Madanapalle Samaikya sankharavam
-
పేదల ఇళ్లల్లో.. మా ఫొటో ఉండేలా పరిపాలిస్తా: వైఎస్ జగన్
చిత్తూరు: కొడుకు కోసం తెలుగువారి జీవితాలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెలగాటమాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని వదిలివెళ్లాలట, మరి సోనియా గాంధీ ఎక్కడకు వెళ్లాలో చంద్రబాబునాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలు చెప్పాలని వైఎస్ జగన్ ఘాటుగా ప్రశ్నించారు. సమైక్య శంఖారావంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు వైఎస్ జగన్ మంగళవారం చేరుకున్నారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిల వైఖరిపై మండిపడ్డారు. వైఎస్ హయాంలో ప్రజలు సువర్ణయుగాన్ని చూశారని చెప్పారు. వైఎస్ పాలనలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కూడా రాలేదని జగన్ గుర్తుచేశారు. అందరూ రండి ఎన్నికలకు పోదామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నేను సమైక్యవాదంతో ఎన్నికల్లోకి వస్తానని వైఎస్ జగన్ సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో ఎనిమిది సార్లు విద్యుత్ బిల్లులు పెంచిన ఆయన ఇప్పుడు తగ్గిస్తానని హామీ ఇస్తున్నారని జగన్ విమర్శించారు. మద్యపాన నిషేధాన్ని ఎన్టీఆర్ అమలుచేస్తే ఎత్తేసింది చంద్రబాబు అని ఆయన ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం ఇస్తే రూ. 5 పెంచింది చంద్రబాబు కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అప్పులు పాలైన రైతన్న ఆత్మహత్య చేసుకుంటే తిన్నది ఆరగక చనిపోతున్నారన్నది చంద్రబాబు అని చెప్పారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో పెన్షన్లు 16లక్షలు మాత్రమేనని, కానీ పింఛన్లను 16నుంచి 78 లక్షలకు పెంచిన ఘనత వైఎస్సార్‌దేనని జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు రూ. 70పింఛన్ ఇస్తే వైఎస్సార్ రూ. 200కు పెంచారని చెప్పారు. వైఎస్సార్ సువర్ణయుగాన్ని మళ్లీ తీసుకొస్తానని, ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నేను చనిపోయినా.. పేదల ఇళ్లల్లో నా ఫోటో, మానాన్న ఫోటో ఉండేలా పరిపాలిస్తానని వైఎస్ జగన్ ఘాటుగా జవాబులిచ్చారు. -
అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన సోనియా:షర్మిల
-
అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన సోనియా:షర్మిల
మదనపల్లె: అన్నదమ్ముల మధ్య యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ విభజన చిచ్చు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల విమర్శించారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా ఆమె ఈ రాత్రి 7.30 గంటలకు చిత్తూరు జిల్లా మదనపల్లెకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. తెలుగువారి బిక్షతో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారికే వెన్నుపోటు పొడుస్తోందన్నారు. కాంగ్రెస్‌కు ఇంతమంది ఎంపిలు ఉండి, వారంతా ఢిల్లీలో వంగి, వంగి సలాములు కొడుతున్నారన్నారు. రాజకీయ లబ్దికోసం సీమాంధ్రను వల్లకాడ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడిందన్నారు. వైఎస్ఆర్ సిపి మొదటి నుంచి అడ్డగోలు విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉందని చెప్పారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే హైదరాబాద్ నగరం ఈ రకంగా అభివృద్ధి చెందిందన్నారు. చదువుకున్న నిరుద్యోగులందరూ ఉద్యోగాల కోసం ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలో చెప్పాలన్నారు. హైదరాబాద్ ఆదాయం 50 శాతంపైనే ఉంది. అంత ఆదాయం పోతే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుందో చెప్పాలన్నారు. ఇప్పటికే నీటి సమస్యతో రాష్ట్రం అల్లాడుతుంటే, రాష్ట్రం విభజన జరిగితే కొట్టుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. విభజనకు అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబు ఏ మొఖం పెట్టుకొని ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. దివంగత మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో లక్షలాది పేదలు లబ్ధి పొందారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదవాలని ఫీజురీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టిన విషయం గుర్తు చేశారు. రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రఃభుత్వం ఆయన ప్రవేశపెట్టిన పథకాలను అటకెక్కించిందన్నారు. రాష్ట్రాన్ని విడగొడుతున్నామన్న సంకేతాలు రాగానే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రాజీ నామాలు చేశారని గుర్తు చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకు కాంగ్రెస్, టీడీపీలకు దమ్ము లేదన్నారు.