కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం
భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకేందుకు ఓ వ్యక్తి ప్రయత్నం.. రక్షించిన కొవ్వూరు పోలీసులు
కొవ్వూరు : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలుకావడం ఆ వీరాభిమాని జీర్ణించుకోలేకపోయాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారని.. తన ఆవేదనను రాష్ట్రపతి దృష్టికి వెళ్తే మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తూ మిత్రులకు పంపిన వీడియో సందేశంలో వివరించాడు. తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిపై ఉన్న గామన్ బ్రిడ్జిపై మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఏమిటంటే..
తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన తాళ్లూరి రాజు, తన భార్య నాగలక్ష్మి, కుమార్తె హర్షిత, కుమారుడు మోక్షిత్‌తో కలిసి మంగళవారం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య కోవాలని నిర్ణయించుకున్నాడు. కొవ్వూరు–కాతేరు మధ్య గోదావరిపై ఉన్న గామన్ బ్రిడ్జి పైకి వేకువజామునే చేరుకున్నాడు. తాను, తన కుటుంబమంతా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నామని మిత్రులకు వీడియో సందేశం పెట్టాడు.
పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, రాజు కుటుంబ సభ్యులు, కొవ్వూరు పట్టణ పోలీసులు ఈ సమాచారం తెలుసుకుని వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్రిడ్జిపై రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై ఉన్న రాజుకు, ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్సార్‌సీపీ కార్యకర్త చిన్నం హరిబాబు, కొవ్వూరు పట్టణ సీఐ వి. జగదీశ్వరరావు, ఇతర సిబ్బంది నచ్చజెప్పి బయటకు తీసుకుకొచ్చారు.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉంటారు..
అనంతరం.. రాజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా వైఎస్సార్‌సీపీకే ఓటు వేశామంటున్నారని, కానీ, జగన్ ఎలా ఓటమి పాలయ్యారో తెలీడంలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. తన కుటుంబ చావుతోనైన ఎన్నికల్లో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ చేస్తారని ఆశిస్తున్నానన్నాడు. ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి ఉంటారని, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని రాజు చెప్పాడు.
తన ఆవేదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకువెళ్తే రీపోలింగ్‌కు ఆదేశిస్తారన్న ఉద్దేశంతో వీడియో ద్వారా తన సందేశాన్ని తెలిపి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నానన్నాడు. తన కుటుంబం చావు ద్వారా జగనన్నకు మేలు చేకూరితే చాలని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంత మంచి చేసిన జగన్ ఓడిపోతారనుకోలేదు..
తనకు రెండుసార్లు యాక్సిడెంట్ అయితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం చేశారని.. కాలులో స్టీల్‌రాడ్లు వేసి, వైద్యం చేసి, ఇంటికి పంపించారని రాజు తనకు జరిగిన మేలును వివరించాడు. మంచంపై ఉన్న రెండునెలలూ తన కుటుంబ పోషణకు వైఎస్సార్ ఆసరా పేరిట ఆర్థిక సాయం చేశారని.. అలాగే, తనకు ఏళ్ల తరబడి సొంతిల్లు లేదని, జగనన్న దయతో ఇంటి స్థలం ఇచ్చారని, ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పాడు. ఈ ఏడాది తన కుమార్తె చదువుకు అమ్మఒడి సొమ్ము పడుతుందని ఆశపడ్డానని, తన తమ్ముడికీ అమ్మఒడి సాయం అందుతోందని తెలిపాడు.
అలాగే, నాన్నమ్మకు రూ.3 వేల పింఛను అందిస్తున్నారని, అందరికీ ఇంత మంచి చేసిన జగన్ ఘోరంగా ఓటమి పాలవుతారని కలలో కూడా ఊహించలేదని కన్నీటితో చెప్పాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచీ తనకు కంటి మీద కునుకులేదని, జగనన్న ఓటమి నిరంతరం తనను కలచివేస్తోందని ఆవేదన చెందాడు. ఏదో మోసం జరిగిందనేదే తన బాధ అని, ఈ ఎన్నికలపై విచారణ చేయిస్తే వాస్తవాలు బయటపడతాయన్నాడు.
ఇక బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తే ఎన్నికలపై విచారణకు అవకాశం ఉండదన్నారు. అందుకనే తెల్లవారుజామున 5.30 గంటలకు భార్యాపిల్లల్ని తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు బ్రిడ్జిపైకి వచ్చానని చెప్పాడు. రాజు, ఆయన భార్యకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment