
కిరణ్ దిష్టిబొమ్మలా చూస్తున్నారు: షర్మిల
గుంటూరు : రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకే తెలుగు జాతిని కేంద్రం విడదీయాలని చూస్తోందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి దిష్టిబొమ్మలా చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. కిరణ్కుమార్ రెడ్డి తెలుగు ప్రజలకు నమ్మకంగా ఉంటారా... సోనియాగాంధీకి విధేయులుగా ఉంటారా అని షర్మిల ఈ సందర్భంగా ప్రశ్నించారు.
సమైక్య శంఖారావం బస్సుయాత్రలో భాగంగా షర్మిల బుధవారం గుంటూరు జిల్లా వినుకొండలో మాట్లాడారు. కేంద్రం తెలుగు రాష్ట్రాన్ని విడుదీస్తుందంటే అందుకు కారణం చంద్రబాబునాయుడి మద్దతేనని అన్నారు. బాబు అసలు తెలంగాణపై లేఖను ఎందుకు ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు. యాత్రలు చేస్తున్న బాబుకు ఆత్మగౌరవం ఉందా అని అన్నారు.
వైఎస్ఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని ఆకాంక్షించారని షర్మిల గుర్తు చేశారు. ఏ ఛార్జీలు వేయకుండానే వైఎస్ఆర్ అన్ని అభివృద్ధి పనులు చేశారన్నారు. వైఎస్ సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచిందని షర్మిల విమర్శించారు.