నంగునూరు, న్యూస్‌లైన్: కోనాయిపల్లి శోకసంద్రమైంది... మౌనంగా రోదించింది. గ్రామంలో ఎవరిని కదిపినా కన్నీరే సమాధానమిచ్చింది. అందరి నోటా చిన్నారి ప్రియదర్శిని పేరే వినిపించింది. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జరిగిన సైకో దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి ప్రియదర్శిని అంత్యక్రియలు బుధవారం బంధువులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య స్వగ్రామం నంగునూరు మండలం కోనాయిపల్లిలో జరిగాయి. కోనాయిపల్లి వాసులే కాకుండా పక్క గ్రామాల వారూ భారీగా తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లో పోస్టుమార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని మంగళవారం రాత్రే ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పటికే టీవీల ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు చిన్నారిని చూసేందుకు భారీగా తరలివచ్చారు.
పుట్టెడు దుఃఖంలోనూ నేత్రదానం
అల్లారు ముద్దుగా పెంచిన కూతురు ప్రియదర్శిని కానరాని లోకాలకు వెళ్లిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులు శ్రీనివాస్, సోనీలు సమాజహితం కోసం ఓ నిర్ణయం తీసుకున్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యుల సూచన మేరకు తమ కంటి దీపం ఆరిపోయినా, మరో రెండు ఇళ్లలో వెలుగులు నింపారు. తమ గారాల పట్టి కళ్లను దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. వీరి ఔదార్యాన్ని గ్రామస్తులతో పాటు బంధువులు, స్నేహితులు అభినందించారు.
రైల్యే సిబ్బందిపై కేసు నమోదు చేయాలి
ప్రజలందరూ చూస్తుండగానే సైకో కత్తులతో వీరంగం సృష్టించడం రైల్వే పోలీసులు, సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోందని చిన్నారి తండ్రి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. పటిష్ట భద్రత కలిగిఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో దుండగుడు కత్తులతో రావడం భద్రతాలోపానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. తన కూతురి మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన కుటుంబానికి కడుపు కోత మిగిల్చినట్లు మరొకరికి జరగకుండా చూడాలని చేతులు జోడించి వేడుకున్నాడు.
సైకోను ఉరితీయాలి
అభం శుభం తెలియని చిన్నారిని కత్తులతో పొడిచి చంపేందుకు వానికి(సైకో) చేతులెలా వచ్చాయంటూ చిన్నారి మృతదేహం వద్ద మహిళలు బోరున విలపించారు. ‘వాని కుటుంబం నాశనమైపోను’ అంటూ శాపనార్థాలు పెడుతూ ప్రియాంక తల్లిదండ్రులను ఓదార్చారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా సైకో కిరణ్‌కుమార్‌ను బహిరంగంగా ఉరితీయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బతుకుదెరువు కోసం వలస వెళ్లి చిన్నారిని కోల్పోయిన శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ పిల్లి వెంకటేశం, జడ్పీటీసీ మాజీ సభ్యుడు దువ్వల మల్లయ్య, నాయకులు నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డితోపాటు గ్రామస్తులు కోరారు.
శోకసంద్రం
Published Thu, Dec 12 2013 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement