మీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా చేయించండి
విభజన ప్రక్రియ ఎందుకు ఆగదో చూద్దాం: షర్మిల
ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ రాష్ట్రాన్ని చీల్చాలనుకుంటోంది
ఆ పార్టీ ప్రకటనతో రాష్ట్రం అగ్ని గుండంలా రగిలిపోతుంటే సీఎం కిరణ్ కళ్లప్పగించి చూస్తున్నారు
సోనియాకు విధేయుడిగా ఉండకపోతే మీ పదవి ఊడిపోతుందా?
చంద్రబాబు పొద్దున లేస్తే.. జగన్‌మోహన్‌రెడ్డి మీద పడి ఏడుస్తారు
జగన్ వద్ద రూపాయి అయినా స్వాధీనం చేసుకున్నారా అని బాబు అంటున్నారట.. రూపాయి కూడా అవినీతి జరగలేదు కాబట్టే.. స్వాధీనం చేసుకోలేకపోయారు
చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లే రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ సాహసం
టీడీపీ సహా ఐదు పార్టీలు విభజనకు అనుకూలంగా ఉంటే.. వైఎస్సార్ సీపీ, సీపీఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యంగా ఉండాలన్నాయి
బాబు లేఖ వెనక్కు తీసుకొని, రాజీనామాలు చేసే వరకు సీమాంధ్రలో అడుగుపెట్టనీయకుండా తరిమికొట్టండి
‘సమైక్య శంఖారావం’ నుంచి ‘సాక్షి ’ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రం అగ్ని గుండంలా రగులుతున్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఈ పార్టీల ప్రజాప్రతినిధులు ఇప్పటికీ గబ్బిలాల్లా పదవులు పట్టుకొని వేలాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరూ మాత్రమే రాజీనామాలు చేశారన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చుతున్నామని ప్రకటన చేసిన వెంటనే మీరు రాజీనామా చేసి ఉంటే అసలు ఈ విభజన ప్రక్రియ ఆరోజే ఆగిపోయేది కాదా కిరణ్‌కుమార్‌రెడ్డి గారూ?’’ అని ప్రశ్నించారు. ‘‘ఇప్పటికైనా మించిపోయింది లేదు. సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పి.. మీరు, మీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయండి, కాంగ్రెస్ ఎంపీల చేత కూడా రాజీనామాలు చేయించండి. ఈ విభజన ప్రక్రియ ఎలా ఆగదో చూద్దాం!’’ అని ఆమె సవాలు విసిరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో షర్మిల చేపట్టిన ‘సమైక్య శంఖారావం’ బస్సు యాత్ర తొమ్మిదో రోజు బుధవారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సాగింది. గుంటూరు జిల్లా వినుకొండ, రేపల్లెలలో, కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన ‘సమైక్య శంఖారావం’ సభలకు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే..
‘‘ఓట్లు, సీట్ల కోసం, రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చడానికి పూనుకొంది. కాంగ్రెస్ ప్రకటనతో మన రాష్ట్రమంతా అట్టుడికిపోతోంది. కోట్ల మంది గుండెలు రగిలిపోతున్నాయి. కానీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం దిష్టిబొమ్మలా నిల్చొని కళ్లప్పగించి చూస్తున్నారు. అసలు కిరణ్‌కుమార్‌రెడ్డీ.. మీరు పదవీ స్వీకారం చేసేటప్పుడు ఏమని ప్రమాణం చేశారు? అధిష్టానానికి, సోనియా గాంధీకి విధేయుడిగా ఉంటానని ప్రమాణం చేశారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్మకంగా పని చేస్తానని ప్రమాణం చేశారా? మరి అప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతానని ప్రమాణం చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు ఎందుకు పొడిచారు? కాంగ్రెస్ హైకమాండ్‌కు, సోనియా గాంధీకి మీరు విధేయులుగా లేకపోతే మీ పదవి ఊడిపోతుందని మీకు భయమా? మీరు కష్టపడని పదవి కోసం మీకు ఎందుకింత పాకులాట? ఎందుకంత మోజు? మీది కాని పదవి మీద మీరు అంత ఆశ పెట్టుకున్నారంటే మీది అత్యాశ కాదా?
చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు..
మన ఖర్మ ఏమిటంటే ఒక వైపేమో తరంగాని(చేతగాని) కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకోవైపేమో అంతే తరంగాని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉన్నారు. కోట్ల మంది గుండెలు రగిలిపోతున్నా చంద్రబాబులో ఏమాత్రం చలనం లేదు. ఎలా ఉంటుంది? అసలు ఈ విభజనకు కారణమే చంద్రబాబు. తెలంగాణను ఇచ్చేసుకుంటే ఇచ్చేసుకోండి అని ఒక బ్లాంకు చెక్కు ఇచ్చేసినట్లు తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాసిచ్చింది ఈ చంద్రబాబే. టీడీపీ సహా ఐదు పార్టీలు రాష్ట్ర విభజనకు సై అంటే.. కేవలం వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, ఎంఐఎం మాత్రమే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్‌తో పాటు చంద్రబాబు కూడా చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకునేంత వరకు, ఆయన రాజీనామా చేసి ఆయన ఎమ్మెల్యేలు, ఎంపీల చేత రాజీనామాలు చేయించేంత వరకు సీమాంధ్రలో చంద్రబాబు అడుగుపెడితే తరిమితరిమి కొట్టాలి.
కాంగ్రెస్ పంజరంలో చిలుక సీబీఐ..
చంద్రబాబు అవినీతి గురించి కథలు కథలుగా చెప్పుకోవచ్చు. ఐఎంజీ కేసులో ఒక మామూలు ఎస్‌ఐ చేత, లేదా ఒక మామూలు హెడ్ కానిస్టేబుల్ చేత నిజాయితీగా విచారణ జరిపించున్నా ఈ పాటికి చంద్రబాబు ఎప్పుడో జైల్లో ఉండేవారు. కానీ చంద్రబాబు మీద విచారణ చేయండీ అంటే సీబీఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా..! చంద్రబాబు మీద విచారణ చేయడానికి తమ దగ్గర సిబ్బంది లేరని చెప్పింది. మరి ఈ సీబీఐకి చంద్రబాబును విచారించడం ఎందకు ఇష్టం లేదో, ఎందుకంత కష్టమో మనకు తెలియంది కాదు. చిరంజీవి సొంత వారింట్లో రూ. 70 కోట్లు మంచం కింద దొరికితే సీబీఐ కంటికి కనిపించలేదు. విచారణ చేయాలని అనిపించలేదు.
బొత్స మన రాష్ర్టంలోనే అతిపెద్ద మాఫియా డాన్ అని, మద్యం వ్యాపారంలో ఈయనకు మించినవారే లేరని, మద్యం వ్యాపారంలో మొత్తం బొత్స బినామీలే ఉన్నారని సొంత పార్టీ నేతలే చెప్తున్నా కూడా సీబీఐకి వినిపించదు. బొత్సను విచారణ చేయాలని సీబీఐకి అనిపించదు. కాంగ్రెస్ పంజరంలో చిలకైన సీబీఐ, కాంగ్రెస్ పెరట్లో కుక్కైన సీబీఐ తీరు ఇది. ఐఎంజీ కేసులో చంద్రబాబుకు ఒక న్యాయం. ఇంకొకరికి ఇంకొక న్యాయంలా వ్యవహరించిన సీబీఐ.. మంత్రుల విషయంలో కూడా ధర్మాన, సబితమ్మకు ఒక న్యాయం, ఈ ప్రాంతానికి(రేపల్లె) చెందిన మోపిదేవి వెంకటరమణకు ఇంకో న్యాయం అన్నట్టు వ్యవహరించింది. అసలు కేసే లేని చోట కేసులు సృష్టించి కేవలం జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయడానికి సాకు లు వెతికి మోపిదేవిని బలిపశువును చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఈ నాయకులు పదవులే ముఖ్యమనుకున్నారు..
హఠాత్తుగా ఎలాంటి పరిష్కారం చూపించకుండానే మన రాష్ట్రాన్ని చీల్చేస్తున్నామనిసంకేతాలు పంపిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు రాజీనామాలు చేశారు. అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, మోపిదేవి వెంకటరమణ సహా సమైక్య రాష్ట్రం కోసం అందరూ రాజీనామాలు చేశారు. నిరాహార దీక్షలు కూడా చేశారు. కానీ ఎంతమంది కాంగ్రెస్, టీడీపీ నాయకులు వాళ్ల పదవులను త్యాగం చేసి ప్రజల తరుపున నోరు విప్పారు? పదవి మత్తులో మునిగి తేలుతున్న ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఓట్లేసిన ప్రజల కంటే తమ పదవులే ముఖ్యమని మళ్లీ నిరూపించుకున్నారు.’’
బాబూ ఇదిగో సమాధానం..
జగన్‌మోహన్‌రెడ్డి లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని రోజూ గింజుకుంటూనే ఉంటారు చంద్రబాబు. నిన్న అన్నారట.. లక్షకోట్ల అవినీతి జరిగితే.. కనీసం ఒక్క రూపాయి అయినా స్వాధీనం చేసుకున్నారా? అని చంద్రబాబు నిలదీశారట. ఇంటికి నిప్పు పెట్టి అగ్గి అగ్గి అని అరిచాడట ఒకడు. అసలు లక్షకోట్లు అవినీతి జరిగిందని అబద్ధపు ఆరోపణలు మొదలు పెట్టిందే చంద్రబాబు. ఆ విషయం అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న మైసూరా రెడ్డిని అడిగితే.. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లు చాలా వివరంగా చెబుతారు. రాజశేఖరరెడ్డి చనిపోయారనే కనీస ఇంగితం కూడా లేకుండా.. లక్ష కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు అబద్ధపు ఆరోపణలు చేసి ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్పించారు.
ఆయన కొడుకు మీద కేసులు పెట్టడంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు. అబద్ధపు ఆరోపణలు మొదలుపెట్టింది కాక ఇప్పుడు చంద్రబాబు అంటారు.. ఒక్క రూపాయి కూడా ఎందుకు స్వాధీనం చేసుకోలేదని! చంద్రబాబూ సమాధానం చెప్తున్నాం వినండి. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు కనుక.. ఒక్క రూపాయి కూడా ఎవ్వరూ స్వాధీనం చేసుకోలేరు. వినపడిందా చంద్రబాబూ.. మళ్లీ చెప్పమంటారా? నిజానికి చంద్రబాబు గింజుకుంటున్నది.. అవినీతి గురించి కాదు.. 16 నెలలుగా జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టినా.. ప్రజల గుండెల్లో ఆయన మీద ఉన్న అభిమానం చెక్కుచెదరలేదనే! పొద్దున లేచింది మొదలుకొని రాత్రి వరకు జగన్‌మోహన్‌రెడ్డి మీద పడి ఏడుస్తారు చంద్రబాబు. రాత్రి కలలో కూడా జగన్‌మోహన్‌రెడ్డిని కచ్చితంగా తలచుకుంటూనే ఉంటారేమో!
- షర్మిల
కిరణ్ కుమార్ రెడ్డి.. రాజీనామా చేయండి: షర్మిల
Published Thu, Sep 12 2013 2:25 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement