న్యూఢిల్లీ: ఖరీదైన లగ్జరీ కార్లకు పండుగల సీజన్‌లో డిమాండ్ బలంగా ఉంటుందని మెర్సెడెజ్ బెంజ్, ఆడి, లెక్సస్ భావిస్తున్నాయి. ఈ ఏడాది పండుగల సందర్భంగా ఇంతకుముందెన్నడూ లేనంతగా విక్రయాలపై ఆశలు పెట్టుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగల సీజన్ ఎంతో ఆశావహంగా కనిపిస్తున్నట్టు మెర్సెడెజ్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు.
‘‘ఈ ఏడాది పండుగల సీజన్ నాలుగు నెలల పాటు కొనసాగనుంది. ఈ సీజన్‌ను సానుకూలంగా ప్రారంభించాం. అమ్మకాల పరంగా సానుకూలంగా ఉన్నాం’’అని చెప్పారు. ఇటీవల విడుదల చేసిన మోడళ్లు ఇందుకు మద్దతుగా నిలుస్తాయన్నారు. ఇక లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోనీ మాట్లాడుతూ.. లగ్జరీ కార్ల మార్కెట్ ఇక ముందూ వృద్ధి నమోదు చేస్తుందన్నారు. డిమాండ్ ఎంతో ఆశాజనకంగా ఉందన్నారు. అధిక ధనవంతులు పెరుగుతుండడం, మిలీనియల్స్, ఖర్చు పెట్టే ఆదాయం పెరగడం, ఆర్థిక వృద్ధి ఇవన్నీ లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధిని నడిపిస్తున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి.
గతేడాదికి మించి అమ్మకాలు
‘‘2022 అమ్మకాలను మేము ఇప్పటికే దాటేశాం. రెండో త్రైమాసికంలో మాదిరే రానున్న పండుగల్లోనూ మెరుగైన విక్రయాలు కొనసాగుతాయి. తాజా బుకింగ్‌లు బలంగా ఉన్నాయి’’ అని ఆనంద్ సోనీ తెలిపారు. లిమిటెడ్ ఎడిషన్ స్పోర్ట్స్ కూప్, ఎల్‌సీ 500 హెచ్‌ను ఈ సంస్థ ఇప్పటికే ప్రవేశపెట్టింది. న్యూ జనరేషన్ ఎల్‌ఎం మల్టీపర్పస్ వెహికల్‌కు కూడా బుకింగ్‌లు ప్రారంభించనుంది.
ఈ ఏడాది మొదటి ఆరు నెల్లలో 3,474 యూనిట్లను విక్రయించినట్టు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది 97 శాతం వృద్ధిగా పేర్కొన్నారు. ‘‘మా ఎస్‌యూవీలు 217 శాతం అధిక అమ్మకాలు నమోదు చేశాయి. కార్ల పనితీరులో 127 శాతం వృద్ధి నెలకొంది. పండుగల సమయంలోనూ ఈ డిమాండ్ కొనసాగుతుందని అనుకుంటున్నాం’’అని సింగ్ వెల్లడించారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ5 మోడళ్లకు డిమాండ్ బలంగా ఉన్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment