రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ ఫీజును తగ్గించాలి
గుంటూరు (నెహ్రూనగర్) : రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా చర్యలు తీసుకుంటోందని, ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ‘అప్రెడా’ గుంటూరు చాప్టర్ అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావు డిమాండ్ చేశారు. నగరంలో ఆదివారం జరిగిన విలే కర్ల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 6.5 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ ఫీజును టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 7.5 శాతానికి పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కీలకంగా ఉన్న నిర్మాణ రంగానికి రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లిస్తూనే మరో పక్క వ్యాట్, జీఎస్టీ, లేబర్ ట్యాక్స్‌లు చెల్లిస్తున్నా అదనంగా 35 శాతం ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించడం సామాన్యుడిపై భారం మోపడమేనన్నారు. ఇలాంటి నిర్ణయాల వలన పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలకు నిర్మాణ రంగం అనుకూలంగా మారుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పరిశీలించి నిర్మాణ రంగాన్ని ఆదుకొవాలని కోరారు. ఈ సమావేశంలో అప్రెడా సభ్యులు సిద్ధవరపు మధుసూదనరెడ్డి, మామిడి సీతారామయ్య, మద్దిరాల సాంబశివరావు, చుక్కపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.