తనికెళ్ల భరణికి లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం ప్రదానం
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): లోక్‌నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణికి సోమవారం ప్రదానం చేశారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించారు.
ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, సినీ హీరో డాక్టర్ మంచు మోహన్‌బాబు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పాల్గొన్నారు.
వీరి చేతుల మీదుగా తనికెళ్ల భరణికి సాహిత్య పురస్కారం, రూ.2 లక్షల నగదు బహుమతి అందజేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఆయనకు సేవలందించిన నాటి ప్రత్యేక అధికారి గోటేటి రామచంద్రరావు, వ్యక్తిగత సహాయకుడు మోహన్, భద్రతాధికారి కృష్ణారావు, డ్రైవర్ లక్ష్మణ్‌లను కూడా సత్కరించారు.
వీరికి ఒక్కొక్కరికి రూ. లక్ష నగదు అందజేశారు. 18 సంవత్సరాలుగా సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నట్లు యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై రూపొందించిన లఘు చిత్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తెలుగు భాషాభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన కృషిని అతిథులు కొనియాడారు.