చేతగాని సీఎం: షర్మిల | Sharmila takes on Kiran kumar reddy | Sakshi
Sakshi News home page

చేతగాని సీఎం: షర్మిల

Published Wed, Sep 11 2013 2:03 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

చేతగాని సీఎం: షర్మిల - Sakshi

చేతగాని సీఎం: షర్మిల

రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు కిరణ్‌కు ముందే తెలియదా?: షర్మిల
కిరణ్‌కుమార్‌రెడ్డీ... మీకు చెప్పకుండానే, మీతో చర్చించకుండానే మీ అధిష్టానం విభజన నిర్ణయం తీసుకుందా?
అంటే మీరు వాళ్ల దృష్టిలో అంత చేతగాని వారా? మీకంత సీన్ లేదా?
లేక మీతో ముందే చెప్పినా.. పదవి కాపాడుకోవడానికి గోప్యంగా ఉంచారా?
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడే మీరూ చేసి ఉంటే విభజన ఆగేది కాదా?
సిగ్గు లేకుండా సీఎం పదవి పట్టుకొని వేలాడుతున్నారు
మీరు సంపాదించుకోని పదవిపై అంత మోజెందుకు?
మీరు సీఎంగా, చేతగాని చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష
నాయకుడిగా ఉండడం ఈ రాష్ట్రం చేసుకున్న ఖర్మ
చంద్రబాబు లేఖ వల్లే కాంగ్రెస్ విభజన నిర్ణయం
చంద్రబాబు, ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి లేఖ వెనక్కు తీసుకునేదాకా ప్రజలు నిలదీయాలి
టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలంగా ఉంటే.. వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం, సీపీఎం మాత్రమే సమైక్యంవైపు ఉన్నాయి  

  ‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రాన్ని విభజిస్తున్న విషయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డికి ముందే తెలుసా? లేదా? లేక ముందే తెలిసి ఉంటే ఆయన ఎందుకు గోప్యంగా ఉంచారు? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిలదీశారు. ‘‘రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండా రుణాలిస్తామని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అని, బంగారు తల్లి అని.. ప్రజల కోసం కాకుండా కేవలం ప్రచారం కోసమే పథకాలు మొదలు పెట్టిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిగారూ.. మన రాష్ట్రంలో ఇంత ఘోర అన్యాయం జరుగుతుంటే.. మీరైనా సమాధానం చెప్పాలి కదా!
 
 అసలు.. మన రాష్ట్రాన్ని చీలుస్తున్నామని మీ కాంగ్రెస్ పార్టీ మీకు ముందే చెప్పిందా? లేదా? మీతో చర్చలు జరపకుండానే, మీకు చెప్పకుండానే ఈ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీల్చాలని నిర్ణయం తీసుకుందా? అంటే మీరు వాళ్ల దృష్టిలో అంత పనికిరాని వారని, మీకంత సీన్ లేదని వాళ్ల అభిప్రాయమా? లేకపోతే మీతో సంప్రదించిన తర్వాతే, మీతో చర్చలు జరిపిన తర్వాతే, మీ ఆమోదంతోనే విభజన నిర్ణయం తీసుకున్నా కూడా.. కేవలం మీ పదవులు కాపాడుకోవడం కోసం, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారా?’’ అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర ఎనిమిదో రోజు మంగళవారం ప్రకాశం జిల్లాలో సాగింది. కనిగిరి, మార్కాపురంలలో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. టీడీపీ సహా ఐదు పార్టీలు రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉంటే.. వైఎస్సార్ కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఎం మాత్రమే సమైక్యానికి మద్దతుగా నిలిచాయన్నారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే.. ‘‘ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలు చాలవన్నట్లు ఇప్పడు విభజన అంటూ ఒక తల్లి బిడ్డలైన తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య అగ్గిపెట్టి చలి కాచుకుంటోంది. ఓట్లు, సీట్ల కోసం, రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో మన రాష్ట్రంలో కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకొంది.
  మధ్యలో ఒక రాష్ట్రం వచ్చి కృష్ణా, గోదావరి నీళ్లను అడ్డుకుంటే కింద ఉన్న రాష్ట్రం ఒక మహా ఎడారి అయిపోతుందని తెలిిసీ  ఘోర అన్యాయం చేయడానికి సిద్ధమైంది. ఒక పక్కేమో కృష్ణా, గోదావరి నీళ్లు ఇవ్వరట.. మరో పక్క హైదరాబాద్ కూడా తీసేసుకుంటారట.. మరోవైపు సంక్షేమ పథకాలు నడిపే దారీ చూపరట. అంటే ఈ ప్రాంత ప్రజలు బతకాలని మీ ఉద్దేశమా.. బతకలేక ఆత్మహత్యలు చేసుకోవాలని మీ ఉద్దేశమా? కేవలం మీ స్వార్థ రాజకీయాల కోసం సీమాంధ్రను ఒక మహా వల్లకాడు చేస్తారా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. పోనీ మీరైనా సమాధానం చెప్పండి సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి. రాష్ట్రాన్ని విభజిస్తున్న సంగతి మీకు ముందే తెలుసా లేదా? ముందే తెలిస్తే ఎందుకు గోప్యంగా ఉంచారు?
 
 ముఖ్యమంత్రీ.. దిష్టిబొమ్మలా చూస్తుండిపోయారే..
 మన రాష్ట్రాన్ని చీలుస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సంకేతాలు పంపిన వెంటనే.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేశారు. మరి ముఖ్యమంత్రి గారూ మీరేం చేశారు? దిష్టిబొమ్మలా.. ఏమీ చేతగానట్లు అలాగే కళ్లప్పగించి చూస్తున్నది మీరు కాదా? చేసిన అన్యాయమంతా చేసేసి.. ఆ తర్వాత ఎప్పుడో ప్రెస్ మీటు పెట్టి.. అన్యాయం జరిగిపోతోందని మీరు చెప్పిన తీరు.. ఆహా ముఖ్యమంత్రీ.. మీకున్న తెలివితేటలు అన్నీ ఇన్నీ కావండి.
 
 అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామా చేసిన రోజే.. మీరు కూడా రాజీనామాలు చేసి ఉంటే.. విభజన ప్రక్రియ అప్పుడే ఆగిపోయేది కదా! ‘ఇంత మంది ప్రజలకు అన్యాయం జరుగుతోంది... ఇంత స్వార్థ రాజకీయాలు చేస్తారా’.. అని ఒకసారి కాకపోతే మరోసారైనా మీకు ఈ రాజకీయాల మీద, మీ హై కమాండ్ మీద విరక్తి కలగలేదా ముఖ్యమంత్రీ? మన ఖర్మ ఏంటంటే.. ఒకవైపేమో ఇంత చేతగాని వ్యక్తి రాష్ట్రానికి సీఎంగా ఉంటే.. మరోవైపు అంతే చేతగాని వ్యక్తి చంద్రబాబు.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. పాలకపక్షాన్ని కాలర్‌పట్టుకొని నిలదీయాల్సిన చంద్రబాబే ఈ విభజనకు కారణమయ్యారు.. ఈయనకంటే నీచుడు, దుర్మార్గుడు మరొకరు ఉంటారా?
 
 కారణం చంద్రబాబు లేఖే..
 కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విభజించే సాహసం చేస్తోందంటే కారణం చంద్రబాబు పలికిన మద్దతే... రాష్ట్రాన్ని ఇష్టమొచ్చినట్లు చీల్చేసుకోండంటూ ఆయన రాసిచ్చిన లేఖే. చేసిందంతా చేసి, పట్టపగలే సీమాంధ్రుల గొంతు కోసి మళ్లీ ఇప్పుడు ఆయన ఈ రోజు ఆత్మగౌరవ యాత్ర అంటూ మొదలు పెట్టారు. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కివెక్కి ఏడ్చాడట ఒకడు. ఈ చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చేసి మళ్లీ ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. ఇంకా ఏ మొహం పెట్టుకొని సీమాంధ్రలో అడుగుపెట్టావని ప్రజలంతా చంద్రబాబును నిలదీయాలి. చంద్రబాబూ మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. చెంపలేసుకొని, నాది తప్పయిపోయింది, తెలంగాణకు అనుకూలంగా నేను ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాలి. ముందు నువ్వు రాజీనామా చెయ్యి, మీ ఎమ్మెల్యేలు, ఎంపీల చేత రాజీనామాలు చేయించు ఆ తరువాత సీమాంధ్రలో అడుగుపెట్టమని ప్రజలంతా చంద్రబాబును తరిమి తరిమి కొట్టాలి.
 
 ఈ మైనారిటీ సర్కారును కాపాడుతుంది చంద్రబాబే..
 ఈ రోజు మన అసెంబ్లీలో సర్కారు నిలబడాలంటే కావాల్సిన బలం 148 మంది ఎమ్మెల్యేలు. కానీ ఈ కాంగ్రెస్ సర్కారుకు ఉన్నది కేవలం 146 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే. మరి మైనార్టీలో ఉన్న సర్కారు ఈ రోజు వరకు ఎలా అధికారంలో ఉంది అని అడిగితే దానికి కారణం చంద్రబాబే. చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని తన భుజాన మోస్తూ కాపాడుతున్నారు కాబట్టే ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో తన మీద విచారణ చేయకుండా ఉండడానికి చంద్రబాబు చీకట్లోనే చిదంబరాన్ని కలుస్తారు. గొప్పగా మేనేజ్ చేసుకుంటారు. ఆఖరికి వైఎస్సార్ చనిపోయారనే ఇంగితం కూడా లేకుండా.. ఆయన మీద అభాండాలు వేస్తూ లక్ష కోట్ల రూపాయలంటూ అబద్ధపు ప్రచారం మొదలుపెట్టిన చంద్రబాబు.. వైఎస్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చేలా, ఆయన కొడుకు మీద కేసులు పెట్టేలా కుమ్మక్కు రాజకీయాలు చేశారు.
 
 జగన్ దోషి అని ఏ కోర్టూ చెప్పలేదు
 లక్ష కోట్లని ప్రచారం చేస్తున్న ఈ చంద్రబాబుకుగాని, జగన్‌మోహన్‌రెడ్డి దోషి అని మాట్లాడుతున్న ప్రతి నాయకుడికీ మళ్లీ సమాధానం చెబుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.  జగన్‌మోహన్‌రెడ్డి దోషి అని ఏ కోర్టూ చెప్పలేదు.. అలాగే ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో చంద్రబాబు నిర్దోషి అని కూడా ఏ కోర్టూ చెప్పలేదు. చిరంజీవి బంధువుల ఇంట్లో దొరికిన రూ.70 కోట్ల గురించి అడిగితే.. ఈ సీబీఐ కంటికి అవి ఏమాత్రం కనిపించలేదు. చిరంజీవి అమాయకుడని ఏ కోర్టూ చెప్పలేదు. బొత్స మాఫియా డాన్ కాదని, ఆయన ఉత్తముడని కూడా ఏ కోర్టూ చెప్పలేదు. కాకపోతే.. వీళ్లందరికీ ఉన్న తెలివితేటలతో తమ మీద విచారణ జరగకుండా మేనేజ్‌చేసుకోగల సమర్థులు వీళ్లంతా.
 
 ఎంత మంది రాజీనామాలు చేశారు?
 హఠాత్తుగా ఏ పరిష్కారమూ చూపించకుండా రాష్ట్రాన్ని విడగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సంకేతాలిచ్చిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా రాజీనామా చేసి నిరాహార దీక్షలు చేశారు. కానీ ఎంత మంది టీడీపీ, కాంగ్రెస్ నాయకులు వాళ్ల పదవులను వదులుకొని ప్రజల పక్షాన గొంతు విప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామాలు చేసిన రోజునే అందరూ రాజీనామాలు చేసుంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని దేశమంతా తిరిగి చూసేది, కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరిగేది. ఈ విభజన ప్రక్రియ ఆగిపోయేది.’’
 
 వర్షంలోనూ ఘనస్వాగతం
 సమైక్య శంఖారావం బస్సు యాత్ర చవితి సందర్భంగా సోమవారం విరామం అనంతరం ఎనిమిదో రోజు మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించింది. భారీ వర్షం కురుస్తుండగా ప్రకాశం జిల్లా ప్రజలు వర్షంలో తడుస్తూనే షర్మిలకు ఘన స్వాగతం పలికారు. కాగా, యాత్ర బుధవారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సాగుతుందని పార్టీ ప్రకటించింది.
 
 ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అయితే ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. అదే కాంగ్రెస్ పార్టీకి తన పార్టీని అమ్మేసిన చిరంజీవికి... ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అయితే ఎన్‌టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే పార్టీతో కుమ్మక్కైన చంద్రబాబుకు ఏమాత్రం తేడా లేదు.    

- షర్మిల
 
 ‘‘కన్నతల్లిలాంటి తెలుగుతల్లికి మీ కాంగ్రెస్ అధిష్టానం వెన్నుపోటు పొడుస్తుంటే మీకు చీమకుట్టినట్లు కూడా లేదు ముఖ్యమంత్రీ! అయ్యో నా ప్రజలకు అన్యాయం జరుగుతోందని కనీసం మీకు ఒక్క క్షణమైనా అనిపించి ఉంటే.. విభజన ప్రకటన వచ్చిన రోజే రాజీనామా చేసుండేవారు కదా. సిగ్గులేకుండా ఇంకా అదే పదవి పట్టుకుని వేలాడుతున్నారే.. అసలు మీరు సంపాదించుకుంటే వచ్చిందా సీఎంగారూ ఆ పదవి? రాజశేఖరరెడ్డి పనితీరు చూసి.. మంచి మనసును చూసి ప్రజలు ఆయన్ను ఆశీర్వదిస్తే.. ఆయన మిమ్మల్ని స్పీకర్‌ను చేస్తే.. మీరు అప్పుడు సోనియా గాంధీకి కనిపిస్తే.. అప్పుడు అయ్యారు మీరు ముఖ్యమంత్రిగా. మీరు సంపాదించుకోని పదవిపై మీకంత మోజెందుకు ముఖ్యమంత్రిగారూ.. ?’’    

- షర్మిల
 
 సమైక్య శంఖారావానికి ఎన్నారైల మద్దతు
 సాక్షి, హైదరాబాద్: షర్మిల చేపట్టిన బస్సు యాత్రకు వైఎస్సార్ సీపీ ఎన్నారై విభాగం నేతలు సంపూర్ణ మద్దతు తెలిపారు. సోమవారం అమెరికాలోని ఇండియానా రాష్ట్రం హార్ట్‌ఫోర్డ్ సిటీలో నేతలంతా పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. రాష్ట్రం సమైక్యత కోసం షర్మిల చేస్తున్న కృషి హర్షించదగినదని, ఆమె తలపెట్టిన యాత్రకు సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పి.రత్నాకర్, కృష్ణమోహన్, శ్రీను వాసిరెడ్డి, రమేష్‌బాబు, జితేందర్‌రెడ్డి, సి.శ్రీధర్, పి.జగన్‌మోహన్, గోపాల్ సుబ్బయ్య, సురేష్‌రెడ్డి, భక్తియార్‌ఖాన్, విజయ్‌రెడ్డిలు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement