lok adalath
-
లోక్ అదాలత్‌ల్లో 18,410 కేసుల పరిష్కారం
సాక్షి, అమరావతి: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్‌లు విజయవంతమయ్యాయి. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 18,410 కేసులు ఒక్క రోజులో పరిష్కారమయ్యాయి. శనివారం ఉదయం 10 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి లోక్ అదాలత్‌లు ప్రారంభించారు. హైకోర్టులో 6 బెంచ్‌లు ఏర్పాటు చేయగా.. 13 జిల్లాల్లో 330 బెంచ్‌లు విచారణలో పాలు పంచుకున్నాయి. హైకోర్టులో సాయంత్రం 5 గంటల తరువాత కూడా అదాలత్‌లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 18,410 కేసులు పరిష్కారమయ్యాయి. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో 638 కేసులు, మిగిలిన బెంచ్‌ల్లో మరో 328 కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 963 ముందస్తు వివాదాల కేసులు కూడా పరిష్కరించారు. కేసుల పరిష్కారం ద్వారా రూ.38.23 కోట్ల పరిహారాన్ని సంబంధిత కక్షిదారులకు చెల్లిస్తారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ప్రధాన న్యాయమూర్తి పెండింగ్ కేసులపై ప్రధానంగా దృష్టి సారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లోక్ అదాలత్‌లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జిల్లాల్లోని లోక్ అదాలత్‌లను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. న్యాయాధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. పలు శాఖల అధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, పోలీసులు,, ప్రభుత్వ న్యాయవాదులు, న్యాయవాదులతో ముందస్తు సమావేశాలు నిర్వహించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు తెప్పించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తు బెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ నెల 3 నుంచి సాయంత్రం కోర్టు పనివేళలు ముగిశాక లోక్ అదాలత్ కేసులు విచారించారు. మిగిలిన న్యాయమూర్తులు కూడా రాత్రి 8 గంటల వరకు కేసులు విచారించారు. కొన్నిసార్లు కక్షిదారుల్ని కోర్టుకు పిలిపించి, వారి సమక్షంలోనే కేసులు పరిష్కరించి, అక్కడికక్కడే పరిహారం నిర్ణయించారు. ముందస్తు బెంచ్‌ల ద్వారా ఈ నెల 12 వరకు 849 కేసులను పరిష్కరించారు. ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రాకేష్ కుమార్ల సూచనలు, సలహాలతో లోక్ అదాలత్‌లు విజయవంతమయ్యాయని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి డాక్టర్ వీఆర్కే కృపాసాగర్, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ కార్యదర్శి ఎంవీ రమణకుమారి తెలిపారు. -
లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసుల పరిష్కారం
లీగల్ (కడప అర్బన్): దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని,ఈ కార్యక్రమం ద్వారానే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించే విధంగా చూస్తోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 2015 నుంచి 2016 వరకు 800కు పైగా లోక్ అదాలత్ కార్యక్రమాలను నిర్వహించి కోట్ల రూపాయల్లో నష్టపరిహారాన్ని చెల్లించామన్నారు. ఈ కార్యక్రమంలో నాల్గవ అదనపు జిల్లా జడ్జి అన్వర్‌బాషా, ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ యూయూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 1598 కేసులకు పరిష్కారం ఈ లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో ఎంతోకాలంగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 1998 కేసులకుగాను 1598 కేసులకు పరిష్కారం లభించింది. వీటి ద్వారా కక్షిదారులకు రూ. 5,45,81,581 ఇప్పించారు. -
పెండింగ్ కేసులు పరిష్కరించడమే లక్ష్యం
– జూనియర్ సివిల్ జడ్జి ఆర్ఎం.శుభవల్లి బద్వేలు అర్బన్: దీర్ఘ కాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరువురి సమ్మతంతో పరిష్కరించడమే లోక్ అదాలత్ లక్ష్యమని జూనియర్ సివిల్ జడ్జి ఆర్ఎం.శుభవల్లి అన్నారు. శనివారం స్థానిక జూనియర్ సివిల్ కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో ఆమె మాట్లాడుతూ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి సమయం వృధా చేసుకోకుండా కేసులు పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. క్షణికావేశంలో చేసే తప్పులను సరిదిద్దుకున్నప్పుడే మానవ జీవితానికి సార్థకత ఉంటుందని తెలిపారు. ఈ లోక్ అదాలత్‌లో 14 క్రిమినల్ కేసులు , ఒక సివిల్ కేసు పరిష్కరించినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డిఎ.కుమార్, ఈ.చంద్ర ఓబుల్‌రెడ్డి, సీనియర్ న్యాయవాదులు బ్రహ్మారెడ్డి , లీగల్ ఎయిడ్ కౌన్సిల్ న్యాయవాది వాసుదేవరావు, న్యాయవాదులు రమణారెడ్డి, మురళి, లోక్ అదాలత్ బెంచ్‌మెంబర్లు నాగభూషణమ్మ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌లో ప్రథమ స్థానంలో నిలవాలి
శ్రీకాకుళం సిటీ : లోక్ అదాలత్ ద్వారా కేసులను సత్వరం పరిష్కరించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు వీబీ నిర్మలాగీతాంబ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ భవనంలో ఎనిమిదో జాతీయ లోక్ అదాలత్ వాల్‌పోస్టర్‌ను తోటి న్యాయమూర్తులతో కలిసి మంగళవారం ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడో జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1350 కేసులను పరిష్కరించినట్టు చెప్పారు. కేసులను పరిష్కరించడంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా నాల్గో స్థానంలో ఉందని, ప్రథమ స్థానంలో నిలిచేందుకు న్యాయవాదులు సహకరించాలని కోరారు. ఈ నెల 8న జరగనున్న ఎనిమిదో జాతీయ లోక్ అదాలత్ ద్వారా అన్ని రకాల కేసులతో పాటు ట్రాఫిక్, మున్సిపల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులు, సెక్షన్–138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటు యాక్టు కేసులు, రికవరీ సూట్లు, మోటారు యాక్సిడెంట్ క్లయిం కేసులు, సివిల్, రెవెన్యూ, ప్రభుత్వ భూసేకరణ, ప్రీలిటిగేషన్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కేసులన్నీ న్యాయ సేవాసదన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా కోర్టుల సముదాయంతో పాటు జిల్లాలోని ఇతర కోర్టు సముదాయాలతో నిర్వహించనున్నట్టు తెలిపారు. కక్షిదారులు పెద్ద ఎత్తున పాల్గొని రాజీమార్గం ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.మేరీగ్రేస్ కుమారి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కె.సుధారాణి, పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ షేక్ ఇంతియాజ్ అహ్మద్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి పి.రాజేంద్రప్రసాద్, ఎక్సైజ్ మేజిస్ట్రేట్ వై. శ్రీనివాసరావు, మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ పి.సాయిసుధ, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగు కృష్ణారావు, ఉపాధ్యక్షుడు మామిడి క్రాంతి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
1639 కేసుల పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని ఒంగోలు సెంట్రల్ : లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే ఇరువురికీ గెలుపు సాధ్యమవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎం.జి.ప్రియదర్శిని అన్నారు. ఒంగోలు జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొని మాట్లాడుతూ లోక్ అదాలత్‌ల ద్వారా కేసులు పరిష్కరించుకుంటే సమయం, ధనం ఆదా అవుతుందన్నారు. కార్యక్రమానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.రాజా వెంకట్రాద్రి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మెుదటి అదనపు జిల్లా జడ్జి ఎస్కె.మహ్మద్ ఇస్మాయిల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శివనాగేశ్వరరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.లక్ష్మీకుమారి, మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె.శ్రావణ్‌కుమార్, పి.వి.శిరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లావ్యాప్తంగా 1639 కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించారు. వీటిలో 34 సివిల్ కేసులు, 1113 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా ఒంగోలు, అద్దంకి కోర్టుల పరిధిలో కేసులను పరిష్కరించారు. ఒంగోలు జిల్లా కోర్టులో ఐదు బెంచ్‌లు ఏర్పాటు: మెుదటి బెంచ్‌కు ప్రిసైడింగ్ అధికారిగా మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్కె.మహ్మద్ ఇస్మాయల్, రెండో బెంచ్‌కు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.లక్ష్మీ కుమారి, మూడో బెంచ్‌కు డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టి.రాజా వెంకటాద్రి, నాల్గవ బెంచ్‌కు ఎక్సైజ్ కోర్టు మేజిస్ట్రేట్ ఎస్కె ఇబ్రహీం షరీఫ్, ఐదో బెంచ్‌కు మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె శ్రావణ్ కుమార్ ప్రిసైడింగ్ అధికారులుగా వ్యవహరించారు. -
చట్టాలపై అవగాహన అవసరం
లీగల్ (కడప అర్బన్) : చట్టాలపై పోలీసు అ«ధికారులతోపాటు ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి ఖచ్చితమైన అవగాహన ఉండాలని, మారుతున్న చట్టాలకు అనుగుణంగా తాము కూడా పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణంలోని లోక్ అదాలత్ భవనంలో పోలీసు, ఇతర ప్రభుత్వ అధికారులకు, ఎన్జీఓలకు నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నామని, తద్వారా మారుతున్న చట్టాలను మరింత ప్రజల్లోకి అవగాహన కోసం తీసుకు వెళుతున్నామన్నారు. ఇందులో భాగంగానే పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఎన్జీఓలు, స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులకు మరింత అవగాహన కల్పించే క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి యూయూ ప్రసాద్, జడ్జిలు అన్వర్‌బాష, శోభారాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీ రాఘవరెడ్డి, కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
31న మొబైల్ లోక్ అదాలత్
బొబ్బిలి: విజయనగరంలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం ఈ నెల 31 న లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్. లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం జిల్లాలోని బొబ్బిలి మండల కేంద్రంలోని పోలీసు అతిథి గృహంలో మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ మొబైల్ లోక్‌అదాలత్ ద్వారా ప్రజల వద్దకే వెళ్లి కేసులను పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో 12 మంది న్యాయవాదులను ఎంపిక చేసి ప్రత్యామ్నాయ న్యాయవ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీరి ద్వారా మధ్యవర్తిత్వం జరిపి కేసులను పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లాలో 17వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు.