లక్కీభాస్కర్ రమేశ్ వెనుక గాడ్‌ఫాదర్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఇటీవల విడుదలైన లక్కీభాస్కర్ సినిమాలో మాదిరిగా క్రిప్టో కరెన్సీ పేరుతో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసి దుబాయ్ పారిపోదామనుకున్న రమేశ్‌గౌడ్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. జీబీఆర్ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరుతో వసూలు చేసిన డబ్బులతో ఆయన సీఐడీ దర్యాప్తు అధికారులను ప్రభావితం చేస్తున్నారా..? అతడిని రక్షించేందుకు తెరవెనుక గాడ్‌ఫాదర్ ఎవరైనా ఉన్నారా..? అతని ఇంటి మీద జరిగే దాడుల సమాచారం ముందే లీకైందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. అతడి అరెస్టు సమయంలో సెల్ఫోన్లను స్వాధీనం చేసుకోకపోవడం.. కేసు నెమ్మదిగా సాగుతుండటంపై బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వారు కేవలం ఆరోపణలకే పరిమితం కాలేదు. దర్యాప్తు అధికారులను రమేశ్ తన వశం చేసుకున్నాడని పలు వీడియోలు, ఫొటోలు, ఆడియోరికార్డింగులు సంపాదించి డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఇక్కడ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న డీఎస్పీని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయడం బాధితుల ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది.నిందితుడితో సీఐడీ అధికారుల సమావేశాలు?జీబీఆర్ క్రిప్టో కరెన్సీ పేరిట అమాయకుల నుంచి కోట్లు వసూలు చేసిన జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నెల్లుట్ల గ్రామానికి చెందిన రమేశ్‌గౌడ్ వ్యవహారం కొత్త చర్చకు దారి తీస్తోంది. సీఐడీ అధికారులతో తాను ముందే మాట్లాడుకున్నానని, వారు తనను ఏం చేయలేరని బాధితులతో గొప్పలు చెప్పుకున్నాడు. ఈ వ్యవహారంలో సీఐడీ విచారణ నెమ్మదించడం.. అక్టోబర్‌లో ఎఫ్ఐఆర్ నమోదైనా అతనిపై చర్యలు తీసుకోకపోవడంతో వారి అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో వారు రమేశ్‌గౌడ్ ప్రతి కదిలికను వీడియో రికార్డు చేశారు. సీఐడీ పోలీసులు, నిందితుడు రమేశ్‌గౌడ్‌తో డబ్బుల వ్యవహారంపై చర్చించిన మాటలు రికార్డు చేశారు. ఈ క్రమంలోనే రమేశ్‌గౌడ్ సీఐడీ అధికారులతో హైదరాబాద్, వరంగల్‌లో పలుమార్లు రహస్యంగా సమావేశమైనట్లు తెలుసుకున్నారు. కరీంనగర్ శివారులోని రేకుర్తిలో కరీంనగర్ సీఐడీ అఫీసుకు చెందిన ఓ ఉన్నతాధికారి వాహనంలో రమేశ్‌గౌడ్, అతని బావ అయిన ఓ కానిస్టేబుల్, రమేశ్‌గౌడ్ రియల్ ఎస్టేట్ పార్టనర్లు కలిసి సమావేశమయ్యారు. ఈ వ్యవహారాన్ని మొత్తం రహస్యంగా వీడియో చిత్రీకరించిన బాధితులు సదరు అడియో, వీడియో క్లిప్పింగ్‌లను డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగానికి అందించారు. రమేశ్‌గౌడ్, అతని మనుషులు సీఐడీ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని, అతడితో పలుమార్లు సీఐడీ అధికారులు సమావేశమవ్వడమే అందుకు నిదర్శనం అంటూ సదరు వీడియోలను చూపించారు. ఈ నేపథ్యంలోనే గతనెల 29న కరీంనగర్ సీఐడీ డీఎస్పీని అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.వారి సంగతేమిటి..?సీఐడీ ఎఫ్ఐఆర్లో నిందితుడు రమేశ్‌తోపాటు అతని భార్య ఉమారాణి, డ్రైవర్ సురేష్ పేర్లు కూడా నిందితుల జాబితాలో ఉన్నాయి. రమేశ్‌గౌడ్ బాధితుల నుంచి సేకరించిన డబ్బును వీరి ఖాతాల్లోకి మళ్లించినట్లు సీఐడీ విభాగం గుర్తించినా ఇంతవరకు అదుపులోకి తీసుకోకపోవడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అలాగే నిందితుడు రమేశ్‌గౌడ్ అరెస్టయిన రోజు అతని మూడు యాపిల్ సెల్ఫోన్లను తన డ్రైవర్‌కు అప్పగించి పంపించడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి ఆర్థిక లావాదేవీలన్ని ఆ మూడు సెల్ఫోన్లలోనే ఉన్నాయని తెలిసినప్పటికీ వాటిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీస్తున్నారు. సీఐడీ అధికారులు రమేశ్గౌడ్పై దాడులు చేసేందుకు వెళ్లే సమాచారం ముందే లీకై ందని ఆరోపిస్తున్నారు. మొత్తం సీఐడీ దర్యాప్తు సాగుతున్న తీరు చూస్తుంటే తమకు న్యాయం దక్కదేమోనని బాధితులు వాపోతున్నారు. ఈ కేసులో మన రాష్ట్రం నుంచి హవాలా మార్గంలో రూ.కోట్ల డబ్బు దుబాయికి చేరిందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో మనీల్యాండరింగ్ జరిగిందని, నిర్ధారణ అయ్యిందని ఈ నేపథ్యంలో కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐకి అప్పగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.