ఒకే ఇంటిలో ఉంటున్నట్లు సాక్ష్యాధారాలు లేవని తెలిపారు. ఆరోపణలపై చర్యలు తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. శరవణ బాబును డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పురుషుడు, ఒక స్త్రీ ఒకే గదిలో ఉండడాన్ని వ్యభిచారంగా చూడడం సరికాదన్నారు. సమాజంలో పలువురికి కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చని, దాని ఆధారంగా చర్యలు తీసుకోవడానికి వీలు లేదని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
తాళం వేసిన ఇంట్లో దంపతుల మృతదేహాలు
తమిళనాడు, తిరువొత్తియూరు: తాళం వేసి ఉన్న ఇంట్లో కుళ్లిన స్థితిలో లభించిన వృద్ధ దంపతుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన వడపళనిలో సంచలనం కలిగించింది. చెన్నై వడపళణి భజన ఆలయ వీధికి చెందిన ముహ్మద్ యూసఫ్ (80). అతని భార్య విజయ (65). వీరు తమ కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. ఈ క్ర మంలో వారు ఉంటున్న ఇంటి తలుపు రెండు రో జులుగా తాళం వేయబడి ఉంది. దీంతో దంపతులు బయటి ఊర్లకు వెళ్లి ఉంటారని ఇరుగుపొరుగు భావించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి తాళం వేసి ఉన్న ఇంటి నుంచి దుర్వాసన వెలువడింది. దీనిపై సందేహం రావడంతో స్థానికులు అశోక్‌నగర్ పోలీసు స్టేషన్‌కు సమాచారం తెలిపారు. అక్కడికి వచ్చిన పోలీసులు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా కుళ్లిన స్థితిలో ముహ్మద్ యూసఫ్, అతని భార్య విజయ మృతదేహాలు లభ్యమయ్యా యి. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం చెన్నై కీల్పాకం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో దొంగల బీభత్సం..
-
పట్టపగలే చోరీ
తణుకు : తణుకు పట్టణానికి ఆనుకుని ఉన్న వెంకట్రాయపురంలో గురువారం పట్టపగలే చోరీ జరిగింది. 40 కాసుల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్రాయపురంలో నివాసం ఉంటున్న కొల్లూరి సత్యనారాయణ పట్టణంలోని కప్పల వెంకన్న సెంటర్లో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన భార్య ఇందిరాదేవి ప్రైవేటు స్కూలులో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు గిరీష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి విజయవాడలో కోచింగ్ తీసుకుంటున్నారు. కుమార్తె పావని తణుకులో డిగ్రీ చదువుతున్నారు. కుటుంబ సభ్యులంతా రోజూ ఉదయాన్నే 8 గంటలకు వెళ్లి తిరిగి సాయంత్రం ఐదు గంటలకు వస్తుంటారు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించిన దుండగులు ఇంట్లోని పైగది తలుపులు పగలగొట్టి బీరువాలో దాచుకున్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ బి.జగదీశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సి.హెచ్.రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చుట్టూ నివాసాలు ఉన్నా.. చోరీ జరిగిన ప్రాంతం ఎప్పుడూ జనసమ్మర్దంగానే ఉంటుంది. దొంగతనం జరిగిన ఇంటిలో కింద రెండు గదులు, పైన రెండు గదులు ఉన్నాయి. ఈ ఇంటి చుట్టూ నివాసాలు ఉన్నా.. దొంగలు చాకచక్యంగా ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంటి సభ్యులు పగలంతా కిందనే ఉండి రాత్రి సమయంలో పడుకునేందుకు పైకి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన ఇందిరాదేవి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నారు. కాలేజీ నుంచి వచ్చిన కుమార్తె రాత్రి 8 గంటల ప్రాంతంలో పైగదికి వెళ్లగా.. అప్పటికే తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి తల్లికి చెప్పారు. దీంతో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వేల్పూరులో భారీ చోరీ
వేల్పూరు (తణుకు): తణుకు మండలం వేల్పూరు గ్రామంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు రూ.25 లక్షల నగదుతోపాటు 32 కాసుల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించుకుపోయిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన వల్లూరి పాపారావుకు గుండె శస్త్రచికిత్స నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నారు. అప్పటికే తాళాలు పగలగొట్టి ఉండటంతో కంగారుగా ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ జరిగినట్టు గుర్తించారు. దొంగలు బీరువా తెరిచి విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. పాపారావు భార్య వల్లూరి దుర్గాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ ఎస్సై బి.జగదీశ్వరరావు దర్యాప్తు చేపట్టారు. కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, పట్టణ ఎస్సై జి.శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులనుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేలిముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్∙సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. వారం రోజుల క్రితం వెళ్లగా.. వేల్పూరుకు చెందిన వల్లూరి పాపారావు, దుర్గాదేవి దంపతులు గ్రామంలోని సంతమార్కెట్ వద్ద చెరువు ఎదురుగా నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు అజయకుమార్, కోడలు వాణివిశారదతో అమెరికాలో స్థిరపడ్డారు. నెల రోజులుగా పాపారావు అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. పాపారావుకు అత్యవసరంగా గుండెకు శస్త్రచికిత్స చేయాలని లేకపోతే ప్రాణానికి ముప్పు అని వైద్యులు చెప్పారు. దీంతో ఈనెల 21న పాపారావును విజయవాడ ఆస్పత్రిలో చేర్పించగా మరుసటి రోజు శస్త్రచికిత్స చేశారు. ఈ క్రమంలో పాపారావును డిస్చార్చ్ చేయడంతో శుక్రవారం స్వగ్రామం చేరుకున్నారు. ఇంటి వెనుక నుంచి తాళం వేయడంతో అజయ్‌కుమార్‌కు తాళాలు ఇచ్చిన తల్లి తలుపులు తీయాలని కోరింది. వెనుక వైపున తాళాలు బద్దలగొట్టి ఉండటంతో లోపలకు వెళ్లి పరిశీలించారు. దొంగలు పడి విలువైన సొత్తు దోచుకుపోయినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పాపారావు ఆందోళనకు గురవుతారని భావించి సమీపంలోని బంధువుల ఇంటికి పంపించారు. పక్కా ప్రణాళికతోనే..! వల్లూరి పాపారావు ఇంట్లో చోరీ జరిగిన తీరు పక్కా ప్రణాళికతోనే జరిగినట్లు తెలుస్తోంది. భీమవరం–తణుకు ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న ఈ ఇంట్లో చోరీ చేసిన దొంగలా పక్కా ప్రొఫెషనల్స్‌గా భావిస్తున్నారు. ప్రధాన గేటుకు వేసిన తాళం వేసినట్లుగా ఉండటంతో గేటు దూకి వెళ్లి వెనుక వైపు నుంచి వేసిన తాళాలు పగలగొట్టినట్టు తెలుస్తోంది. వారం రోజులుగా ఇల్లు తాళం వేసి ఉండటంతో చోరీ ఎప్పుడు జరిగిందనేది స్పష్టంగా తెలియడంలేదు. ఇంట్లో ఉన్న మూడు పడక గదిలో ఒక గదికి మాత్రమే తాళాలు వేయగా మిగిలిన గదులకు గొళ్లెం మాత్రం పెట్టి ఉంచారు. మూడు గదులను సోదా చేసిన దొంగలు మొత్తం వస్తువులను చిందరవందరగా పడేశారు. ఇటీవల కుమారుడు అమెరికా నుంచి పంపిన రూ.25 లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో ఉంచినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఇంట్లో భారీగా ఉన్న ప్రామిసరీ నోట్లను సైతం దుండగులు ఎత్తుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. పాపారావు దంపతులు వడ్డీ వ్యాపారం చేస్తుంటారని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. చోరీ జరిగిన విషయం కుటుంబ యజమాని పాపారావుకు చెప్పకుండా కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు. ఎంత పనిచేశావు.. భగవంతుడా..! ‘ప్రాణాపాయం నుంచి నా భార్తను గట్టెంకించడంతో ఎంతో సంతోషంగా ఉన్న మా కుటుంబానికి ఎంత పనిచేశావు భగవంతుడా..’ అంటూ దుర్గాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. నెల రోజులుగా భర్త అనారోగ్యంతో బాధపడుతుంటే స్వయంగా వైద్యులే తన కుమారుడికి ఫోన్ చేసి అమెరికా నుంచి రప్పించారని, ఆపరేషన్ విజయవంతం కావడంతో ఎంతో ఆనందంగా ఇంటికి వస్తే ఇలా జరిగిందేంటని ఆమె రోధించారు.