madras high court said not crime for male and female cohabitation locked in a room - Sakshi
Sakshi News home page

ఆడ, మగ కలిసి ఉండడం నేరం కాదు 

Published Sat, Feb 6 2021 7:10 AM | Last Updated on Sat, Feb 6 2021 9:10 AM

Madras High Court Says Male And Female Cohabitation In Locked Room Is Not Crime - Sakshi

తిరువొత్తియూరు: తాళం వేసిన గదిలో స్త్రీ, పురుషుడు ఉండడం తప్పు కాదని, దాని ఆధారంగా ఒకరికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం వీలు కాదని మద్రాసు హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. 1998లో దాఖలైన కేసు విచారణను హైకోర్టు ముగించింది. 1997లో సాయుధ దళం విభాగంలో శరవణబాబు కానిస్టేబుల్‌గా చేరాడు. 1998లో అతని ఇంటి లోపల అదే ప్రాంతంలో నివా సం ఉంటున్న మరో మహిళా కానిస్టేబుల్‌ ఉండడాన్ని స్థానికులు చూసి గదికి తాళం వేశారు. దీంతో కానిస్టేబుల్‌ శరవణబాబుకు, మహిళా పోలీసు కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం ఉందా అని భావించి పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడానికి నిర్ణయించారు. అతన్ని డిస్మిస్‌ చేస్తూ సాయుధ దళం విభాగం ఐజీ మణి ఆదేశాలు జారీ చేశారు.

దీన్ని వ్యతిరేకిస్తూ శరవణబాబు మద్రాసు హైకోర్టు లో పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు మహిళా కానిస్టేబుల్‌కు వివాహేతర సంబంధం లేదని పేర్కొన్నారు. ఆమె బయటకు వెళ్లినప్పుడు తాళం పెట్టి వెళుతూ ఉంటారని, దాన్ని తీసుకోవడానికి వెళ్లానని పేర్కొన్నారు. దీనిపై తుది విచారణ అనంతరం శుక్రవారం హైకోర్టు తీర్పు ప్రకటించింది. న్యాయమూర్తి  సురేష్‌కుమార్‌ ఫిర్యాదుదారుడు శరవణబాబు, ఆ మహిళ ఒకే ఇంటిలో ఉంటున్నట్లు సాక్ష్యాధారాలు లేవని తెలిపారు. ఆరోపణలపై చర్యలు తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. శరవణ బాబును డిస్మిస్‌ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పురుషుడు, ఒక స్త్రీ ఒకే గదిలో ఉండడాన్ని వ్యభిచారంగా చూడడం సరికాదన్నారు. సమాజంలో పలువురికి కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చని, దాని ఆధారంగా చర్యలు తీసుకోవడానికి వీలు లేదని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement