సోనియా వల్లే తెలంగాణ కల సాకారం
60 ఏళ్ల పోరాటానికి విజయం దక్కింది
ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణరావు
మహేశ్వరం మరో హైటెక్ సిటీగా మారనుంది: సబిత
మహేశ్వరం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకే దక్కుతుందని.. ఆమెకు ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఆర్టీసీ చైర్మన్ ఎం. సత్యనారాయణరావు అన్నారు. 60 ఏళ్ల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. సోమవారం మహేశ్వరంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆర్టీసీ బస్సు డిపోను ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరావు మాట్లాడుతూ.. అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని కొనియాడారు. 2004లో ఎన్నికల ప్రచారసభలో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి దూసుకుపోతున్నారంటూ అభినందించారు. ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. మహేశ్వరంలో ఆర్టీసీ డిపోను సబితాఇంద్రారెడ్డి పట్టుబట్టి తెచ్చుకున్నారని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు యువత నడుం బిగించాలని సూచించారు.
మహేశ్వరం ప్రజల కల ఫలించింది..
తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు , మహేశ్వరం ప్రజల కోరిక ఆర్టీసీ బస్ డిపో ప్రారంభం ఒకే నెలలో జరిగాయని, మహేశ్వరం భవిష్యత్తులో మరో హైటెక్ సీటీగా మారబోతోందని మాజీ హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ రాకతో రావిర్యాల, మహేశ్వరం, ఆదిభట్ల, తుక్కుగూడ గ్రామాల్లో పారిశ్రామిక, ఐటీ కంపెనీలు రానున్నాయని.. దీంతో అభివృద్ధి మరింత జరగనుందని అన్నారు. మహేశ్వరంలో ఆర్టీసీ డిపో ప్రారంభం కాదని దుష్ర్పచారం చేశారని, వాటన్నింటినీ తిప్పికొట్టి ఈ రోజు డిపోను ప్రారంభించామన్నారు. మొత్తం 75 బస్సులతో డిపోను నడపనున్నామన్నారు. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న జిల్లాలోని ప్రజల అవరాసరాల కోసం శంషాబాద్, నాదర్గుల్, సర్దార్‌నగర్, చేవెళ్లలో సైతం డిపోలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. సబర్బన్ రూటును 5 కిలోమీటర్ల వరకు పెంచాలని ఆర్టీసీ చైర్మన్, అధికారులను ఆమె కోరారు.
75 బస్సులతో డిపోను విస్తరిస్తాం
ప్రయాణికుల సౌకర్యార్థం మహేశ్వరం ఆర్టీసీ బస్ డిపోను ఏర్పాటు చేశామని ఆర్టీసీ హైదరాబాద్ రీజియన్ ఈడీ కోటేశ్వర్రావు అన్నారు. ఆర్టీసీ సేవలను దశలవారీగా విస్తరిస్తామని తెలిపారు. ఫస్ట్ ఫేజ్ కింద 10 బస్సులను ప్రారంభించాం, రెండో దశలో మరో 35, మూడో దశలో మొత్తం 75 బస్సులతో డిపోను నడపనున్నామని ఆయన స్పష్టంచేశారు. ప్రజలు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించకుండా ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాలని కోరారు. అంతకు ముందు మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వర ఆలయం నుంచి ఆర్టీసీ డిపో వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు వాద్యాలతో నృత్యాలు చేస్తూ జై తెలంగాణ , జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.అనంతరం డిపోను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ బుస్సు చెన్న కృష్ణారెడ్డి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఇజ్రాయేల్, రాష్ట గ్రామీణాభివృద్ధి శాఖ డెరైక్టర్ వి. మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎం. శివమూర్తి, పీఏసీఎస్ చైర్మన్ అంబయ్య, అపెడ్ డెరైక్టర్ బోద మాధవరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సుధీర్‌గౌడ్, డిపో మేనేజర్ పవిత్ర, డిపో ఎంటీ సంధ్యారాణి, తహసీల్దార్ గోపీరాం, ఎంపీడీఓ నీరజ, హౌసింగ్ ఈఈ పరిపూర్ణచారి, డీఈ పర్వీన్ బేగం, ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండారెడ్డి, కావలి దశరథ, బోద జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.