Luxury bike
-
ఈ బైక్ కేవలం 350 మందికి మాత్రమే.. ధర ఎంతంటే?
గ్లోబల్ మార్కెట్లో కేవలం సాధారణ బైకులకు మాత్రమే కాకుండా.. లగ్జరీ బైకులకు కూడా డిమాండ్ భారీగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'ఇండియన్ మోటార్‌సైకిల్' త్వరలోనే '2024 రోడ్‌మాస్టర్ ఎలైట్' లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఇండియన్ మోటార్‌సైకిల్ లాంచ్ చేయనున్న కొత్త 2024 రోడ్‌మాస్టర్ ఎలైట్ కేవలం 350 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ కలిగిం ఈ బైక్ గ్లోస్ బ్లాక్ డాష్, బ్లాక్-అవుట్ విండ్‌స్క్రీన్, హ్యాండ్-పెయింటెడ్ గోల్డెన్ పిన్స్ట్రైప్స్, కలర్ మ్యాచింగ్ సీట్లు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఆపిల్ కార్ప్లేతో కూడిన ఈ బైక్ 7 ఇంచెస్ TFT కలిగి టర్న్-బై-టర్న్ నావిగేషన్ సిస్టమ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 12 స్పీకర్ ఆడియో-సిస్టమ్ సెటప్, 136 లీటర్లు స్టోరేజ్ స్పేస్ వంటివి లభిస్తాయి. కొత్త 2024 రోడ్‌మాస్టర్ ఎలైట్ బైక్ 1890 సీసీ వీ ట్విన్ ఇంజిన్ కలిగి 170 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సుమారు 412 కేజీల బరువు కలిగిన ఈ బైక్ పనితీరు పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ బైక్ ధర 41999 డాలర్ల వరకు ఉండవచ్చని సమాచారం. (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 34.85 లక్షలు). అయితే ఈ బైక్ భారతదేశంలో లాంచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఒకప్పుడు రెస్టారెంట్లో సర్వర్.. ఇప్పుడు వేలకోట్లకు అధిపతి - ఎవరీ హువాంగ్! -
బైక్ కొనుగోలుదారులకు షాక్.. డుకాటీ ధరలు పెరగనున్నాయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఓ వైపు కొత్త సంవత్సరం వస్తుండగా, మరో వైపు ఆటో మొబైల్ రంగ సంస్థలు క్రమంగా తమ వాహనాల ధరలను పెంచుతూ పోతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఇటాలియన్ సూపర్ బైక్స్ తయారీ సంస్థ డుకాటీ కూడా చేరింది. తమ అన్ని మోడళ్ల బైక్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ఎంత శాతం సవరిస్తుందన్న విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. “ముడిసరుకు, ఉత్పత్తి, రవాణాలకు సంబంధించిన ఖర్చులు గణనీయంగా పెరిగాయి. కొంతకాలంగా కంపెనీ ఈ భారాన్ని భరిస్తూ వస్తోంది. అయితే వీటిని అధిగమించేందుకు, ప్రస్తుతం ధరలను సవరించాలని నిర్ణయించుకున్నట్లు” అని డుకాటీ తెలిపింది. అలాగే గ్లోబల్ మార్కెట్లోకి విడుదలయ్యే అన్ని బైక్‌లను భారత్‌కు తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
40 లక్షలు పెట్టి బైక్ కొన్న నటుడు
బహుభాషా నటుడు రంగనాథన్ మాధవన్ గ్యారేజ్‌లోని మరో వాహనం చేరింది. దీపావళి సందర్భంగా అతడు ఒక సరికొత్త లగ్జరీ క్రూజర్(బైక్) కొన్నాడు. అమెరికా కంపెనీ తయారు చేసిన ‘ఇండియన్ రోడ్‌మాస్టర్’ ను సొంతం చేసుకున్నాడు. తన గ్యారేజ్‌లోకి కొత్తగా చేరిన ఈ భారీ బైక్‌పై మాధవన్ చక్కర్లు కొట్టాడు. దీన్ని దక్కించుకోవడం తనకెంతో గర్వంగా ఉందని అతడు పేర్కొన్నాడు. తనెంతో ఇష్టపడి కొనుకున్న క్రూజర్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అత్యాధునిక ఫీచర్లతో దర్పం ఉట్టిపడే దీని ధర దాదాపు రూ. 40.45 లక్షలు(ఎక్స్ షోరూమ్). బూడిద, నల్లుపు రంగులో మెరిసిపోతున్న ఈ టూవీలర్ చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది. 1811 సీసీ థండర్‌స్ట్రోక్ 111, వి-ట్విన్ ఇంజిన్, 6-స్పీడ్ గేర్ బ్యాక్స్, 64.4 లీటర్ల సామర్థ్యం కలిగిన పెట్రోట్ ట్యాంక్‌తో పాటు 7 ఇంచుల టచ్‌స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టం కూడా ఉంది. దీంట్లో మ్యూజిక్ వింటూ నావిగేషన్ చూసుకుంటూ జోరుగా సాగిపోవచ్చు. యూఎస్బీ, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్ఈడీ లైట్లు, క్రూజ్ కంట్రోల్, రిమోట్ లాకింగ్ వంటి సదుపాయాలు కూడా ‘ఇండియన్ రోడ్‌మాస్టర్’లో ఉన్నాయి. -
లగ్జరీ బైక్..రయ్
- కలెక్షన్ పెంచుకుంటున్న కస్టమర్లు - 2015లో 10,000 యూనిట్ల అమ్మకాలు - కొత్త మోడళ్లతో ఆకట్టుకుంటున్న కంపెనీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ బైక్.. అత్యంత ఖరీదైన ఈ బైక్‌లు రోడ్లపై హుందాగా దూసుకెళ్తుంటే... కుర్రకారు మనసు కకావికలం కావాల్సిందే. తమకూ అలాంటి బైక్ ఉండాలని కోరుకునే ఔత్సాహికులకు కొదవుండదు. ఒక కంపెనీకి చెందిన బైక్‌లను వాడుతున్న కస్టమర్లు ఒక బృందంగా ఏర్పడి వారాంతాల్లో సుదూర ప్రాంతాలకు గుంపుగా వెళ్లే దృశ్యాలు రోడ్లపై ఇపుడు సాధారణమైపోయాయి. ఈ ట్రెండ్ విస్తరిస్తూ... ఒక్కో నగరం పేరున క్లబ్‌లు పుట్టుకొస్తున్నాయి. క్లబ్ సభ్యుల అడ్వెంచర్ టూర్లు, మనసు చెదిరే మోడళ్లు, కుర్రకారు ఆసక్తి... ఏదైతేనేం! ఇప్పుడు దేశంలో 500 సీసీ ఆపై సామర్థ్యం గల లగ్జరీ బైక్‌ల హవా నడుస్తోంది. ఇక్కడి వే గాన్ని అందుకోవడానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రాండ్లు ఒకదాని వెంట ఒకటి ప్రవేశిస్తున్నాయి. మోడళ్లతో వేగం పెంచిన కంపెనీలు... స్థిరమైన వృద్ధిని సాధిస్తున్న హార్లే డేవిడ్సన్.. ఇప్పటికే హరియాణాలో బైక్‌ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేసింది. మూడు మోడళ్ల అప్‌గ్రేడెడ్ వెర్షన్లను ఆగస్టులో విడుదల చేసింది. కవాసాకి నింజా హెచ్2ను రూ.29 లక్షల ధరతో ఏప్రిల్‌లో విడుదల చేసింది. మార్చికల్లా మరో రెండు మోడళ్లు తెస్తోంది. ట్రయంఫ్ ఈ ఏడాది టైగర్ ఎక్స్‌సీఎక్స్, ఎక్స్ఆర్ఎక్స్, రాకెట్ ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్, టైగర్ 800 ఎక్స్ఆర్ను విడుదల చేసింది. సెప్టెంబర్ తొలి వారంలో టైగర్ 800 ఎక్స్‌సీఏ బైక్‌ను తెచ్చింది. దీంతో కంపెనీ భార త్లో విక్రయిస్తున్న మోడళ్ల సంఖ్య 15కు చేరుకుంది. యూకే బ్రాండ్ అయిన ట్రయంఫ్ మొత్తం 28 మోడళ్లను తయారు చేస్తోంది. 2013 నవంబరులో భారత్‌కు ప్రవేశించిన ట్రయంఫ్ తొలి 20 నెలల్లో 2,000 పైచిలుకు బైక్‌లను విక్రయించింది. ‘ఇండియన్’ బ్రాండ్‌లో ఆరు బైక్‌లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. యూఎస్‌లో విడుదలైన మోడల్‌ను వెంటనే భారత్‌లోనూ పరిచయం చేస్తోంది. 2018 నాటికి అసెంబ్లింగ్ ప్లాంట్ పెట్టాలని నిర్ణయించిన కంపెనీ... దానివల్ల ధర 30 శాతం వరకూ తగ్గుతుందని చెబుతోంది. షోరూంల సంఖ్యను ప్రస్తుతమున్న 4 నుంచి వచ్చే ఏడాదికల్లా 12కు చేర్చనుంది. 2015లో భారత్‌లో ప్రవేశించిన అమెరికా కంపెనీ రీగల్ రాప్టర్... హైదరాబాద్ సమీపంలో ప్లాంటు పెట్టే ఆలోచనలో ఉంది. మరో బైక్ ఉండాల్సిందే.. కస్టమర్లు సాధారణంగా వాడుతున్న వాహనాన్ని కొన్నేళ్ల తర్వాత విక్రయించడం సహజం. లగ్జరీ బైక్‌ల విషయంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారని చెప్పారు ఇండియన్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న పొలారిస్ ఇండియా ఎండీ పంకజ్ దూబే. ‘1912 నాటి ఇండియన్ మోడల్‌ను వినియోగిస్తున్న కస్టమరూ ఉన్నారు. ఏళ్ల తరబడి విక్రయించకుండా అట్టిపెట్టుకునేవారు కొందరైతే... నచ్చిన మోడళ్లను కొనుక్కొని కలెక్షన్ ఏర్పర్చుకునేవారు కొందరు’ అని చెప్పారాయన. క్లబ్ సభ్యుల టూరింగ్ కల్చర్ పరిశ్రమకు బూస్ట్నిస్తోందని చెప్పారు. ట్రయంఫ్ అయితే రైడర్లకే డీలర్షిప్ అప్పగిస్తోంది. రైడర్లు అయితేనే వాహనాలను అర్థం చేసుకుంటారనేది ట్రయంఫ్ ఇండియా ఎండీ విమల్ సంబ్లీ మాట. ఒక్కో మోడల్ కోసం నెలల తరబడి ఎదురు చూసే కస్టమర్లు కూడా ఉన్నారని చెప్పారాయన. ఒక కస్టమర్ అయితే ఇల్లుకు బదులు బైక్ కొన్నారని తెలిపారు. ఏటా 50 శాతం వృద్ధి.. భారత్‌లో 500 సీసీ ఆపైన సామర్థ్యమున్న లగ్జరీ బైక్‌ల మార్కెట్ ఏడెనిమిదేళ్లుగా అనూహ్యంగా వృద్ధి చెందుతోంది. 2007లో కేవలం 100 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయంటే ఆశ్చర్యం వేయక మానదు. 2014లో 500-800 సీసీ విభాగంలో 5,000 యూనిట్లు, 800 సీసీ ఆపై సామర్థ్యమున్న బైక్‌లు 3,000 యూనిట్లు అమ్ముడయ్యాయని ఇండియా కవాసాకి మోటార్స్ డిప్యూటీ ఎండీ షిగెటో నశికవా వెల్లడించారు. 2020 నాటికి పరిశ్రమ రెండింతలవుతుందని అన్నారు. 2015లో లగ్జరీ బైక్‌ల విపణి 10,000 యూనిట్లను దాటుతుందని పంకజ్ దూబే పేర్కొన్నారు. లగ్జరీ బైక్‌ల విభాగంలోనూ కస్టమర్లు అధిక సామర్థ్యం ఉన్న మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారని వివరించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో దాదాపు అన్ని బ్రాండ్ల బైక్‌ల షోరూంలు వెలిశాయి. చిన్న నగరాల నుంచీ కస్టమర్లున్నారు. -
ట్రయంఫ్ బైక్‌లు వచ్చేశాయ్..
న్యూఢిల్లీ: భారత లగ్జరీ బైక్ మార్కెట్లోకి మరో కొత్త కంపెనీ రంగప్రవేశం చేసింది. ఇంగ్లాండ్‌కు చెందిన ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ 10 బైక్‌లను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధరలు రూ. 5.7 లక్షలు-రూ.20 లక్షల రేంజ్లో(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. వచ్చే నెల చివరికల్లా హైదరాబాద్, బెంగళూరుల్లో డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత ఢిల్లీ, ముంబైల్లో డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తామని కంపెనీ డెరైక్టర్(సేల్స్ అండ్ మార్కెటింగ్-గ్లోబల్) పాల్ స్ట్రాడ్ చెప్పారు. వచ్చే నెల రెండో వారం నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తామని, జనవరిలో డెలివరీలు ఇస్తామని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా ఎండీ విమల్ సంబ్లి తెలిపారు. రుణాలు రెడీ: భారత్‌లో ప్రీమియం బైక్‌ల సెగ్మెంట్ మంచి వృద్ధి సాధిస్తోందని పాల్ స్ట్రాడ్ చెప్పారు. తమ బైక్‌ల కొనుగోళ్ల కోసం రుణాలందించడానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలి పారు. కంపెనీ విడుదల చేసిన పది మోడళ్లలో కొన్నిం టిని మానేసర్ ప్లాంట్‌లో అసెంబుల్ చేస్తామని, మిగిలిన వాటిని పూర్తిగా తయారైన బైక్‌ల రూపంలో దిగుమతి చేసుకుంటామని చెప్పారు. వీటిలో బొనెవిల్లె (రూ.5.7 లక్షలు,) తక్కువ ధర బైక్ కాగా. ఎక్కువ ధర ఉన్నది రాకెట్ త్రి రోడ్‌స్టర్ బైక్ (రూ.20 లక్షలు). మానేసర్ ప్లాంట్‌లో బొనెవిల్లె టీ100, డైటోన 675ఆర్, స్ట్రీట్ ట్రిపుల్, స్పీడ్ ట్రిపుల్, థ్రక్స్టన్ బైక్‌లను అసెంబుల్ చేస్తామని చెప్పారు. మిగిలిన బైక్‌లు-రాకెట్ త్రి రోడ్‌స్టర్, టైగర్ ఎక్స్‌ప్లోరర్, టైగర్ 800 ఎక్స్‌సీ, థండర్బర్డ్ స్టార్మ్‌లను దిగుమతి చేసుకుంటామని వివరించారు. మొదటి ఆర్నెల్లలో 400-500 బైక్‌లు విక్రయించడం లక్ష్యంగా పెట్టుకున్నామని పాల్ పేర్కొన్నారు. భారత్‌లో ఏడాదికి 2,500 వరకూ ప్రీమియం బైక్‌లు అమ్ముడవుతాయని అంచనా.