
అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన సోనియా:షర్మిల
మదనపల్లె: అన్నదమ్ముల మధ్య యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ విభజన చిచ్చు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల విమర్శించారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా ఆమె ఈ రాత్రి 7.30 గంటలకు చిత్తూరు జిల్లా మదనపల్లెకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. తెలుగువారి బిక్షతో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారికే వెన్నుపోటు పొడుస్తోందన్నారు. కాంగ్రెస్కు ఇంతమంది ఎంపిలు ఉండి, వారంతా ఢిల్లీలో వంగి, వంగి సలాములు కొడుతున్నారన్నారు. రాజకీయ లబ్దికోసం సీమాంధ్రను వల్లకాడ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడిందన్నారు.
వైఎస్ఆర్ సిపి మొదటి నుంచి అడ్డగోలు విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉందని చెప్పారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే హైదరాబాద్ నగరం ఈ రకంగా అభివృద్ధి చెందిందన్నారు. చదువుకున్న నిరుద్యోగులందరూ ఉద్యోగాల కోసం ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలో చెప్పాలన్నారు. హైదరాబాద్ ఆదాయం 50 శాతంపైనే ఉంది. అంత ఆదాయం పోతే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు ఎక్కడ నుంచి వస్తుందో చెప్పాలన్నారు.
ఇప్పటికే నీటి సమస్యతో రాష్ట్రం అల్లాడుతుంటే, రాష్ట్రం విభజన జరిగితే కొట్టుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. విభజనకు అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ ఇచ్చిన చంద్రబాబు ఏ మొఖం పెట్టుకొని ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు.
దివంగత మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతో లక్షలాది పేదలు లబ్ధి పొందారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదవాలని ఫీజురీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టిన విషయం గుర్తు చేశారు. రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రఃభుత్వం ఆయన ప్రవేశపెట్టిన పథకాలను అటకెక్కించిందన్నారు. రాష్ట్రాన్ని విడగొడుతున్నామన్న సంకేతాలు రాగానే వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీ నామాలు చేశారని గుర్తు చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేసేందుకు కాంగ్రెస్, టీడీపీలకు దమ్ము లేదన్నారు.