ప్రధాని అడ్రస్ మారింది.. కొత్త చిరునామా ఇదే!
భారత ప్రధానమంత్రి అధికారిక నివాస చిరునామా మారింది. దేశంలోనే అత్యంత కీలకమైన చిరునామాగా ఇన్నినాళ్లు కనిపిస్తూ వస్తున్న 7, రేస్ కోర్స్ రోడ్ పేరు ఇక చరిత్రలో కలిసిపోయింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధాని నివాసంతోపాటు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత అధికారుల నివాసాలు ఉన్న దీని పేరును ’లోక్ కల్యాణ్ మార్గ్’ పేరు మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
’లోక కల్యాణానికి (ప్రజా సంక్షేమానికి) మించినది ఏది లేదు. అందుకే రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఏకగ్రీవంగా పేరు మార్పు నిర్ణయాన్ని తీసుకున్నారు’ అని బీజేపీ ఢిల్లీ ఎంపీ మినాక్షి లేఖి తెలిపారు. న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) బుధవారం భేటీ అయి.. 7, రేస్ కోర్స్ రోడ్డు పేరుమార్పుపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఆమె సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
రేస్ కోర్స్ అనే పదం భారత సంస్కృతి, సంప్రదాయాలకు ఏమాత్రం సంబంధంలేనిదని, వలస పాలన కాలం నాటి ఆ పేరును తొలిగించి 'ఏకాత్మ మార్గ్'అని పెట్టాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ప్రతిపాదించారు. న్యూఢిల్లీ లోక్ సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న ఆమె న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) సభ్యురాలిగా కూడా ఉన్నారు. బీజేపీ సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ భావజాలం ఏకాత్మ మానవ దర్శన్ (integral humanism)ను సూచించేలా రేస్ కోర్స్ రోడ్డును 'ఏకాత్మ మార్గ్'గా మార్చాలని ఆమె డిమాండ్ చేశారు.
అయితే, ఎన్డీఎంసీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. 'ఏకాత్మ మార్గ్'కు బదులుగా అమరజవాన్లలో ఒకరి పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. 1965 యుద్ధ వీరుడు లెఫ్టినెంట్ నిర్మల్జిత్ సింగ్ పేరును ఆప్ ఎమ్మెల్యే సూచించారు. ఈ విషయంపై కౌన్సిల్ బుధవారం సమావేశమై.. '7, లోక్ కల్యాణ్ మార్గ్'గా పేరు ప్రతిపాదిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోనుంది. ఇక నుంచి ప్రధాని నివాసం 7, లోక్‌కల్యాణ్ మార్గ్ కానుంది.