లగ్జరీ కార్లను అలా వదిలేశారు!
బీజింగ్: చైనాలోని చెంగ్డూ నగరంలో దాదాపు 200 కార్లను వాటి యజమానులు ఊరికే అలా ఓ పార్కులో వదిలేశారు. వాటిలో ఒక్కొక్కటి మూడు కోట్ల రూపాయలు విలువచేసే రెండు బెంట్లీస్, మూడు ల్యాండ్ రోవర్స్, మూడు మూడు మెర్సిడెస్ బెంజీ కార్లతోపాటు ఓ లగ్జరీ టూ వీలర్ కూడా ఉంది. వివిధ కారణాల వల్ల నిరుపయోగంగా అలా వదిలేసిన కార్లను తీసుకెళ్లాల్సిందిగా వాటి యజమానులకు స్థానిక అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు.
కొన్నింటిని ఇప్పటికే స్థానిక అధికారులు వేలం వేయగా, కఠిన చట్టాల కారణంగా మిగతా వాహనాలను ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. ఇప్పుడు టైరంట్స్ కారు పార్కింగ్‌గా పిలుస్తున్న ఆ మైదానంలో కొన్ని కార్లను వదిలేసి రెండేళ్లు పైబడడంతో వాటి చుట్టూ దట్టమైన పొదలు కూడా పెరిగాయి.
ప్రత్యక్షంగానో, పరోక్షంగానో క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం వల్ల కొన్నింటిని, సరైన కాగితాలు లేకపోవడం వల్ల కొన్నింటినీ, చట్టప్రకారం కాలం తీరిపోయిన కారణంగా మరికొన్ని కార్లను అలా యజమానులు వదిలేశారని స్థానిక మున్సిపల్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. ఆ కార్లను వేలం వేయాలంటే వాటికి డూప్లికేట్ పత్రాలను సృష్టించాల్సి ఉంటుంది. అందుకు చైనా ఆర్టీయే చట్టాలు అనుమతించవు.