విజయవాడలోని మేరీ స్టెల్లా కాలేజీ ఆవరణలో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎం లో చోరీకి ఓ దొంగ విఫలయత్నం చేశాడు.
విజయవాడ : విజయవాడలోని మేరీ స్టెల్లా కాలేజీ ఆవరణలో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎం లో చోరీకి ఓ దొంగ విఫలయత్నం చేశాడు. రాత్రి సమయంలో ముఖానికి వస్ర్తాన్ని కట్టుకున్న ఆగంతకుడు ఇనుప రాడ్ తో ఏటిఎం లోకి ప్రవేశించాడు. ఏటీఎం సెక్యూరిటీ గార్డు ఏటీఎం రూంలోనే నిద్రిస్తున్న విషయాన్ని గమనించాడు. వెంటనే సెక్యూరిటీ గార్డు పై ఇనుపరాడ్ తో దాడిచేశాడు. ఒక్కసారిగా జరిగిన దాడి తో గార్డు మరియన్న తీవ్రంగా గాయపడ్డాడు. తల పగిలి తీవ్ర రక్తస్రావం అయింది.
ఈలోగా దుండగుడు ఏటీఎం కింది భాగంలోని తలుపులు తెరిచాడు. అప్పటికే తేరుకున్న మరియన్న గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అప్రమత్తమయ్యారు. విషయం గ్రహించిన దొంగ వెంటనే పరారయ్యాడు. మరియన్న ఫిర్యాదుతో మాచవరం పోలీసులు ఏటీఎం ను పరిశీలించారు. పధకం ప్రకారమే నిందితుడు ఎటిఎం చోరీకి ప్రయత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన లో డబ్బు భద్రంగా ఉండటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.