‘ఆప్’ అభ్యర్థులు కేరాఫ్ క్రిమినల్ కేసులు
సి.నందగోపాల్, సాక్షి-చెన్నై: రాజకీయాల్లో చెత్తను తుడిచేస్తాం అంటూ ‘చీపురుకట్ట’తో ముందుకొచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్).. ఆచరణలో మాత్రం తన ఆదర్శాలను గాలికొదిలేస్తోంది! పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై అనేక కేసులున్నాయి. తమిళనాడులోని కన్యాకుమారి స్థానం నుంచి ఆప్ తరఫున పోటీ చేస్తున్న ఎస్పీ ఉదయ్కుమార్పై అయితే హత్యాయత్నంతోపాటు 382 క్రిమినల్ కేసులున్నాయి. ఈయన గతంలో కూడంకుళం అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలకు నేతృత్వం వహించారు.
ఇక ఇదే పార్టీ నుంచి తూత్తుకూడి స్థానం నుంచి బరిలో దిగిన ఎం.పుష్పరాయన్ కూడా 380 కేసులు ఎదుర్కొంటున్నారు. వీరే కాదు తమిళనాడులోని మొత్తం 39 స్థానాల నుంచి బరిలో నిలిచిన 844 మంది అభ్యర్థుల్లో ఏకంగా 103 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ స్వచ్ఛంద సంస్థల విశ్లేషణలో తేలింది. వీరిలో అన్నాడీఎంకే నుంచి పోటీ పడుతున్న ఏడుగురిపై, డీఎంకే నుంచి బరిలో ఉన్న మరో ఏడుగురిపై, డీఎండీకే నుంచి పోటీ చేస్తున్న ఐదుగురిపై తీవ్ర అభియోగాలున్నాయి.