Loop Line
-
రామగుండంలో సీ అండ్ టీ ట్రాక్‌పై తప్పిన ప్రమాదం
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలోని క్యారేజ్&వాగన్ (C&W) ట్రాక్‌పై తప్పిన ప్రమాదం. లూప్ లైన్లో నిలిచి ఉన్న మిషన్‌ను గూడ్స్ రైలు భోగీలు ఢీకొట్టాయి. గూడ్స్ రైలు నుంచి లింకు ఊడిపోవడంతో 8 భోగీలు వేరు అయ్యాయి. కిందకు విడిపోయిన భోగీలు వేగంగా వెళ్లాయి. యూటీ మిషన్‌ను ఢీకొట్టడంతో ట్రాక్ ఎండ్ గోడపైకి యూటీ మిషన్ దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఆపరేటర్ మిషన్‌లో నిద్రిస్తున్నాడు. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి ఆపరేటర్ బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
కవచ్ మరింత భద్రం
సాక్షి, హైదరాబాద్: రెండు రైళ్లు ఒకే ట్రాక్‌మీద ఎదురెదురుగా దూసుకొస్తున్నప్పుడు పరస్పరం ఢీకొనకుండా వాటంతట అవే నిలిచిపోయేలా సొంతగా రూపొందించిన కవచ్ పరిజ్ఞానానికి మరింత పదును పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. పదేళ్ల పరీక్షలు, ట్రయల్స్ అనంతరం దాన్ని వినియోగించేందుకు గతేడాది రైల్వే బోర్డు అనుమతించిన విషయం తెలిసిందే. దక్షిణ మధ్య రైల్వేలో దాదాపు 1,500 కి.మీ. మేర ఈ పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసిన అధికారులు, దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఇటీవల టెండర్లు పిలిచారు. కానీ గత నెలలో ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన ఘోర రైలు దుర్ఘటన అనంతరం కవచ్ పనితీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆ దుర్ఘటనలో ఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దేశ చరిత్రలో ఎన్నడూ ఈ తరహా ప్రమాదం చోటు చేసుకోలేదు. ఇప్పటివరకు చోటుచేసుకున్న ఘోర దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచే స్థాయిలో, 295 మంది వరకు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. కవచ్ పరిజ్ఞానం ఆ మార్గంలో ఏర్పాటు చేసి ఉంటే, ఈ ప్రమాదం తప్పి ఉండేదంటూ అప్పట్లో కొందరు నేతలు వ్యాఖ్యానించారు. కానీ రైల్వే అధికారులు మాత్రం ‘ఆ మార్గంలో ఒకవేళ కవచ్ పరిజ్ఞానం ఏర్పాటై ఉన్నా.. ఈ ప్రమాదాన్ని నిలువరించే వీలుండేది కాదు..’అని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే కవచ్‌ను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని స్పష్టమైంది. కవచ్ ఏర్పాటు ఇక వేగవంతం.. ట్రయల్స్ స్థానికంగా నిర్వహించినందున దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,500 కి.మీ. మేర కవచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీతో లింక్ అయి ఉన్న మార్గాల్లో కనీసం 4 వేల కి.మీ. మేర ఏర్పాటు చేయాలని గతేడాది నిర్ణయించినా అది సాధ్యం కాలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక దాని ఏర్పాటు పనులు వేగంగా పూర్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. సంవత్సరానికి కనీసం 8 వేల కి.మీ. పూర్తి చేసేలా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. రెండు వేర్వేరు టెండర్ల ద్వారా 12 వేల కి.మీ. ఏర్పాటుకు సిద్ధమైంది. వచ్చే పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా లక్ష కి.మీ. వరకు దాన్ని అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. కొత్త అనుమానాలు.. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు చేరువగా వచ్చినా, బ్రేక్ కొట్టాల్సిన సమయంలో లోకో పైలట్ విస్మరించినా, సిగ్నల్‌ను లోకో పైలట్ పట్టించుకోకుండా రైలును ముందుకు పోనిచ్చినా.. లోకో పైలట్‌తో ప్రమేయం లేకుండా కవచ్ పరిజ్ఞానం పని ప్రారంభించి ప్రమాదం జరక్కుండా నిలువరిస్తుంది. ఇది కవచ్ పనితీరును పరిశీలించే క్రమం (ట్రయల్స్)లో స్పష్టమైంది. అంతవరకు దాని పనితీరును శంకించాల్సిన అవసరం లేదు. కానీ బాలాసోర్ ప్రమాదం కొత్త అనుమానాలను తెరపైకి తెచ్చింది. ఆరోజు.. మెయిన్‌లైన్‌లో గ్రీన్ సిగ్నల్ ఉంది. ఎక్స్‌ప్రెస్ రైలు ఆ మేరకు దూసుకుపోయింది. కానీ ట్రాక్ పాయింట్ మాత్రం లూప్లైన్తో అనుసంధానమై ఉంది. దీంతో 127 కి.మీ. వేగంతో వచ్చిన రైలు ఒక్కసారిగా లూప్లైన్లోకి వెళ్లి.. అక్కడికి కేవలం 100 మీటర్ల దూరంలో నిలిచి ఉన్న గూడ్సు రైలును ఎనిమిది సెకన్ల (లూప్లైన్లోకి ప్రవేశించాక) వ్యవధిలోనే ఢీకొంది. దీంతో కవచ్ ఉన్నా.. ట్రాక్ పాయింట్ లూప్లైన్తో అనుసంధానమై ఉందన్న విషయాన్ని ముందుగా గుర్తించేది కాదని నిపుణులంటున్నారు. గ్రీన్ సిగ్నల్ ఉండటం, ఎదురుగా ఆ ట్రాక్‌పై మరో రైలు లేకపోవటంతో కవచ్ మిన్నకుండిపోతుందని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఇదే కోణంలో కవచ్‌ను మరింత మెరుగ్గా తయారుచేసి, కొత్తగా పరీక్షలు నిర్వహించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. సిగ్నల్‌కు విరుద్ధంగా, పాయింట్ తప్పుగా మరో లైన్‌కు లింక్ అయి ఉంటే దాన్ని కూడా కవచ్ గుర్తించేలా మార్చబోతున్నారు. కవచ్ పరిజ్ఞానాన్ని రూపొందించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సనత్‌నగర్–వికారాబాద్–వాడీ సెక్షన్ల మధ్య ట్రయల్స్ చేసినందున.. తదుపరి పరీక్షలు కూడా ఇక్కడే చేసే అవకాశం ఉంది. -
వివిధ సంస్థలు.. బాధితులకు సేవలు
కొరాపుట్/భువనేశ్వర్: రైలు దుర్ఘటన జరిగిన విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన వెంటనే బాలేశ్వర్, బద్రక్ జిల్లాల యువత స్పందించారు. ఎటువంటి పిలుపు లేకుండానే తమకు తాముగా సాయం అందించేందుకు ముందుకు కదిలారు. బద్రక్, బాలేశ్వర్ జిల్లా కేంద్రాల అస్ప త్రుల వద్దకు చేరుకొని, అవసరమైన క్షతగ్రాతులకు రక్తదానం చేసేందుకు సిద్ధమయ్యారు. రాత్రి నుంచి ఉదయం వరకు క్యూలోనే ఉండి రక్తదానం చేశారు. సుమారు వేయి మంది యువత రక్తదానం చేసి, ప్రాణదాతలుగా నిలిచారు. సత్యసాయి భక్తుల సేవలు రైల్వే దుర్ఘటన జరిగిన వెంటనే సత్యసాయి భక్తుల సేవలు మొదలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సత్యసాయి సేవా సమితి అఖిల భారత సమన్వయకర్త నిమిష్ పాండ్యా, జాతీయ సేవా సమన్వయకర్త కోటేశ్వరరావు వ్యక్తిగతంగా రంగంలోకి దిగారు. వారి సూచనతో సుమారు 70 మంది సత్యసాయి సేవాదళ్ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాము తెచ్చిన ట్రాక్టర్ల మీద క్షతగాత్రులు, మృతదేహాలను అస్పత్రులకు తరలించారు. వైద్య సిబ్బంది తగినంతమంది లేకపోవడంతో బాధితులకు తామే సపర్యలు చేసి, ప్రాథమిక చికిత్స అందజేశారు. అలాగే బాధితులకు ఆహారం, తాగునీరు అందించి, అందరి మన్ననలు పొందారు. 300 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ రైలు దుర్ఘటన జరిగిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్ దళాలు అత్యంత వేగంగా అప్రమత్తం కావడంతో సుమారు 300 ప్రాణాలు నిలిచాయి. ఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో 9 బృందాలు రంగంలోకి దిగాయి. అత్యంత వేగంగా ప్రాణా పాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న 300 మందిని ఆస్పత్రులకు తరలించడంతో ప్రాణాపా యం తప్పింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పోలీసు జాగిలాలు తోడ్పాటునందించాయి. -
సిగ్నల్ లోపం వల్లే...!
సిగ్నల్ సమస్యే ప్రమాదానికి ప్రధాన కారణమని రైల్వే శాఖ సంయుక్త తనిఖీ కమిటీ తేల్చింది. ‘‘కోరమండల్ మొదటి మెయిన్ లైన్లోంచి లూప్ లైన్లోకి మారి దానిపై గూడ్సును ఢీకొట్టి పట్టాలు తప్పింది. దాని బోగీలు చెల్లాచెదురయ్యాయి. కొన్ని వెళ్లి రెండు మెయిన్ లైన్లపై పడ్డాయి. అదే సమయంలో రెండో మెయిన్ లైన్‌పై బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొని పట్టాలు తప్పింది. రెండు బోగీలు పట్టాలు తప్పి తలకిందులయ్యాయి’’ అని ప్రాథమిక నివేదికలో స్పష్టం చేసింది. అందులో ఇంకా ఏముందంటే... ► సాయంత్రం 6.52 గంటల సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బహనగా స్టేషన్‌ను దాటుతుండగా ప్రమాదం జరిగింది. ► ఈ స్టేషన్ వద్ద రెండు మెయిన్ లైన్లతో పాటు వాటికిరువైపులా రెండు లూప్ లైన్లున్నాయి. ► పాసింజర్ హాల్ట్ స్టేషన్ గనుక ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్ట్ రైళ్లు వచ్చినప్పుడు గూడ్స్‌లను లూప్ లైన్లకు తరలిస్తారు. ► శుక్రవారం సాయంత్రం ఒక గూడ్స్ ముందుగా స్టేషన్ సమీపానికి చేరుకుంది. వెనకే కోరమండల్ వస్తుండటంతో గూడ్స్‌ను లూప్లైన్కు మళ్లించారు. ► కోరమండల్ వెళ్లాల్సిన మెయిన్ లైన్‌పై అప్పటికి రెడ్ సిగ్నల్ ఉంది. స్టేషన్ సిబ్బంది 17ఏ స్విచ్ నొక్కి దాన్ని గ్రీన్‌గా మార్చాలి. కానీ ఆ స్విచ్‌ను నొక్కినా పని చేయలేదు (సిగ్నల్ ఇచ్చి, మళ్లీ వెనక్కు తీసుకున్నారని కూడా చెబుతున్నారు). రెడ్ సిగ్నలే కొనసాగడంతో కోరమండల్ లూప్లైన్లోకి మళ్లి గూడ్స్‌ను ఢీకొట్టింది. ► గూడ్స్‌ని బలంగా ఢీకొట్టిన తర్వాత కోరమండల్ కోచ్‌లు ఎగిరిపడి.. పక్కన ఉన్న మరో మెయిన్‌లైన్‌పైకి వెళ్లాయి. ► అదే సమయంలో ఆ లైన్లో 130 కి.మీ. వేగంతో (116 కి.మీ. అని కూడా చెప్తున్నారు) వెళ్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్ చివరి బోగీలపై కోరమండల్ బోగీలు పడ్డాయి. దాంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ► హౌరా 3 నుంచి 5 సెకెన్ల ముందుగా వచ్చుంటే ప్రమాదం తప్పేది. ► సూపర్ ఫాస్ట్ రైళ్ల గరిష్ట వేగం 130 కి.మీ. ► ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. -
లూప్ లైనే యమపాశమైంది
న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం: అనుమానమే నిజమైంది. లూప్‌లైనే మృత్యుపాశంగా మారింది. మెయిన్ లైన్లో వెళ్లాల్సిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లూప్లైన్లోకి మళ్లడమే దేశమంతటినీ కుదిపేసిన మహా విషాదానికి దారితీసింది. లూప్ లైన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును మహా వేగంతో ఢీకొట్టేందుకు, వందలాది మంది దుర్మరణం పాలయ్యేందుకు కారణమైంది. శుక్రవారం ఒడిశాలో మూడు రైళ్లు ఘోర ప్రమాదానికి గురైన పెను విపత్తుపై రైల్వే శాఖ జరిపిన ప్రాథమిక విచారణ ఈ మేరకు తేల్చింది. గూడ్సును ఢీకొన్న వేగానికి ఏకంగా 21 కోరమాండల్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. చెల్లాచెదురై పక్క ట్రాక్‌పై పడిపోయాయి. దానిపై వస్తున్న బెంగళూరు–హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆ బోగీలను ఢీకొన్ని పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో కోరడమండల్ గంటలకు 128 కిలోమీటర్లు, హౌరా 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి! దాంతో జంట ప్రమాదాల తీవ్రత ధాటికి పలు బోగీలు తలకిందులయ్యాయి. ఒక ఇంజన్‌తో పాటు బోగీలకు బోగీలే గూడ్స్‌పైకి దూసుకెళ్లాయి. బహనగా బజార్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంపై ప్రాథమిక నివేదికను అధికారులు ఇప్పటికే రైల్వే బోర్డుకు సమర్పించారు. రైల్వే శాఖ ప్రమాద కారణాన్ని అధికారికంగా వెల్లడించలేదు. విద్రోహ కోణానికీ ఆధారలేవీ ఇప్పటిదాకా లేవని రైల్వే వర్గాలంటున్నాయి. మొత్తం ఉదంతంపై పూర్తిస్థాయి విచారణకు సౌత్ ఈస్టర్న్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ ఎ.ఎం.చౌదరి సారథ్యంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. పౌర విమానయాన సంస్థ ఆధ్వర్యంలో పని చేసే రైల్వే సేఫ్టీ కమిషనర్ ఇలాంటి ప్రమాద ఘటనలను దర్యాప్తు చేస్తారు. లూప్‌లైన్ అంటే...? సులువుగా చెప్పాలంటే ఇవి రైల్వే స్టేషన్లలో ఉండే అదనపు రైల్వే లైన్లు. ఒకటికి మించిన ఇంజన్లతో కూడిన భారీ గూడ్సులకు కూడా సరిపోయేలా ఈ లూప్ లైన్లు సాధారణంగా కనీసం 750 మీటర్ల పొడవుంటాయి. ► కారణంపై తలో మాట... ప్రమాద కారణంపై తలో మాట వినిపిస్తున్నారు... ► ఇది కచ్చితంగా సిగ్నలింగ్ వైఫల్యమేనని కొందరంటున్నారు. ► రైల్వే శాఖ వర్గాలు మాత్రం కోరమండల్ నేరుగా లూప్లైన్లోకి వెళ్లి ఆగి ఉన్న గూడ్సును ఢీకొందా, లేక పట్టాలు తప్పి, ఆ క్రమంలో కొన్ని బోగీలు తలకిందులై, మిగతా రైలు లూప్లోన్లోకి మళ్లి గూడ్సును గుద్దిందా అన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. డ్రైవర్ల తప్పిదం కాదు ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే డ్రైవర్ల తప్పిదం ఏమీ లేనట్టే కనిపిస్తోందని చెన్నై ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ మాజీ జనరల్ మేనేజర్, తొలి వందేభారత్ రైలును రూపొందించిన బృందానికి సారథ్యం వహించిన సుధాన్షు మణి స్పష్టం చేశారు. ‘‘కేవలం ప్రయాణికుల రైలు పట్టాలు తప్పడం మాత్రమే జరిగి ఉంటే దానివన్నీ అత్యాధునిక లింక్ హాఫ్మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లే. అవి ఇలా తిరగబడిపోవడం జరగదు. ఇంతమంది దుర్మరణం పాలయ్యే అవకాశమే ఉండదు’’ అని వివరించారు. ‘‘ప్రమాద సమయంలో కోరమండల్‌కు అది వెళ్లిన లైన్‌పై గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టు డేటా లాగర్లో స్పష్టంగా ఉంది. అంటే డ్రైవర్ సిగ్నళ్లను ఉల్లంఘించడం వంటిదేమీ జరగలేదన్నది స్పష్టం’’ అని ఆయనన్నారు. అంతటి వేగంలో ప్రమాదాన్ని నివారించేందుకు రెండో రైలు (హౌరా) డ్రైవర్ చేయగలిగిందేమీ ఉండదని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు (ట్రాఫిక్) శ్రీప్రకాశ్ అభిప్రాయపడ్డారు. ప్రయాణికుల రైళ్లు వాటంతట అవి పట్టాలు తప్పడం చాలా అరుదని వివరించారు. ప్రమాద సమయంలో... కోరమండల్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటకు 128 కి.మీ. బెంగళూరు–హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వేగం గంటలకు 116 కి.మీ. గూడ్స్ లూప్ లైన్లో ఆగి ఉంది ప్రమాద సమయంలో రెండు రైళ్లలో ప్రయాణికులు 2,700 పై చిలుకు (కోరమాండల్‌లో 1257, హౌరాలో 1039 మంది రిజర్వ్డ్ ప్రయాణికులున్నారు. రెండింటి జనరల్ బోగీల్లో వందలాది మంది ఉంటారని రైల్వే వర్గాలు అధికారికంగానే వెల్లడించాయి) ప్రమాద ప్రాంత విస్తీర్ణం దాదాపు ఒక కిలోమీటర్ -
Train Accident: లూప్లైన్లోకి మళ్లించినందుకే?
