ప్రేయసి కౌగిలితో.. తగ్గే తలనొప్పి
బాగా తలనొప్పిగా ఉందా.. తల పగిలిపోతోందా.. వెంటనే పారాసిటమాల్ టాబ్లెట్ ఒకటి వేసుకుంటే తగ్గిపోతుందని ఇన్నాళ్లూ మనకు తెలుసు. కానీ అసలు టాబ్లెట్లతో పని లేకుండానే తలనొప్పి తగ్గే మంచి మార్గం ఒకటి ఉంది తెలుసా.. అదే మంచి కౌగిలి. మనను బాగా ప్రేమించేవాళ్లు ఆప్యాయంగా ఒక్కసారి కౌగలించుకుంటే.. తలనొప్పి, చికాకు అన్నీ ఎక్కడికక్కడే మాయమైపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యక్తుల మధ్య ఉండే బంధాలు, అనుబంధాలు మన నొప్పులను తగ్గించడానికి చాలా ఉపయోగపడతాయని, దీన్నే 'లవ్ ఇన్డ్యూస్డ్ అనల్జేసియా' అంటారని చెబుతున్నారు.
అయితే.. ఎవరుపడితే వాళ్లు పట్టుకుంటే మాత్రం ఇలాంటి నొప్పులు తగ్గవట. ఎందుకంటే, వాళ్ల పట్ల మనకు ఎలాంటి ఫీలింగులు ఉండవని చెప్పారు. నొప్పులను మర్చిపోయేలా మెదడుకు సిగ్నల్ పంపాలంటే అవతలివాళ్లు మనల్ని బాగా ప్రేమించేవాళ్లు అయి ఉండాలని తెలిపారు. బ్రిటన్ వాసులు ఇలాంటి తలనొప్పులు వచ్చినప్పుడు మెడికల్ షాపు వద్దకు వెళ్లి నేరుగా కొనుగోలు చేసే మందుల విలువ దాదాపు ఏడాదికి 4071 కోట్ల రూపాయలు ఉంటుందట. అయితే ఇలా మందులు వాడటం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని, ప్రత్యామ్నాయం ఏంటన్న ఆలోచనలు బాగా పెరిగాయి. అందులో భాగంగానే శాస్త్రవేత్తలు ఈ 'కౌగిలి' మందును కనిపెట్టారు. ఇందుకోసం ఇజ్రాయెల్‌లోని హైఫా యూనివర్సిటీ పరిశోధకులు కొందరు వాలంటీర్లను తీసుకుని వాళ్లతో ప్రయోగాలు చేశారు. కొద్దిగా నొప్పి ఉన్నప్పుడు వేర్వేరు వ్యక్తులను ముట్టుకోవడం, తర్వాత వాళ్లు ప్రేమించేవాళ్లతో కౌగిలి ఇప్పించడం లాంటివి చేశారు. అప్పుడే వాళ్లకు నొప్పి నుంచి మంచి ఉపశమనం లభించినట్లు తేలింది. 2011లో అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో కూడా ఇలాంటి పరిశోధన ఒకటి జరిగింది. ప్రేమికుడు లేదా ప్రేయసి ఫొటోవైపు తదేకంగా చూసినా కూడా నొప్పి 44 శాతం తగ్గుతుందని అప్పట్లో చెప్పారు.