కోనసీమ రైల్వే సాధనే లక్ష్యం
మలికిపురం, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీలో టికెట్ దక్కకే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు టీడీపీలోకి వెళ్తున్నారని మాజీ మంత్రి , వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం పార్లమెంట్ కో ఆర్డినేటరు పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు.అలా కాదని ఆనేతలు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. శనివారం మలికిపురంలో రాజోలు నియోజక వర్గానికి చెందిన సుమారు ఐదు వేల మంది కాంగ్రెస్, టీడీపీల నుంచి కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. వారిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఉన్నారు.
రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరు కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో విశ్వరూప్ మాట్లాడారు. రాష్ట్ర విభజనతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిందన్నారు. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జననేత జగన్మోహన్రెడ్డి రాకతో వారి కష్టాలు తీరుతాయన్నారు. దివంగత లోక్ సభ స్పీకర్ బాలయోగి ఆశయాలైన కోనసీమ రైల్వే లైన్, రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి చిరకాల వాంఛ అయిన సఖినేటిపల్లి వంతెన నిర్మాణాల లక్ష్య సాధనే ధ్యేయంగా వచ్చే ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు చెప్పారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పార్టీలోకి వస్తే జగన్ మోహన్‌రెడ్డి సముచిత స్థానం కల్పిస్తారని విశ్వరూప్ అన్నారు.
జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి మాట్లాడుతూ మహానేత ప్రవేశపెట్టిన పథకాలు అమలు జగన్మోహన్రెడ్డే అమలు చేయగలరన్నారు. పారిశ్రామిక వేత్త జంపన సత్యనారాయణరాజు, రాజోలు నియోజక వర్గ కో ఆర్డినేటరు బొంతు రాజేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర సభ్యులు జక్కంపూడి తాతాజీ, ఏఎంసీ చైర్మన్ గెద్దాడ సత్యనారాయణమూర్తి, వైఎస్ చైర్మన్ అడబాల సుధాకర్, మాజీ ఎంపీపీ ముత్యాల కాశీ, మండల మమాజీ ఉపాధ్యక్షులు గెడ్డం తులసీ భాస్కరరావు , మండల కన్వీనర్లు యెనుముల నారాయణస్వామి, బొలిశెట్టి భగవాన్, జిల్లెళ్ల బెన్నీ సుధాకర్ ఉన్నారు.