వేల్పూరులో భారీ చోరీ
వేల్పూరులో భారీ చోరీ
Published Fri, Jul 29 2016 7:05 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
వేల్పూరు (తణుకు): తణుకు మండలం వేల్పూరు గ్రామంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు రూ.25 లక్షల నగదుతోపాటు 32 కాసుల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించుకుపోయిన సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన వల్లూరి పాపారావుకు గుండె శస్త్రచికిత్స నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నారు. అప్పటికే తాళాలు పగలగొట్టి ఉండటంతో కంగారుగా ఇంట్లోకి వెళ్లి చూడగా చోరీ జరిగినట్టు గుర్తించారు. దొంగలు బీరువా తెరిచి విలువైన బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. పాపారావు భార్య వల్లూరి దుర్గాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రూరల్ ఎస్సై బి.జగదీశ్వరరావు దర్యాప్తు చేపట్టారు. కొవ్వూరు డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, పట్టణ ఎస్సై జి.శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులనుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేలిముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్∙సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.
వారం రోజుల క్రితం వెళ్లగా..
వేల్పూరుకు చెందిన వల్లూరి పాపారావు, దుర్గాదేవి దంపతులు గ్రామంలోని సంతమార్కెట్ వద్ద చెరువు ఎదురుగా నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు అజయకుమార్, కోడలు వాణివిశారదతో అమెరికాలో స్థిరపడ్డారు. నెల రోజులుగా పాపారావు అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తున్నారు. పాపారావుకు అత్యవసరంగా గుండెకు శస్త్రచికిత్స చేయాలని లేకపోతే ప్రాణానికి ముప్పు అని వైద్యులు చెప్పారు. దీంతో ఈనెల 21న పాపారావును విజయవాడ ఆస్పత్రిలో చేర్పించగా మరుసటి రోజు శస్త్రచికిత్స చేశారు. ఈ క్రమంలో పాపారావును డిస్చార్చ్ చేయడంతో శుక్రవారం స్వగ్రామం చేరుకున్నారు. ఇంటి వెనుక నుంచి తాళం వేయడంతో అజయ్‌కుమార్‌కు తాళాలు ఇచ్చిన తల్లి తలుపులు తీయాలని కోరింది. వెనుక వైపున తాళాలు బద్దలగొట్టి ఉండటంతో లోపలకు వెళ్లి పరిశీలించారు. దొంగలు పడి విలువైన సొత్తు దోచుకుపోయినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పాపారావు ఆందోళనకు గురవుతారని భావించి సమీపంలోని బంధువుల ఇంటికి పంపించారు.
పక్కా ప్రణాళికతోనే..!
వల్లూరి పాపారావు ఇంట్లో చోరీ జరిగిన తీరు పక్కా ప్రణాళికతోనే జరిగినట్లు తెలుస్తోంది. భీమవరం–తణుకు ప్రధాన రోడ్డును ఆనుకుని ఉన్న ఈ ఇంట్లో చోరీ చేసిన దొంగలా పక్కా ప్రొఫెషనల్స్‌గా భావిస్తున్నారు. ప్రధాన గేటుకు వేసిన తాళం వేసినట్లుగా ఉండటంతో గేటు దూకి వెళ్లి వెనుక వైపు నుంచి వేసిన తాళాలు పగలగొట్టినట్టు తెలుస్తోంది. వారం రోజులుగా ఇల్లు తాళం వేసి ఉండటంతో చోరీ ఎప్పుడు జరిగిందనేది స్పష్టంగా తెలియడంలేదు. ఇంట్లో ఉన్న మూడు పడక గదిలో ఒక గదికి మాత్రమే తాళాలు వేయగా మిగిలిన గదులకు గొళ్లెం మాత్రం పెట్టి ఉంచారు. మూడు గదులను సోదా చేసిన దొంగలు మొత్తం వస్తువులను చిందరవందరగా పడేశారు. ఇటీవల కుమారుడు అమెరికా నుంచి పంపిన రూ.25 లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో ఉంచినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరోవైపు ఇంట్లో భారీగా ఉన్న ప్రామిసరీ నోట్లను సైతం దుండగులు ఎత్తుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. పాపారావు దంపతులు వడ్డీ వ్యాపారం చేస్తుంటారని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. చోరీ జరిగిన విషయం కుటుంబ యజమాని పాపారావుకు చెప్పకుండా కుటుంబ సభ్యులు గోప్యంగా ఉంచారు.
ఎంత పనిచేశావు.. భగవంతుడా..!
‘ప్రాణాపాయం నుంచి నా భార్తను గట్టెంకించడంతో ఎంతో సంతోషంగా ఉన్న మా కుటుంబానికి ఎంత పనిచేశావు భగవంతుడా..’ అంటూ దుర్గాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. నెల రోజులుగా భర్త అనారోగ్యంతో బాధపడుతుంటే స్వయంగా వైద్యులే తన కుమారుడికి ఫోన్ చేసి అమెరికా నుంచి రప్పించారని, ఆపరేషన్ విజయవంతం కావడంతో ఎంతో ఆనందంగా ఇంటికి వస్తే ఇలా జరిగిందేంటని ఆమె రోధించారు.
Advertisement
Advertisement