సాక్షి, న్యూఢిల్లీ: లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన వినియోగదారులకు మరింత పారదర్శక ధరలను తీసుకురావాలనే లక్ష్యంతో ఒక ప్రత్యేకమైన డైరెక్ట్-టు-కస్టమర్ అమ్మకాల నమూనాను బుధవారం ప్రకటించింది. డీలర్ల ద్వారా కాకుండా ఆన్‌లైన్‌లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా వినియోగదారులకు నేరుగా కార్లను విక్రయిస్తుంది. డైరెక్ట్ ఇన్వెంటరీ ఖర్చును నేరుగా తనపై భరిస్తామని, దేశవ్యాప్తంగా ప్రతి మోడల్‌కు ఒక నిర్దిష్ట ధరను అందిస్తామని మెర్సిడెస్ తెలిపింది. 2021 చివరి త్రైమాసికం నుండి ఈ మోడల్‌ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. తద్వారా మార్కెట్ అభివృద్ధికి, కార్ల అమ్మకాలను సులభతరం చేస్తుందని, డీలర్ లాభదాయకతకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని మెర్సిడెస్ తెలిపింది. దీర్ఘకాలిక వ్యూహాత్మక చర్య మార్కెట్లో రిటైల్ వ్యాపారంలోతమ కస్టమర్ దృష్టిని బలోపేతం చేయడంతో ముందెన్నడూ లేని అనుభవాన్నిఅందిస్తుందని కంపెనీ ప్రకటించింది. తమ కస్టమర్లకు, ఫ్రాంచైజ్ భాగస్వాములకు విన్ విన్ సోల్యూషన్స్ అందిస్తుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు.అయితే 100 డీలర్‌షిప్‌ల ద్వారా కార్ల అమ్మకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇదొక ఆసక్తికరమైన కాన్సెప్ట్ కానీ, బేరమాడే భారతీయ కస్టమర్లకు పెద్దగా రుచించకపోవచ్చని డీలర్లు చెబుతున్నారు. కార్ల ఇన్వాయిస్ నేరుగా కంపెనీ నుండే వస్తాయి. ఆర్డర్‌ను నేరుగా ప్రాసెస్ చేస్తుంది. బెంజ్ తాజా నిర్ణయం కస్టమర్లకు చాలా ఉపశమనం కలిగించవచ్చని భావిస్తున్నారు. అయితే దీనికి వారు ఎలా స్పందిస్తారు, ఎలాంటి ఆఫర్లు లభిస్తాయనేది కీలకమనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు మెర్సిడెస్ బెంజ్ ఇండియా 2021లో 15 మోడళ్లను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో మరో కొత్త ఖరీదైన కారును ప్రవేశపెట్టబోతోంది. మేబాచ్ జిఎల్‌ఎస్ 600 అల్ట్రా లగ్జరీ ఎస్‌యూవీని వచ్చే వారంలో దేశీయ మార్కెట్ల విడుదల చేయనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రకటించింది. మెర్సిడెస్-మేబాచ్ లైనప్ నుండి వస్తున్న తొలి ఎస్‌యూవీ ఈ జీఎల్‌ఎస్ 600 కావడం విశేషం. ఆల్ట్రా లగ్జరీ కార్ బ్రాండ్, మేబాచ్ పేరుతో బెంజ్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన కార్లను అందిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment