ముగ్గురూ ముగ్గురే!
- హాకీలో రాణిస్తున్న లోక్నాథ్, హరీష్, వెంకటేష్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంత ఆర్డీటీ హాకీ జట్టులో ఆ ముగ్గురు సభ్యులు కీలకంగా మారారు. ప్రతి మ్యాచ్లోనూ అద్భుత ప్రతిభతో దూసుకుపోతున్నారు. నంతపురంలో జరుగుతున్న జాతీయస్థాయి పోటీల్లో ఆర్డీటీ హాకీ జట్టును ఫైనల్కు చేర్చడంలో క్రీడాకారులు లోక్నాథ్, హరీష్, వెంకటేష్ కీలకంగా వ్యవహరించారు. రైతు, చేనేత, బేల్దారి కుటుంబాలకు చెందిన ఆ ముగ్గురూ భారత హాకీ జట్టులో స్థానమే లక్ష్యంగా శ్రమిస్తున్నారు.
లోక్నాథ్ :
ఆత్మకూరు మండలం తలుపూరుకు చెందిన సాధారణ రైతు జగన్నాథ్, సరస్వతి దంపతుల కుమారుడు లోక్నాథ్. ప్రస్తుతం అనంతలక్ష్మీ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఆర్డీటీ హాకీ జట్టులో సెంటర్ ఆఫ్ పొజిషన్లో ఉంటున్నాడు. జట్టు గోల్ సాధించాలన్నా.. ప్రత్యర్థి జట్టు గోల్ చేయకుండా ఆపాలన్నా తనే కీలకం. స్పెయిన్కు చెందిన హాకీ జట్టు కెప్టెన్ను తన ఆరాధ్య దైవంగా భావిస్తున్నాడు. అనంతపురం జిల్లా నుంచి భారత జట్టులో చోటు సంపాదిచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.
హరీష్:
ధర్మవరంలో చేనేత మగ్గం నేసే ప్రభాకర్, లక్ష్మీనారాయణమ్మ దంపతుల కుమారుడు హరీష్ అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాలలో బీకాం చదువుతున్నాడు. ఆరేళ్ల క్రితం సమ్మర్ కోచింగ్ క్యాంపునకు హాజరై ప్రతిభ కనబరచడంతో ఆర్డీటీ అకాడమీకి ఎంపికయ్యాడు. జట్టులో ఫుల్ బ్యాక్ స్థానంలో ఉంటూ జట్టుకు గోల్ సాధించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ టోర్నీలో 2 మ్యాచులు ఆడి 1 గోల్ సాధించాడు. భారత జట్టుకు సారథి కావడమే తన లక్ష్యం అంటున్నాడు.
వెంకటేష్ :
ధర్మవరం పట్టణానికి చెందిన వెంకటేష్ తండ్రి బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి లక్ష్మీనారాయణమ్మ గృహిణి. వెంకటేష్ రాఘవేంద్ర డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదువుతున్నాడు. ఆరేళ్ల నుంచి ఆర్డీటీ అకాడమీలో ఉంటూ అనంత జట్టులో ప్రత్యేకత చాటుతున్నాడు. జట్టులో లెఫ్ట్ ఆఫ్ స్థానంలో ఉంటూ జట్టు గోల్ సాధించడానికి కీలకంగా వ్యవహరిస్తున్నాడు.