Lv Prasad Eye Doctors
-
వైట్ ఫంగస్ లక్షణాలివే.. గుర్తిస్తే చికిత్స సాధ్యమే
సాక్షి, హైదరాబాద్: కరోనా సెకండ్‌వేవ్ తరుణంలో ఇటీవల కొత్తగా వినిపిస్తున్న పేరు వైట్ ఫంగస్. కొద్దిరోజులుగా బ్లాక్ ఫంగస్ చేస్తున్న విలయాలు చూస్తున్న మనల్ని ఇప్పుడు వైట్ ఫంగస్ హడలెత్తిస్తోంది. అయితే, వైట్ ఫంగస్ వ్యాధిని సమయానికి గుర్తిస్తే పూర్తి స్థాయిలో చికిత్స చేయొచ్చని ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాల రెటీనా స్పెషలిస్ట్ డాక్టర్ వివేక్ ప్రవీణ్ దావే అన్నారు. చికిత్స అందిస్తే రోగి ప్రాణానికి, కంటికి, చూపునకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కేసులు చాలా అరుదని, భయపడాల్సిన అవసరం లేదని వివరించారు. ఆయన వెల్లడించిన వివరాలివీ... వైట్ ఫంగస్ అంటే... వైట్ ఫంగస్ శాస్త్రీయ నామం కాండిడా అల్బికాన్సీ. ఇది సహజంగానే శరీరంలో, బయటా ఉంటుంది. అతిగా పెరిగిన సందర్భంలోనే అనారోగ్యానికి దారి తీస్తుంది. పరీక్షల్లో తెల్లగా కనిపిస్తున్నందునే దీన్ని ‘వైట్ ఫంగస్’అంటారు. ఇది కంటి గుడ్డులోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. శరీరంలోని ఏ భాగాన్నైనా ప్రభావితం చేయగలదు. బ్లాక్ ఫంగస్ ప్రధానంగా కంటి చుట్టూ వుండే కణజాలాన్ని, ముక్కులోని సైనస్‌ను ప్రభావితం చేస్తుంది, వైట్ ఫంగస్ కంటి లోపలి కణజాలాన్ని ముఖ్యంగా విట్రస్ జల్, రెటీనాపై ప్రభావం చూపుతుంది. సరైన చికిత్స అందకపోతే కంటి చూపును హరిస్తుంది. శరీరం మొత్తానికి సంక్రమిస్తే మాత్రం వైట్ ఫంగస్ ప్రాణాంతకం. బలహీనంగా మారిన రోగుల్లో మాత్రమే ఇది జరుగుతుంది. ఇవీ వైట్ ఫంగస్ లక్షణాలు.. : కరోనా నుంచి కోలుకున్న ఒకటి నుంచి 3 నెలల్లో దృష్టి లోపం ఏర్పడుతుంది. కంటిలో నొప్పితోపాటు కన్ను ఎర్ర బడుతుంది. కో–మార్బిడిటిస్ (రెండు లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే) నియంత్రణలో లేని మధుమేహం, దీర్ఘకాలం స్టెరాయిడ్లు వాడటం వంటి వాటితో ఈ వ్యాధి మరింత ప్రమాదానికి కారణమవుతుంది. తక్కువ రోగ నిరోధక శక్తి కలిగిన వారిలో లేదా రక్తంలో అధికంగా చక్కెర స్థాయిలు ఉన్న రోగులకు వైట్ ఫంగస్ వల్ల ఎక్కువ ప్రమాదం. కోవిడ్ బాధితుడు లేదా దాని నుంచి కోలుకున్న తర్వాత మొదటిసారిగా జ్వరం వచ్చిన 6 నుంచి 8 వారాల్లోపు ఈ వ్యాధి దాడి చేయొచ్చు. ఆ కాలం లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇలా చికిత్స చేయొచ్చు... ఇంట్రాకోక్యురీ సర్జరీ, కంటి లోపల యాంటీఫంగల్ ఇంజెక్షన్లు ఇవ్వడం లేదా నోటి ద్వారా యాంటీఫంగల్ ఏజెంట్లను అందించడం చేయొచ్చు. తరచుగా శస్త్ర చికిత్సలు చేయాల్సి రావచ్చు. ఈ చికిత్సకు నాలుగు నుంచి ఆరు వారాలు పడుతుంది. తొలుత రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాలి. రోగ నిరోధక శక్తిని పెంచడం చాలా ముఖ్యం. -
శోకసంద్రం
నంగునూరు, న్యూస్‌లైన్: కోనాయిపల్లి శోకసంద్రమైంది... మౌనంగా రోదించింది. గ్రామంలో ఎవరిని కదిపినా కన్నీరే సమాధానమిచ్చింది. అందరి నోటా చిన్నారి ప్రియదర్శిని పేరే వినిపించింది. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జరిగిన సైకో దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి ప్రియదర్శిని అంత్యక్రియలు బుధవారం బంధువులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య స్వగ్రామం నంగునూరు మండలం కోనాయిపల్లిలో జరిగాయి. కోనాయిపల్లి వాసులే కాకుండా పక్క గ్రామాల వారూ భారీగా తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లో పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని మంగళవారం రాత్రే ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పటికే టీవీల ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు చిన్నారిని చూసేందుకు భారీగా తరలివచ్చారు. పుట్టెడు దుఃఖంలోనూ నేత్రదానం అల్లారు ముద్దుగా పెంచిన కూతురు ప్రియదర్శిని కానరాని లోకాలకు వెళ్లిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు శ్రీనివాస్, సోనీలు సమాజహితం కోసం ఓ నిర్ణయం తీసుకున్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యుల సూచన మేరకు తమ కంటి దీపం ఆరిపోయినా, మరో రెండు ఇళ్లలో వెలుగులు నింపారు. తమ గారాల పట్టి కళ్లను దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. వీరి ఔదార్యాన్ని గ్రామస్తులతో పాటు బంధువులు, స్నేహితులు అభినందించారు. రైల్యే సిబ్బందిపై కేసు నమోదు చేయాలి ప్రజలందరూ చూస్తుండగానే సైకో కత్తులతో వీరంగం సృష్టించడం రైల్వే పోలీసులు, సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని చిన్నారి తండ్రి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పటిష్ట భద్రత కలిగిఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దుండగుడు కత్తులతో రావడం భద్రతాలోపానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. తన కూతురి మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన కుటుంబానికి కడుపు కోత మిగిల్చినట్లు మరొకరికి జరగకుండా చూడాలని చేతులు జోడించి వేడుకున్నాడు. సైకోను ఉరితీయాలి అభం శుభం తెలియని చిన్నారిని కత్తులతో పొడిచి చంపేందుకు వానికి(సైకో) చేతులెలా వచ్చాయంటూ చిన్నారి మృతదేహం వద్ద మహిళలు బోరున విలపించారు. ‘వాని కుటుంబం నాశనమైపోను’ అంటూ శాపనార్థాలు పెడుతూ ప్రియాంక తల్లిదండ్రులను ఓదార్చారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సైకో కిరణ్‌కుమార్‌ను బహిరంగంగా ఉరితీయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బతుకుదెరువు కోసం వలస వెళ్లి చిన్నారిని కోల్పోయిన శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ పిల్లి వెంకటేశం, జడ్పీటీసీ మాజీ సభ్యుడు దువ్వల మల్లయ్య, నాయకులు నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డితోపాటు గ్రామస్తులు కోరారు.