పట్టపగలే చోరీ
Published Fri, Sep 9 2016 1:56 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
తణుకు : తణుకు పట్టణానికి ఆనుకుని ఉన్న వెంకట్రాయపురంలో గురువారం పట్టపగలే చోరీ జరిగింది. 40 కాసుల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. వెంకట్రాయపురంలో నివాసం ఉంటున్న కొల్లూరి సత్యనారాయణ పట్టణంలోని కప్పల వెంకన్న సెంటర్‌లో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నారు. ఆయన భార్య ఇందిరాదేవి ప్రైవేటు స్కూలులో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు గిరీష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి విజయవాడలో కోచింగ్ తీసుకుంటున్నారు. కుమార్తె పావని తణుకులో డిగ్రీ చదువుతున్నారు. కుటుంబ సభ్యులంతా రోజూ ఉదయాన్నే 8 గంటలకు వెళ్లి తిరిగి సాయంత్రం ఐదు గంటలకు వస్తుంటారు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించిన దుండగులు ఇంట్లోని పైగది తలుపులు పగలగొట్టి బీరువాలో దాచుకున్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ బి.జగదీశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తణుకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సి.హెచ్.రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
చుట్టూ నివాసాలు ఉన్నా..
చోరీ జరిగిన ప్రాంతం ఎప్పుడూ జనసమ్మర్దంగానే ఉంటుంది. దొంగతనం జరిగిన ఇంటిలో కింద రెండు గదులు, పైన రెండు గదులు ఉన్నాయి. ఈ ఇంటి చుట్టూ నివాసాలు ఉన్నా.. దొంగలు చాకచక్యంగా ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంటి సభ్యులు పగలంతా కిందనే ఉండి రాత్రి సమయంలో పడుకునేందుకు పైకి వెళ్తుంటారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన ఇందిరాదేవి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నారు. కాలేజీ నుంచి వచ్చిన కుమార్తె రాత్రి 8 గంటల ప్రాంతంలో పైగదికి వెళ్లగా.. అప్పటికే తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి తల్లికి చెప్పారు. దీంతో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Advertisement