భక్తిశ్రద్ధలతో మొహర్రం
బనగానపల్లె: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తర్వాత ఏపీలోని బనగానపల్లె పట్టణంలో ఆ స్థాయిలో మొహర్రం నిర్వహించడం కర్నూలు జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లె ప్రత్యేకత. మొహర్రం పీర్ల ఊరేగింపులో భాగంగా షియా మతస్తులు శోక గీతాలు ఆలపిస్తూ బ్లేడ్లు, చురకత్తులతో ఎద, వీపుపై మాతం నిర్వహించారు. బుధవారం బనగానపల్లె నవాబు వంశస్తుల ఆధ్వర్యంలో సుమారు 200 పీర్లను పట్టణంలో ఊరేగించారు. మతసామరస్యానికి ప్రతీకగా నిర్వహించే ఈ ఊరేగింపును ఆద్యంతం భక్తిశ్రద్ధలతో చేపట్టారు. స్థానిక నవాబుకోట నుంచి ప్రారంభమైన పీర్ల ఊరేగింపులో బనగానపల్లె నవాబు మీర్ ఫజిల్ అలీఖాన్, ఆయన కుమారుడు గులాం అలీఖాన్ పీర్ల వెంట శోకగీతాలు ఆలపిస్తూ నడవగా షియా మతస్తులు నల్లటి వస్త్రాలు ధరించి పీర్ల ఊరేగింపును కొనసాగించారు. ఈ సందర్భంగా బ్లేడ్లు, చురకత్తులతో ఎదపై మాతం నిర్వహిస్తూ భక్తిని చాటుకున్నారు. కొండపేటలోని ఇమాం ఖాసీం పీరు జుర్రేరు వద్దకు చేరుకున్న అన్ని పీర్లను ఆలింగనం చేసుకుంది. ఇక్కడకు వచ్చిన సుమారు 200 పీర్లను జుర్రేరువాగులో శుద్ధిచేసిన అనంతరం తిరిగి చావిడిలోకి చేర్చారు. మాతంను తిలకించేందుకు బనగానపల్లె పరిసర ప్రాంతాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. సంతాప సూచకంగా పట్టణంలోని వ్యాపార దుకాణాలు, సినిమా థియేటర్లు మూసివేశారు.