machavaram police
-
బాలికపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు
విజయవాడ లీగల్: బాలికను గర్భవతిని చేసిన కేసులో యువకుడి నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి, అదనపు జిల్లా జడ్జి డాక్టర్ ఎస్.రజని మంగళవారం తీర్పు చెప్పారు. విజయవాడ మారుతీనగర్‌కు చెందిన పట్నాల మహేష్ (20) మాయమాటలు చెప్పి తన ఇంటి పక్కన నివసించే బాలికను లోబర్చుకున్నాడు. ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేశాడు. బాలిక ఆరోగ్యం మీద అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. బాలిక తల్లి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు విచారణలో నిందితుడి నేరం రుజువుకావడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. బాలికకు రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షల పరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను జడ్జి ఆదేశించారు. -
బెజవాడలో ఐఏఎస్ అధికారి సోదరి అదృశ్యం
విజయవాడ: నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా వైద్యురాలు సూర్యకుమారి అదృశ్యం కలకలం రేపుతోంది. కృష్ణాజిల్లా విస్సన్నపేటలోని ఓ ఆస్పత్రిలో ఆమె వైద్యురాలిగా పని చేస్తోంది. అదృశ్యమైన సూర్యకుమారి కర్ణాటక క్యాడర్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సోదరిగా సమాచారం. కుటుంబసభ్యుల ఫిర్యాదు నేపథ్యంలో ఆమె అదృశ్యంపై తూర్పు మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడు విద్యాసాగర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా సూర్యకుమారి రెండు రోజుల క్రితం విద్యాసాగర్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడి ఇంట్లో సోదాలు చేపట్టి సీసీ టీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా విద్యాసాగర్ తల్లి మాట్లాడుతూ... రెండ్రోజుల క్రితం సూర్యకుమారి తన ఇంటికి వచ్చారని, అయితే ఆమె అక్కడ నుంచి వెంటనే వెళ్లిపోయినట్లు తెలిపారు. కాగా అటు మాజీ ఎమ్మెల్యే, ఇటు ఐఏఎస్ అధికారి కుటుంబాలు కావడంతో పోలీసులు ఈ కేసులో గోప్యత పాటిస్తున్నారు ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కెనరా బ్యాంక్ ఏటీఎం చోరీకి విఫలయత్నం
విజయవాడ : విజయవాడలోని మేరీ స్టెల్లా కాలేజీ ఆవరణలో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎం లో చోరీకి ఓ దొంగ విఫలయత్నం చేశాడు. రాత్రి సమయంలో ముఖానికి వస్ర్తాన్ని కట్టుకున్న ఆగంతకుడు ఇనుప రాడ్ తో ఏటిఎం లోకి ప్రవేశించాడు. ఏటీఎం సెక్యూరిటీ గార్డు ఏటీఎం రూంలోనే నిద్రిస్తున్న విషయాన్ని గమనించాడు. వెంటనే సెక్యూరిటీ గార్డు పై ఇనుపరాడ్ తో దాడిచేశాడు. ఒక్కసారిగా జరిగిన దాడి తో గార్డు మరియన్న తీవ్రంగా గాయపడ్డాడు. తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. ఈలోగా దుండగుడు ఏటీఎం కింది భాగంలోని తలుపులు తెరిచాడు. అప్పటికే తేరుకున్న మరియన్న గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అప్రమత్తమయ్యారు. విషయం గ్రహించిన దొంగ వెంటనే పరారయ్యాడు. మరియన్న ఫిర్యాదుతో మాచవరం పోలీసులు ఏటీఎం ను పరిశీలించారు. పధకం ప్రకారమే నిందితుడు ఎటిఎం చోరీకి ప్రయత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన లో డబ్బు భద్రంగా ఉండటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.