సాక్షి, విశాఖపట్నం: ఊహించని ఉత్పాతం.. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రమాదానికి గురై, వందల సంఖ్యలో ప్రయాణికులు మృత్యువాత పడగా, మరికొన్ని వందల మంది క్షతగాత్రులయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు దాని తీవ్రతను అంచనా వేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల 55 నిమిషాల 28 సెకన్లకు గంటకు 128 కిలోమీటర్ల వేగంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణిస్తోంది. అదే సమయంలో ప్రమాదం సంభవించడంతో 6 గంటల 55 నిమిషాల 51 సెకన్లకు వేగం సున్నాకు పడిపోయింది. సాధారణంగా గంటకు దాదాపు 130 కి.మీ. వేగంతో వెళ్లే రైలు వేగం సున్నాకు చేరుకునేందుకు అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే 60 నుంచి 80 సెకన్లకు పైగా సమయం పడుతుంది. కానీ, ప్రమాదం జరిగి 23 సెకన్లలోనే జీరో స్పీడ్‌కు చేరుకుందంటే పట్టాలపై ఉన్న గూడ్సు రైలును ఎంత బలంగా ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చని, దీన్నిబట్టి ప్రమాద తీవ్రతను ఊహించడానికే భయం కలుగుతోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అధికారులు ఏం చెబుతున్నారంటే... రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై స్పందించారు. సాయంత్రం 6.55 గంటల సమయంలో బహనాగ రైల్వేస్టేషన్ వద్ద స్టాప్ లేకపోవడంతో వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పాయి. పక్కన ఉన్న ట్రాక్‌పైకి కోరమండల్ కోచ్‌లు పడిపోయాయి. అదే సమయంలో ఆ ట్రాక్‌పై వస్తున్న యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్ పడిపోయిన కోచ్‌లని ఢీకొట్టడంతో ఆ ట్రైన్‌కు సంబంధించిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయని వివరించారు. అసలు జరిగిందేమిటి? అధికారులు చెబుతున్న దానికి, ప్రమాదం సంభవించిన పరిస్థితుల్ని గమనిస్తే.. ఒకదానికొకటి పొంతన లేకుండా ఉన్నాయి. వేగంగా వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని అధికారులు చెబుతున్నారు. కానీ, ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు చూస్తే అక్కడ గూడ్స్ రైలు కూడా ఉందని స్పష్టమవుతోంది. స్టేషన్ వద్ద.. మధ్యలో ఉన్న లూప్లైన్లో గూడ్స్ రైలు ఆగి ఉంది. స్టేషన్లో స్టాప్ లేనప్పుడు రైలుకు మెయిన్ లైన్లో ట్రాక్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కోరమాండల్‌కు లూప్లైన్లో సిగ్నల్ ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెయిన్ లైన్లో నుంచి వెళ్లకుండా లూప్లైన్లోకి రావడం వల్ల అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలుని బలంగా ఢీకొట్టడమే ప్రమాదానికి ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇది ముమ్మాటికీ రైల్వే శాఖ తప్పిదమని కొందరు సిబ్బంది చెబుతున్నారు. గంటకు 128 కి.మీ. వేగంతో వస్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకో గూడ్స్ రైలు బోగీపైకి వెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అలాంటిదేమీ జరగలేదన్నట్లుగా రైల్వే అధికారులు చేస్తున్న ప్రకటనలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తునకు రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
శాతవాహన ఎక్స్ ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
- బోగీలు ఊగడంతో భయకంపితులైన ప్రయాణికులు - చైన్‌లాగి ఆపివేత..10 నిముషాల తర్వాత బయలుదేరిన రైలు డోర్నకల్(వరంగల్ జిల్లా): మెయిన్‌లైన్‌లో గూడ్సురైలు ఉండడంతో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను లూప్లైన్లో వదిలారు. అయితే లూప్‌లైన్ పట్టాలు బలహీనంగా ఉండడంతో రైలు మామూలు పట్టాలపై వెళ్లినట్లు వేగంగా వెళ్లడంతో బోగీలన్నీ ఒక్కసారిగా ఊగిపోయాయి. దాంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురై కేకలు వేస్తూ చైన్ లాగి రైలును ఆపేశారు. ఈ సంఘటన మహబూబాబాద్- డోర్నకల్ మార్గంలో గుండ్రాజుమడుగు రైల్వేస్టేషన్ వద్ద బుధవారం రాత్రి జరిగింది. రైలు ఒక్కసారిగా కుదుపులకు గురవడంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు ఏదో ప్రమాదం జరుగుతోందని రైలుదిగి పరుగులు తీశారు. రైల్వే స్టేషన్ మాస్టర్ జరిగిన పరిస్థితిని విచారణ చేశారు. లూప్లైన్లో రైలును వదిలినందువల్ల పరిమితికి మించి వేగంతో రైలు వెళ్లడంతో పట్టాలపై ఒత్తిడి పెరిగి బోగీలు అటూ ఇటూ ఊగాయని, అంతే తప్ప ప్రమాదం జరగలేదని వివరించారు. అయితే రైలు డ్రైవర్ జాగ్రత్తగా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. కొన్ని నిముషాల పాటు ఆగిన రైలు మళ్లీ బయలుదేరింది. రైలు డోర్నకల్ చేరిన తర్వాత అక్కడ కూడా ప్రయాణికులు దిగి రైలు డ్రైవర్‌పై ఫిర్యాదుచేశారు. రైలును జాగ్రత్తగా నడపేలా డ్రైవర్ కు సూచించాలని రైల్వే అధికారులను కోరారు. ఆమేరకు స్టేషన్‌మాస్టర్ రైలు డ్రైవర్‌కు సూచనలు చెప్పారు. -
ఎస్పీ హరికృష్ణను లూప్లైన్లో పెట్టారా!
పుష్కరఘాట్ (రాజ మండ్రి) : రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికృష్ణను లూప్లైన్లో పెట్టారా! పుష్కర ఘాట్ దుర్ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఆయనపై వేటు పడనుందా! అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. పుష్కరాల ప్రారంభం రోజున పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృత్యువాతపడగా, వందలమంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటనకు పోలీసుల తీరే కారణమంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలి సిందే. ఈ సంఘటన అనంతరం పుష్కర విధులకు సంబంధించి అర్బన్ ఎస్పీని లూప్లైన్లోకి నెట్టేశారు. పుష్కర విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి ఆహారం, ఇతర సౌకర్యాల కల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయనపై త్వరలో వేటు పడే అవకాశముందని మంత్రు లు, అధికారులు చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి అధికారులు, మంత్రులపై కూడా వేటు పడే అవకాశాలున్నాయని, అంతకుముందే అర్బన్ ఎస్పీని లూప్లైన్కు పంపారని జిల్లా అధికారులు చర్చించుకుంటున్నారు. అయితే పుష్కర ఏర్పాట్లు, భక్తులను నియంత్రించడంవంటి వ్యవహారాల్లో అర్బన్ పోలీసులను దూరంగా ఉంచారని, సంఘటన జరిగిన తర్వాత అర్బన్ పోలీసులను బలి చేయడం ఎంతవరకూ సమంజసమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. కర్నాటక పోలీసు అధికారులకు ప్రాధాన్యం పుష్కరాల నిర్వహణకు సంబంధించి భక్తులను అదుపు చేసే బాధ్యతలను కర్నాటక పోలీసు అధికారులకు పూర్తిస్థాయిలో అప్పగించారు. దఫదఫాలుగా రాజమండ్రి చేరుకున్న కర్నాటక స్టేట్ పోలీస్, కర్నాటక స్టేట్ రిజర్వ పోలీసులకు అన్ని ఘాట్లలో అధిక ప్రాధాన్యమిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణను కూడా వారికే అప్పగించారు. పుష్కరాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు చేపట్టడంలో జిల్లా పోలీసు యంత్రాంగం విఫలమైనట్టు ఇప్పటికే సీఎం చెప్పడం కొసమెరుపు. దీంతో ఆ బాధ్యతను కర్నాటక పోలీసులకు అప్పగించి ఉండవచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు.