నవమాసాల కష్టం!
బాలీవుడ్ నాయికలు తీగలా, సన్నగా ఉంటారు. ఎంత సన్నగా ఉంటే అంత ఫాలోయింగ్ తెచ్చుకోగలుగుతారు. ఒకప్పుడు బొద్దుగానే ముద్దనిపించిన పరిణీతి ఇప్పుడేం చేశారంటే...
‘‘నాలుగేళ్ల క్రితం బొద్దుగా, పిల్ల తరహాలో ఉన్న ఒక అమ్మాయి ఈ ప్రపంచం (సినిమా రంగం)లోకి పరిచయం అయ్యింది. ఆ అమ్మాయి ఎలా ఉండాలనుకుందో, నాలుగేళ్ల తర్వాత దానికి దగ్గరగా మారిపోగలిగింది’’ అని పరిణీతి చోప్రా తన గురించి తాను పేర్కొన్నారు. ‘ఇషక్‌జాదె’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమై, మొదటి సినిమాతోనే బోల్డంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకోగలిగారు పరిణీతి చోప్రా. బాలీవుడ్ కథానాయికలు తీగలా, సన్నగా ఉంటారు. ఎంత సన్నగా ఉంటే అంత ఫాలోయింగ్ తెచ్చుకోగలుగుతారు. కానీ, పరిణీతి చోప్రా బొద్దుగా ఉండటంతో మొదటి సినిమా వరకే ముద్దు అనిపించారు. ఆ తర్వాత ‘సన్నబడితే బాగుంటుంది’ అనే కామెంట్స్ వినాల్సి వచ్చింది. కొంతమంది ప్రత్యక్షంగా... మరికొంతమంది పరోక్షంగా పరిణీతిని విమర్శించారు.
ఆ మాటలు ఈ బ్యూటీ మీద పని చేశాయో లేక కథానాయికగా రాణించాలంటే తగ్గక తప్పదనుకున్నారో ఏమో.. పరిణీతి తగ్గే పని మీద పడ్డారు. ఏకంగా తొమ్మిది నెలలు కష్టపడి, ఎక్సర్‌సైజ్‌లతో యమా తగ్గారు. ఒళ్ళు తగ్గిన తర్వాత ప్రత్యేకంగా ఓ ఫొటోషూట్ చేయించు కున్నారు. ఆ ఫొటోలను ట్విట్టర్లో పెట్టారు. దాంతో పాటు తన అభిప్రాయాలనూ పంచుకున్నారు. ‘‘ఈ ఫొటోషూట్ నాకు ప్రత్యేకం. ఆత్మన్యూనతాభావం నుంచి బయటపడిపోయా.
ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న అమ్మాయిగా నన్ను నేను గర్వంగా ఆవిష్క రించుకుంటున్నా. ఎవరైనా అసాధ్యం అనుకుంటే అప్పుడు నన్ను సవాల్‌గా తీసుకోండి. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు మీ లాంటి వ్యక్తినే. ఇప్పుడు అనుకున్నది సాధించా. మీరు కూడా సాధిస్తారు’’ అని పేర్కొన్నారు పరిణీతి చోప్రా. అంతే కాదు... తాను దిగిన ఒక్కో ఫొటో గురించి ఒక్కో కామెంట్ కూడా పెట్టారు. పరిణీతి తాజా ఫొటోలు కనువిందైతే, ఆ వ్యాఖ్యలు ఆమె ఆత్మ విశ్వాసాన్ని తెలియజేశాయి.