ఎస్‌ఐ ఓ కేసు విషయంలో కొట్టాడనే మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన కూడేరు మండలకేంద్రంలో చోటుచేసుకుంది. గత నెల 31న కూడేరు పట్టణంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీని కొంత మంది యువకులు చించేశారు. ఈ కేసులో పలువురు యువకులను పోలీసులు పట్టుకున్నారు.
అందులో ఉన్న ఇద్దరు యువకులు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు అని తెలియటంతో వారిని స్థానిక ఎస్‌ఐ రాజు తీవ్రంగా కొట్టారు. దీంతో బయటికి వచ్చిన లోకనాథ్(18) అనే యువకుడు ఇంటికి వచ్చిన తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో హుటాహుటిన లోకనాథాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
లోక్‌నాథ్ కుటుంబసభ్యులతో పాటు సుమారు 200 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడేరు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఎస్‌ఐ రాజు టీడీపీ ఏజెంట్‌లా ప్రవర్తిస్తున్నాడని, వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.