ఎస్పీ హరికృష్ణను లూప్‌లైన్‌లో పెట్టారా!
పుష్కరఘాట్ (రాజ మండ్రి) : రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికృష్ణను లూప్‌లైన్‌లో పెట్టారా! పుష్కర ఘాట్ దుర్ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఆయనపై వేటు పడనుందా! అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. పుష్కరాల ప్రారంభం రోజున పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృత్యువాతపడగా, వందలమంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటనకు పోలీసుల తీరే కారణమంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలి సిందే.
ఈ సంఘటన అనంతరం పుష్కర విధులకు సంబంధించి అర్బన్ ఎస్పీని లూప్‌లైన్‌లోకి నెట్టేశారు. పుష్కర విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి ఆహారం, ఇతర సౌకర్యాల కల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయనపై త్వరలో వేటు పడే అవకాశముందని మంత్రు లు, అధికారులు చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి అధికారులు, మంత్రులపై కూడా వేటు పడే అవకాశాలున్నాయని, అంతకుముందే అర్బన్ ఎస్పీని లూప్‌లైన్‌కు పంపారని జిల్లా అధికారులు చర్చించుకుంటున్నారు. అయితే పుష్కర ఏర్పాట్లు, భక్తులను నియంత్రించడంవంటి వ్యవహారాల్లో అర్బన్ పోలీసులను దూరంగా ఉంచారని, సంఘటన జరిగిన తర్వాత అర్బన్ పోలీసులను బలి చేయడం ఎంతవరకూ సమంజసమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
కర్నాటక పోలీసు అధికారులకు ప్రాధాన్యం
పుష్కరాల నిర్వహణకు సంబంధించి భక్తులను అదుపు చేసే బాధ్యతలను కర్నాటక పోలీసు అధికారులకు పూర్తిస్థాయిలో అప్పగించారు. దఫదఫాలుగా రాజమండ్రి చేరుకున్న కర్నాటక స్టేట్ పోలీస్, కర్నాటక స్టేట్ రిజర్‌వ పోలీసులకు అన్ని ఘాట్లలో అధిక ప్రాధాన్యమిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణను కూడా వారికే అప్పగించారు. పుష్కరాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు చేపట్టడంలో జిల్లా పోలీసు యంత్రాంగం విఫలమైనట్టు ఇప్పటికే సీఎం చెప్పడం కొసమెరుపు. దీంతో ఆ బాధ్యతను కర్నాటక పోలీసులకు అప్పగించి ఉండవచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు.