పండుగలు.. శబ్దకాలుష్య కేంద్రాలు
వందేళ్ల క్రితం లోకమాన్య తిలక్ ప్రారంభించిన సామూహిక ఉత్సవాలకు నేడు కొనసాగుతున్న ఉత్సవాలకు పోలికే లేదు. శబ్దం ఎంత ఎక్కువగా ఉంటే సంబరం అంత భారీగా ఉంటుందనే తప్పు భావన నేడు ప్రబలిపోయింది.
రోడ్లమీదే ప్రార్థనలు చేసుకో వడాన్ని అధిగమించడంలో ముస్లింలకు సహాయపడాలనే ఉద్దేశంతో ముంబైలోని మసీ దులు అదనపు అంతస్తులను నిర్మించుకోవడానికి గతంలో మనోహర్ జోషి నేతృత్వం లోని శివసేన-బీజేపీ ప్రభు త్వం అనుమతించింది. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వం లోని బీజేపీ-శివసేన ప్రభుత్వం గణేష్ చతుర్థిని సంబ రంగా జరుపుకోవడానికి హిందువులు వీధులను ఆక్ర మించాలని కోరుకుంటోంది. ట్రాఫిక్‌కు ఆటంకం కావ చ్చని తెలుస్తున్నప్పటికీ వీధుల్లో పందిళ్లు నిర్మించుకోవ డానికి మహారాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తోంది.
గణపతి ఉత్సవం మహారాష్ట్రలో సుదీర్ఘకాలం నుం చి కొనసాగుతున్న సంప్రదాయం. దాదాపు అధికారు లందరూ ఉత్సవాల నిర్వాహకుల పట్ల అనుకూలత ప్రదర్శిస్తుంటారు. పందిళ్లను నిర్మించుకోవడానికి రహ దార్లను తవ్వి వేసే స్వేచ్ఛను కూడా వారికి ప్రసాదిస్తుం టారు. పురపాలక సంస్థలు ఆ గుంటలను పూడ్చివేసే ప్రయత్నం చేయవు. నిజానికి, ట్రాఫిక్ బాగా రద్దీగా ఉన్న ప్రాంతాల్లో అలాంటి పందిళ్లను నిర్మించుకోవ డానికి అనుమతి ఇవ్వకపోతే, ఉత్సవాల నిర్వాహకులు అసౌకర్యానికి గురై ఇబ్బందిపడతారంటూ ముంబై పుర పాలక సంస్థ బాంబే హైకోర్టు ముందు వాదించింది కూడా.
అయితే ఈ వాదనతో ఏకీభవించని హైకోర్టు, పురపాలక సంస్థ ఎవరి ప్రయోజనాలకోసం సేవ చేయాలనుకుంటోందని ప్రశ్నించింది. తమ తమ రాజకీయ ప్రయోజనాలను ఇది దెబ్బ తీస్తుంది కాబట్టి ఎవరూ ఈ అంశాన్ని తడమాలను కోవడం లేదు. గణపతి ఉత్సవాలను జరుపుకోవల సింది భారత్‌లోనే కానీ పాకిస్తాన్లో కాదని శివసేన బాహాటంగా ప్రకటించింది. వీధుల్లో నమాజ్ చేసుకో కుండా చేయాలని గతంలో తాను కోరుకున్న విషయా న్ని శివసేన మర్చిపోయినట్లు వ్యవహరిస్తూ గణేష్ ఉత్సవాల నిర్వహణలో తమకు అసౌకర్యం కలిగించే ఎలాంటి ఆటంకాలనయినా ధిక్కరిస్తుంటుంది. ఈ విష యంలో సంయమనం పాటించి వివాద పరిష్కారం చేయడానికి బదులుగా, న్యాయస్థానాలు తీసుకునే చర్య కోసం ఇతర రాజకీయ పార్టీలు వేచి చూస్తుంటాయి.
ఈ నేపథ్యంలో, లౌకికవాదం గురించి ఏ రాజ కీయ నేత అయినా వివేచన ప్రదర్శించిన అరుదైన సం ఘటన ఉందా అని గుర్తు చేసుకుంటున్నాను. చిమన్ పటేల్ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకున్న సందర్భంగా గుజరాత్ శాసనసభలో నవీన్ శాస్త్రి మా ట్లాడుతూ లౌకికవాదాన్ని ఇలా నిర్వచించారు : ఒక స్త్రీ లేదా పురుషుడు తమ ఇంటి గడప దాటి బయటకు వచ్చిన క్షణం నుంచి అతడు లేదా ఆమె దేశ పౌరుడి గానే ఉంటారు తప్ప, హిందువుగా లేదా ముస్లింగా ఉండరు. మతాలను, వాటి చిహ్నాలను వీధుల్లో లేకుం డా చేయాలన్నదే ఆయన భావం. కానీ మనం ఇప్పుడు చూస్తున్న ధోరణి ఏమిటంటే, మతాల మధ్య తీవ్ర స్పర్థాతత్వంతో వాటిని వీధుల్లోకి తీసుకువస్తుండటమే.
ఒక్క గణపతి ఉత్సవాల విషయంలోనే కాదు.. దహి-హంది వేడుకల్లోనూ యువకులు ప్రాణాలకు తెగించి, మానవ పిరమిడ్లను నిర్మించడంలో పోటీపడు తుంటారు. తమకు బహుమతిని తెచ్చిపెట్టనున్న, ఎత్తులో ఉండే కుండను చేరుకోవడానికే వారు పిరమిడ్ల రూపం దాలుస్తారు. ఇక నవరాత్రి కూడా జనం తొక్కిడి తో, శబ్దకాలుష్యంలో కూరుకుపోతుంది. ఈ అన్ని ఉత్స వాల్లో రాజకీయ నేతలు, వారి అనుయాయులు పాత్ర పోషిస్తూ పండుగలను వికృతపరుస్తుంటారు. ఇవి వం దేళ్ల క్రితం లోకమాన్య తిలక్ ప్రారంభించిన రకం ఉత్స వాలు కాదు. బ్రిటిష్ వాళ్ల కన్నుగప్పటానికి పండుగల రూపంలో ప్రజలను కూడగట్టాలన్నది తిలక్ ఉద్దేశం. అయినా ఆయన కార్యక్రమం వీధుల్లోకి ఎక్కలేదు.
బహిరంగ స్థలాలను దుర్వినియోగపర్చడాన్ని అనుమతించనట్లయితే దాన్ని మత స్వాతంత్య్రానికి అడ్డంకిగా చూస్తున్నారు. పండుగల సందర్భంగా శబ్ద కాలుష్య ప్రమాదాన్ని తనిఖీ చేయాలంటూ బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పురపాలక సంస్థ లు పెడచెవిన పెట్టాయి. ఇది అంతిమంగా రాజకీయ వర్గాల ప్రయోజనాలకే ఉపయోగపడుతుంది. ఈ పండుగల నిర్వహణకు అవసరమయ్యే నిధులు వీరిలో ఒక సెక్షన్‌ను బలిసేలా చేశాయి. రాజకీయ నేతలు నిర్ణయం తీసుకుంటే అధికారవర్గం దానికి జీహుజూర్ అంటోంది. ప్రజలు లెక్కలోకే రారు.
అలాగని చెప్పి ఈ పండుగలకు ప్రజాదరణ కొరవ డిందని చెప్పలేము. సమాజంలోని ఒక భాగం మాత్ర మే వీటిలో పాలుపంచుకుంటోంది. చాలామంది ఇంటి లో పూజ చేస్తారు. ఈ ఉత్సవాలపై టీవీల ప్రత్యక్ష ప్రసా రాల ఫలితంగా అనేకమంది జనసందోహపు అసౌక ర్యం నుంచి తప్పించుకోవడానికి తమ డ్రాయింగ్ రూమ్‌లలో కూర్చుని చూస్తుంటారు. కొంతమంది దర్శనం కోసం పొరుగున ఉన్న మందిరానికి వెళ్లి కూర్చుంటారు. పేరుకు వీరు సార్వజనిక్ లేదా పబ్లిక్‌గా కనిపిస్తారు కానీ, నగరాలలో ఓటింగ్ జరిగే సమ యంలో వీరి భాగస్వామ్యం చాలా తక్కువగానే ఉం టుంది. అందుకే శబ్దం ఎంత ఎక్కువగా ఉంటే ఉత్సవం అంత భారీగా ఉంటుందనే తప్పుడు భావం పాకిపో యింది. ఈ ఉత్సవాల సందర్భంగా వాయించే వాయి ద్యాలు ఎవరి కర్ణభేరులనయినా అమాంతంగా బద్దలు చేస్తాయి.
తిలక్ వందేళ్ల క్రితం ప్రారంభించిన ఉత్సవాలు ఇవి కాదు. పుణేలోని తన ఇంటి ఆవరణలో తొలి సామూహిక ఉత్సవం జరిపిన సంవత్సరం తర్వాత ముంబైలో తను సందర్శించిన తొలి ఉత్సవ స్థలం వద్ద నేటికీ ఒక చిన్న విగ్ర హం మాత్రమే ఉంది. అక్కడ శబ్దం ఏమాత్రం లేదు. ఇతరులు దీన్ని ఆదర్శంగా తీసు కోవడం పోయి, ప్రతి సంవత్సరం విగ్రహాల ఎత్తును పెంచుకుంటూ పోయారు. గణేష్ ఉత్సవాలను ఆ క్షణంలో నిర్వహించే లక్ష్యం గా మాత్రమే అందరూ భావిస్తున్నారు తప్పితే అవి కలిగించే దీర్ఘకాలిక ప్రభావాలను ఎవరూ పట్టించు కోవటం లేదు. మతపరమైన మనోభావం అనేది మన దేశంలో మంచి సాకుగా ఉంటుంది మరి.
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com)
- మహేష్ విజాపుర్కార్