machilipatnam express
-
పట్టాలు తప్పిన మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్
తిరుపతి అర్బన్: తిరుపతి నుంచి మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు బయల్దేరాల్సిన తిరుపతి–మచిలీపట్నం రైలు ప్రమాదానికి గురైంది. రాత్రి 8.20గంటల సమయంలో మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ యార్డ్ (షెడ్) నుంచి ప్లాట్‌ఫాంకు వస్తుండగా రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. రైల్వేస్టేషన్‌కు రెండు వందల మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో రేణిగుంట రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక బ్రేక్‌డౌన్ యంత్రాలను తిరుపతికి తెప్పించి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రమాదంతో మూడు గంటల పాటు హరిప్రియా, తిరుమల, హంస, కాకినాడ, కదిరి–దేవరపల్లి తదితర రైళ్లకు అంతరాయం కలిగింది. ఫలితంగా వందలాది మంది ప్రయాణికులు ప్లాట్‌ఫాంపై పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. సిబ్బంది కొరతతోనే ప్రమాదం? తిరుపతి యార్డ్‌లో 14 మంది సిబ్బంది కొరత ఉన్నట్లు సమాచారం. ఒక రైలును యార్డ్ నుంచి ప్లాట్‌ఫాంకు తీసుకురావడానికి ఓ షిఫ్ట్‌కు ఏడుగురు సిబ్బంది అవసరం. అయితే, ఇద్దరు, ముగ్గురు సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ప్రధానంగా షంటింగ్ మాస్టర్, పాయింట్ మెన్, డిప్యూటీ స్టేషన్‌మాస్టర్ తదితర కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న సిబ్బందితోనే సర్దుకుపోతున్నారు. దీంతో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. -
మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
సాక్షి, విజయవాడ : మచిలీపట్నం=సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలుకు శనివారం పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం అర్ధరాత్రి కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లి వద్దకు రాగానే రైలు ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ స్టేషన్ వద్ద రైలును నిలిపివేసి అధికారులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న ఉంగుటూరు పోలీసులు దగ్గరలో ఉన్న వాటర్ ట్యాంక్ సాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎంతకు మంటలు అదుపులోకి రాకపోవడంతో గన్నవరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో రైలులో ఉన్న ప్రయాణీకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు బోగీ మిస్
హైదరాబాద్: రైల్వే అధికారుల తప్పిదం ఫలితంగా మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి గంటన్నర ఆలస్యంగా బయలుదేరింది. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రైల్వే అధికారులు అదనపు బోగీ ఏర్పాటుకు నిర్ణయించారు. ఎస్సీ1 బోగీ పేరుతో 72 మంది ప్రయాణికులకు బెర్త్‌లను కేటాయించారు. గురువారం రాత్రి 10.30 గంటలకు బయలుదేరాల్సిన రైలు నిర్ణీత సమయానికే రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అయితే అదనపు బోగీ కనిపించకపోవడంతో ప్రయాణికులు రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు. తప్పిదం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అదనపు బోగీని ఏర్పాటు చేసి పంపారు. -
మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ నెంబర్ మార్పు
హైదరాబాద్: సికింద్రాబాద్-మణుగూరు ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్ల నెంబర్లు మారనున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్-మణుగూర్ ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న 12752/12751 నెంబర్ ఆగస్టు ఒకటవ తేదీ నుంచి 17026/17025 గా మారనుంది. అలాగే ప్రస్తుతం సికింద్రాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న 17050/17049 నెంబర్ ఆగస్టు ఒకటో తేదీ నుంచి 17250/17249 గా మారనుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు.