
పేదల ఇళ్లల్లో.. మా ఫొటో ఉండేలా పరిపాలిస్తా: వైఎస్ జగన్
చిత్తూరు: కొడుకు కోసం తెలుగువారి జీవితాలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చెలగాటమాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ నగరాన్ని వదిలివెళ్లాలట, మరి సోనియా గాంధీ ఎక్కడకు వెళ్లాలో చంద్రబాబునాయుడు, కిరణ్ కుమార్ రెడ్డిలు చెప్పాలని వైఎస్ జగన్ ఘాటుగా ప్రశ్నించారు. సమైక్య శంఖారావంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు వైఎస్ జగన్ మంగళవారం చేరుకున్నారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిల వైఖరిపై మండిపడ్డారు. వైఎస్ హయాంలో ప్రజలు సువర్ణయుగాన్ని చూశారని చెప్పారు. వైఎస్ పాలనలో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కూడా రాలేదని జగన్ గుర్తుచేశారు. అందరూ రండి ఎన్నికలకు పోదామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నేను సమైక్యవాదంతో ఎన్నికల్లోకి వస్తానని వైఎస్ జగన్ సవాల్ విసిరారు. చంద్రబాబు హయాంలో ఎనిమిది సార్లు విద్యుత్ బిల్లులు పెంచిన ఆయన ఇప్పుడు తగ్గిస్తానని హామీ ఇస్తున్నారని జగన్ విమర్శించారు.
మద్యపాన నిషేధాన్ని ఎన్టీఆర్ అమలుచేస్తే ఎత్తేసింది చంద్రబాబు అని ఆయన ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం ఇస్తే రూ. 5 పెంచింది చంద్రబాబు కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. అప్పులు పాలైన రైతన్న ఆత్మహత్య చేసుకుంటే తిన్నది ఆరగక చనిపోతున్నారన్నది చంద్రబాబు అని చెప్పారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో పెన్షన్లు 16లక్షలు మాత్రమేనని, కానీ పింఛన్లను 16నుంచి 78 లక్షలకు పెంచిన ఘనత వైఎస్సార్దేనని జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు రూ. 70పింఛన్ ఇస్తే వైఎస్సార్ రూ. 200కు పెంచారని చెప్పారు. వైఎస్సార్ సువర్ణయుగాన్ని మళ్లీ తీసుకొస్తానని, ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నేను చనిపోయినా.. పేదల ఇళ్లల్లో నా ఫోటో, మానాన్న ఫోటో ఉండేలా పరిపాలిస్తానని వైఎస్ జగన్ ఘాటుగా జవాబులిచ్చారు.