కర్నూలు జిల్లాలో వడగళ్ల వాన
విజయవాడ: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందువల్ల నెల్లూరు జిల్లాలో పలుచోట్ల చిరుజల్లులు పడ్డాయి. కర్నూలు జిల్లాలో వడగళ్ల వాన పడింది. కర్నూలు జిల్లా ఆస్పరి, గోనెగండ్ల మండలాలలో ఆదివారం సాయంత్రం భారీగా వడగళ్ల వాన పడింది. బైలుప్పల, వి.అగ్రహారం, గంజిపల్లి గ్రామాల్లో రేగిపండు సైజులో వడగండ్లు పడ్డాయి. దీంతో పొలాల్లో కూలీ పనులు చేసుకుంటున్న మహిళలకు దెబ్బలు తగిలాయి. మహిళలు పనులు వదిలేసి సమీప గుడిసెల్లోకి పరుగులు తీశారు.
అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో పలు జిల్లాలలో పంటలు దెబ్బతిన్నాయి. కర్నూలు జిల్లా మహానంది మండలం తిమ్మాపురం, అబ్దీపురం, శ్రీనగరం, గాజులపల్లె, మహానంది, కృష్ణనంది గ్రామ పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి భారీ గాలులతో కూడిన వర్షాల పడ్దాయి. పంటలకు భారీ నష్టం వాటిల్లింది. సుమారు వెయ్యి ఎకరాల్లో అరటి చెట్లు నేలమట్టం అయ్యాయి.