లగ్జరీ బైక్..రయ్ | Increase of sales of Luxury bikes | Sakshi
Sakshi News home page

లగ్జరీ బైక్..రయ్

Published Thu, Sep 24 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

లగ్జరీ బైక్..రయ్

లగ్జరీ బైక్..రయ్

- కలెక్షన్ పెంచుకుంటున్న కస్టమర్లు
- 2015లో 10,000 యూనిట్ల అమ్మకాలు
- కొత్త మోడళ్లతో ఆకట్టుకుంటున్న కంపెనీలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
లగ్జరీ బైక్.. అత్యంత ఖరీదైన ఈ బైక్‌లు రోడ్లపై హుందాగా దూసుకెళ్తుంటే... కుర్రకారు మనసు కకావికలం కావాల్సిందే. తమకూ అలాంటి బైక్ ఉండాలని కోరుకునే ఔత్సాహికులకు కొదవుండదు. ఒక కంపెనీకి చెందిన బైక్‌లను వాడుతున్న కస్టమర్లు ఒక బృందంగా ఏర్పడి వారాంతాల్లో సుదూర ప్రాంతాలకు గుంపుగా వెళ్లే దృశ్యాలు రోడ్లపై ఇపుడు సాధారణమైపోయాయి. ఈ ట్రెండ్ విస్తరిస్తూ... ఒక్కో నగరం పేరున క్లబ్‌లు పుట్టుకొస్తున్నాయి. క్లబ్ సభ్యుల అడ్వెంచర్ టూర్లు, మనసు చెదిరే మోడళ్లు, కుర్రకారు ఆసక్తి... ఏదైతేనేం! ఇప్పుడు దేశంలో 500 సీసీ ఆపై సామర్థ్యం గల లగ్జరీ బైక్‌ల హవా నడుస్తోంది. ఇక్కడి వే గాన్ని అందుకోవడానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రాండ్లు ఒకదాని వెంట ఒకటి ప్రవేశిస్తున్నాయి.
 
మోడళ్లతో వేగం పెంచిన కంపెనీలు...
స్థిరమైన వృద్ధిని సాధిస్తున్న హార్లే డేవిడ్సన్.. ఇప్పటికే హరియాణాలో బైక్‌ల తయారీ ప్లాంటును ఏర్పాటు చేసింది. మూడు మోడళ్ల అప్‌గ్రేడెడ్ వెర్షన్లను ఆగస్టులో విడుదల చేసింది. కవాసాకి నింజా హెచ్2ను రూ.29 లక్షల ధరతో ఏప్రిల్‌లో విడుదల చేసింది. మార్చికల్లా మరో రెండు మోడళ్లు తెస్తోంది. ట్రయంఫ్ ఈ ఏడాది టైగర్ ఎక్స్‌సీఎక్స్, ఎక్స్‌ఆర్‌ఎక్స్, రాకెట్ ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్, టైగర్ 800 ఎక్స్‌ఆర్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ తొలి వారంలో టైగర్ 800 ఎక్స్‌సీఏ బైక్‌ను తెచ్చింది.

దీంతో కంపెనీ భార త్‌లో విక్రయిస్తున్న మోడళ్ల సంఖ్య 15కు చేరుకుంది. యూకే బ్రాండ్ అయిన ట్రయంఫ్ మొత్తం 28 మోడళ్లను తయారు చేస్తోంది. 2013 నవంబరులో భారత్‌కు ప్రవేశించిన ట్రయంఫ్ తొలి 20 నెలల్లో 2,000 పైచిలుకు బైక్‌లను విక్రయించింది. ‘ఇండియన్’ బ్రాండ్‌లో ఆరు బైక్‌లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. యూఎస్‌లో విడుదలైన మోడల్‌ను వెంటనే భారత్‌లోనూ పరిచయం చేస్తోంది. 2018 నాటికి అసెంబ్లింగ్ ప్లాంట్ పెట్టాలని నిర్ణయించిన కంపెనీ... దానివల్ల ధర 30 శాతం వరకూ తగ్గుతుందని చెబుతోంది. షోరూంల సంఖ్యను ప్రస్తుతమున్న 4 నుంచి వచ్చే ఏడాదికల్లా 12కు చేర్చనుంది. 2015లో భారత్‌లో ప్రవేశించిన అమెరికా కంపెనీ రీగల్ రాప్టర్... హైదరాబాద్ సమీపంలో ప్లాంటు పెట్టే ఆలోచనలో ఉంది.
 
మరో బైక్ ఉండాల్సిందే..

కస్టమర్లు సాధారణంగా వాడుతున్న వాహనాన్ని కొన్నేళ్ల తర్వాత విక్రయించడం సహజం. లగ్జరీ బైక్‌ల విషయంలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారని చెప్పారు ఇండియన్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న పొలారిస్ ఇండియా ఎండీ పంకజ్ దూబే. ‘1912 నాటి ఇండియన్ మోడల్‌ను వినియోగిస్తున్న కస్టమరూ ఉన్నారు. ఏళ్ల తరబడి విక్రయించకుండా అట్టిపెట్టుకునేవారు కొందరైతే... నచ్చిన మోడళ్లను కొనుక్కొని కలెక్షన్ ఏర్పర్చుకునేవారు కొందరు’ అని చెప్పారాయన. క్లబ్ సభ్యుల టూరింగ్ కల్చర్ పరిశ్రమకు బూస్ట్‌నిస్తోందని చెప్పారు. ట్రయంఫ్ అయితే రైడర్లకే డీలర్‌షిప్ అప్పగిస్తోంది. రైడర్లు అయితేనే వాహనాలను అర్థం చేసుకుంటారనేది ట్రయంఫ్ ఇండియా ఎండీ విమల్ సంబ్లీ మాట. ఒక్కో మోడల్ కోసం నెలల తరబడి ఎదురు చూసే కస్టమర్లు కూడా ఉన్నారని చెప్పారాయన. ఒక కస్టమర్ అయితే ఇల్లుకు బదులు బైక్ కొన్నారని తెలిపారు.
 
ఏటా 50 శాతం వృద్ధి..

భారత్‌లో 500 సీసీ ఆపైన సామర్థ్యమున్న లగ్జరీ బైక్‌ల మార్కెట్ ఏడెనిమిదేళ్లుగా అనూహ్యంగా వృద్ధి చెందుతోంది. 2007లో కేవలం 100 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయంటే ఆశ్చర్యం వేయక మానదు. 2014లో 500-800 సీసీ విభాగంలో 5,000 యూనిట్లు, 800 సీసీ ఆపై సామర్థ్యమున్న బైక్‌లు 3,000 యూనిట్లు అమ్ముడయ్యాయని ఇండియా కవాసాకి మోటార్స్ డిప్యూటీ ఎండీ షిగెటో నశికవా వెల్లడించారు. 2020 నాటికి పరిశ్రమ రెండింతలవుతుందని అన్నారు. 2015లో లగ్జరీ బైక్‌ల విపణి 10,000 యూనిట్లను దాటుతుందని పంకజ్ దూబే పేర్కొన్నారు. లగ్జరీ బైక్‌ల విభాగంలోనూ కస్టమర్లు అధిక సామర్థ్యం ఉన్న మోడళ్లకు అప్‌గ్రేడ్ అవుతున్నారని వివరించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో దాదాపు అన్ని బ్రాండ్ల బైక్‌ల షోరూంలు వెలిశాయి. చిన్న నగరాల నుంచీ కస్టమర్లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement